
లక్ష్మణ్ త్యాగం వృధా కాదు
బీజేపీ మాజీ అధ్యక్షునికి అద్వానీ నివాళి
అశ్రునయనాలతో అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: ‘పార్టీ కోసం, దేశం కోసం మీరు చేసిన త్యాగం వృథా కాదు. 2014 ఎన్నికల్లో బీజేపీ గెలవబోతోంది..’ అంటూ బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ పార్టీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కు నివాళులర్పించారు. అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన లక్ష్మణ్‌కు ఆదివారం ఇక్కడ పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. అద్వానీతో పాటు పార్టీ జాతీయ నేతలు ప్రకాశ్ జవదేకర్, రాంలాల్, మురళీధర్‌రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యూరు. అంతిమ సంస్కారం సందర్భంగా శ్మశానవాటికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి అద్వానీ ప్రసంగించారు. లక్ష్మణ్ మృతి దళిత జాతికి, దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. దళిత కుటుంబంలో పుట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని ఆర్‌ఎస్‌ఎస్ కోసం, పార్టీ కోసం అహర్నిశలు పని చేశారన్నారు. భారీ వర్షంలోనూ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అంత్యక్రియలకు హాజరయ్యారంటేనే ఆయనపై ఉన్న ఆదరాభిమానాలు ఎంతటివో తెలుస్తున్నాయని, వారి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అం డగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ పంపిన సంతాప సందేశాన్ని వెంకయ్యనాయుడు చదివి వినిపించారు. లక్ష్మణ్ ఆర్‌ఎస్‌ఎస్‌లో క్రమశిక్షణాయుతమైన కార్యకర్తగా పని చేశారని, సంఘం ఆయన పాదాలకు శ్రద్ధాంజలి ఘటిస్తోం దని భగవత్ పేర్కొన్నారు. లక్ష్మణ్‌తో తనకున్న అనుబంధాన్ని వెంకయ్య గుర్తు చేసుకున్నారు.
ప్రముఖులు, పార్టీ నేతల శ్రద్ధాంజలి
పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం లక్ష్మణ్ భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. అంతకుముందు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బీజేపీ నేతకు నివాళులర్పించారు. మధ్యాహ్నం 2.30గంటల వరకు లక్ష్మణ్ భౌతికకాయూన్ని పార్టీ కార్యాలయంలో ఉంచారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, కార్యదర్శివర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, పీజే చంద్రశేఖర్, టీఆర్‌ఎస్ నేతలు కడియం శ్రీహరి, మందా జగన్నాథం, మాజీ గవర్నర్ సత్యనారాయణరెడ్డి, బీజేపీ సీనియర్ నేతలు సీహెచ్ విద్యాసాగరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, అశోక్‌కుమార్ యాదవ్, మురళీధర్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి, వెదిరే శ్రీరాం, చలపతిరావు, డాక్టర్ కె.హరిబాబు, కృష్ణంరాజు తదితరులు ఇక్కడ లక్ష్మణ్ భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అంతిమయాత్ర బయలుదేరింది. భౌతికకాయాన్ని ఆయన కుటుంబసభ్యులతో పాటు వెంకయ్యనాయుడు తదితరులు వ్యాన్‌లోకి తరలించారు. అప్పటికే ఈదురుగాలులతో భారీ వర్షం మొదలయింది. వర్షంలో తడుస్తూనే నేతలు, కార్యకర్తలు ర్యాలీని కొనసాగించారు. వర్షంలో తడిసిన లక్ష్మణ్ కుమారుడు సారుుప్రసాద్ మూర్ఛపోవడంతో దహన కార్యక్రమం కొంచెం ఆలస్యమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, చింతా సాంబమూర్తి, సి.జంగారెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి తదితరులతో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న అద్వానీకి పార్టీ నేతలు కిషన్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు తదితరులు స్వాగతం పలికారు. లక్ష్మణ్ అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్లారు.