bangaru laxman
-
కల్వకుంట్ల చరిత్రను లిఖించదలిచారా?
సాక్షి, యాదాద్రి : స్వామి వారి చరిత్రను పక్కన పెట్టి కల్లకుంట్ల చరిత్రను లిఖించదలిచారా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కేసీఆర్‌పై మండిపడ్డారు. యాదాద్రిలో కేసీఆర్, కారు బొమ్మలు వివాదాస్పదమైన నేపథ్యంలో శనివారం ఆయన కార్యకర్తలతో కలిసి యాదాద్రి గుట్టపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకొని లక్ష్మణ్‌తో పాటు మరో ఐదుగురిని మాత్రమే అనుమతించడంతో గుట్టకింద బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేసీఆర్ నయా నిజాం పాలన చేస్తున్నారని, స్వామివారితో పాటు తన దర్శనం కూడా కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. పవిత్ర క్షేత్రమైన యాదాద్రినే అపవిత్రం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గొప్ప హిందువునని చెప్తారు కానీ ఇతర మతాల చిత్రాలు చెక్కడం దేనికి సంకేతమని నిలదీశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ.. గర్భగుడిలోనూ చిత్రాలు చెక్కుతారా అని ప్రశ్నించారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసిందేనంటూ దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై స్పందిస్తూ దేవుణ్ణి దర్శించడానికి వస్తే ఆంక్షలు పెడుతున్నారనీ, సీఎం కేసీఆర్ ఏమైనా ఆదేశాలిచ్చారా అనేది స్పష్టం చేయాలన్నారు. వారంలోపు బొమ్మలను తొలగించకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. మరోవైపు కేసీఆర్ యజ్ఞయాగాలు చేయడం తన కొడుకు పట్టాభిషేకం కోసమేనని విమర్శించారు. -
టీఎస్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ నిర్వాకం వల్లే రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని, టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను వాడుకొని బిల్లులు చెల్లించలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజా ధనాన్ని కేసీఆర్ దర్వినియోగం చేస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు తెలంగాణలో కూడా విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని ఎవరూ అధైర్య పడవద్దని ఆయన కోరారు. -
అభివృద్ధి రాగం
నాగర్‌కర్నూల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెబుతున్నారు నాగర్‌కర్నూల్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బంగారు శ్రుతి. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం 1952లో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ఎన్ని ప్రభుత్వాలు, లీడర్లు మారినా అభివృద్ధికి నోచుకోలేదు. ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా’నని చెబుతోన్న బంగారు శ్రుతి ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలు మాట్లాడతారు. ‘సాక్షి’తో పంచుకున్న భావాలివీ.. ఏం చేయాలో తెలుసుకున్నాను నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను. పార్టీ మేనిఫెస్టోతో సరిపెట్టుకోకుండా నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నాను. సమస్యలు తెలిశాయి, వాటి పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తాను. అడవులు ఎక్కువగా ఉన్న నల్లమల ప్రాంతంలో పేపర్ పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారిస్తాను. బంగారు శ్రుతి స్వగ్రామం: హైదరాబాద్ తండ్రి: బంగారు లక్ష్మణ్ (బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు) తల్లి: బంగారు సుశీల(మాజీ ఎంపీ) విద్యార్హత: ఎం.టెక్, ఎంబీఏ(ఆస్ట్రేలియా) రాజకీయ అనుభవం: 2006 నుంచి బీజేపీలో యాక్టివ్మెంబర్. 2012 నుంచి బీజేపీ నేషనల్ మెంబర్, ప్రస్తుతం బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి(రాజకీయాల్లోకి రాకముందు 15ఏళ్లు సాఫ్ట్వేర్ కంపెనీలో క్వాలిటీ ఇంజనీర్‌గా ఉద్యోగం). యువతకు నైపుణ్యాభివృద్ధి స్కిల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా యువతకు స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇచ్చి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో వీలైనంత ఎక్కువగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాను. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మూడు జిల్లాల్లో ప్రభుత్వం మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు నెలకొల్పడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తాను. మహిళల స్వయం సమృద్ధి సాధనకు కృషి చేస్తా.– రాజు,సాక్షి– నాగర్‌కర్నూలు -
బంగారు లక్ష్మణ్ సతీమణి కన్నుమూత
హైదరాబాద్: బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు, దివంగత నేత బంగారు లక్ష్మణ్ సతీమణి, మాజీ ఎంపీ బంగారు సుశీల(69) శనివారం సాయంత్రం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆమె గత నెల 17న ఆసుపత్రిలో చేరారు. డయాలిసిస్ కొనసాగుతుండగానే ఆమె రాత్రి ఏడుగంటల ప్రాంతంలో మృతి చెందారు. గతంలో ఆమె రాజస్తాన్‌లోని జాలోర్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని స్వగృహానికి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పంజగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆమె మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోసుపల్లి ప్రతాప్ సంతాపం ప్రకటించారు. ఆమె మరణం వెనుకబడిన వర్గాలు, పార్టీకి తీరని లోటు అని అన్నారు. వైఎస్ జగన్ సంతాపం బంగారు లక్ష్మణ్ సతీమణి, మాజీ ఎంపీ బంగారు సుశీల మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు. సుశీల కుటుంబ సభ్యులకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
మజ్లిస్ మెప్పు కోసమే...
-
మజ్లిస్ మెప్పు కోసమే...
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ మెప్పు పొందేందుకే ప్రధాని మోదీపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఎన్నికలు దగ్గర పడడం, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మెప్పు పొందేందుకు నానా పాట్లు పడుతున్న కేసీఆర్, బీజేపీపై, ప్రధానిపై విమర్శలకు దిగుతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతాంగ సంక్షేమంకోసం ప్రధాని చేపడుతున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగం కోసం కేంద్రం నుంచి కోట్ల రూపాయల నిధులు వస్తున్నా, వాటిని ఖర్చుచేయలేక, ఆ విషయం జనం గమనించి ఎక్కడ ఈసడించుకుంటారోనన్న ఆందోళనతోనే కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి నాలుగేళ్లు నిద్రమత్తులో జోగిన సీఎం, ఎన్నికల ఏడాది కావటంతో రైతు సమన్వయ కమిటీల పేరుతో జిమ్మిక్కులు మొదలుపెట్టారని విమర్శించారు. సిర్పూర్ కాగజ్‌నగర్ మిల్లు తెరిపించలేక చేతులెత్తేసి, కమీషన్ల వేటలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అంటూ కాంట్రాక్టర్లతో మిలాఖత్ అయ్యారని ఆరోపించారు. ప్రధానిని కించపరిచేలా మాట్లాడిన సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మలు దహనం చేశాయి. కొన్నిచోట్ల రాస్తారోకోలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. -
టీఆర్ఎస్కు రోజులు దగ్గర పడ్డాయి
శంకర్పల్లి: రైతాంగ సమస్యలను విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. గత ఎన్నికల్లో ఓట్ల కోసం అన్నదాతలకు కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర కల్పించకుండా మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలో జరిగిన కిసాన్ మోర్చా రైతుపోరుసభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువగా ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఒకేసారి రుణమాఫీ చేస్తామని, ఉచితంగా బోర్లు వేయిస్తామని, పెట్టుబడి వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని, ప్రకృతి వైపరీత్యాలు జరిగితే రైతులను ఆదుకునేందుకు నిధి ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఉద్యోగాలేవీ...: రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చిన పాపాన పోలేదని, ఒక్క టీచర్ పోస్టూ భర్తీ కాలేదని లక్ష్మణ్ అన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పేరుతో పబ్బం గడుపుతున్న ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి యువత సిద్ధంగా ఉందని హెచ్చరించారు. బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, ఏ కులానికి ఎన్ని నిధులు ఖర్చుపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని, దీనిపై బీసీలను ఐక్యం చేసి ఉద్యమం చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్దం బాల్‌రెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నాయకులు సుగుణాకర్‌రావు, శేఖర్జీ, ఆచారి పాల్గొన్నారు. -
లక్ష్మణ్ త్యాగం వృధా కాదు
బీజేపీ మాజీ అధ్యక్షునికి అద్వానీ నివాళి అశ్రునయనాలతో అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: ‘పార్టీ కోసం, దేశం కోసం మీరు చేసిన త్యాగం వృథా కాదు. 2014 ఎన్నికల్లో బీజేపీ గెలవబోతోంది..’ అంటూ బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ పార్టీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కు నివాళులర్పించారు. అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన లక్ష్మణ్‌కు ఆదివారం ఇక్కడ పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. అద్వానీతో పాటు పార్టీ జాతీయ నేతలు ప్రకాశ్ జవదేకర్, రాంలాల్, మురళీధర్‌రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యూరు. అంతిమ సంస్కారం సందర్భంగా శ్మశానవాటికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి అద్వానీ ప్రసంగించారు. లక్ష్మణ్ మృతి దళిత జాతికి, దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. దళిత కుటుంబంలో పుట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని ఆర్ఎస్ఎస్ కోసం, పార్టీ కోసం అహర్నిశలు పని చేశారన్నారు. భారీ వర్షంలోనూ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అంత్యక్రియలకు హాజరయ్యారంటేనే ఆయనపై ఉన్న ఆదరాభిమానాలు ఎంతటివో తెలుస్తున్నాయని, వారి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అం డగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ పంపిన సంతాప సందేశాన్ని వెంకయ్యనాయుడు చదివి వినిపించారు. లక్ష్మణ్ ఆర్ఎస్ఎస్లో క్రమశిక్షణాయుతమైన కార్యకర్తగా పని చేశారని, సంఘం ఆయన పాదాలకు శ్రద్ధాంజలి ఘటిస్తోం దని భగవత్ పేర్కొన్నారు. లక్ష్మణ్‌తో తనకున్న అనుబంధాన్ని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. ప్రముఖులు, పార్టీ నేతల శ్రద్ధాంజలి పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం లక్ష్మణ్ భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. అంతకుముందు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బీజేపీ నేతకు నివాళులర్పించారు. మధ్యాహ్నం 2.30గంటల వరకు లక్ష్మణ్ భౌతికకాయూన్ని పార్టీ కార్యాలయంలో ఉంచారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, కార్యదర్శివర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, పీజే చంద్రశేఖర్, టీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, మందా జగన్నాథం, మాజీ గవర్నర్ సత్యనారాయణరెడ్డి, బీజేపీ సీనియర్ నేతలు సీహెచ్ విద్యాసాగరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, అశోక్‌కుమార్ యాదవ్, మురళీధర్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి, వెదిరే శ్రీరాం, చలపతిరావు, డాక్టర్ కె.హరిబాబు, కృష్ణంరాజు తదితరులు ఇక్కడ లక్ష్మణ్ భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అంతిమయాత్ర బయలుదేరింది. భౌతికకాయాన్ని ఆయన కుటుంబసభ్యులతో పాటు వెంకయ్యనాయుడు తదితరులు వ్యాన్‌లోకి తరలించారు. అప్పటికే ఈదురుగాలులతో భారీ వర్షం మొదలయింది. వర్షంలో తడుస్తూనే నేతలు, కార్యకర్తలు ర్యాలీని కొనసాగించారు. వర్షంలో తడిసిన లక్ష్మణ్ కుమారుడు సారుుప్రసాద్ మూర్ఛపోవడంతో దహన కార్యక్రమం కొంచెం ఆలస్యమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, చింతా సాంబమూర్తి, సి.జంగారెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి తదితరులతో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న అద్వానీకి పార్టీ నేతలు కిషన్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు తదితరులు స్వాగతం పలికారు. లక్ష్మణ్ అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్లారు. -
బంగారు లక్ష్మణ్ అంత్యక్రియలు పూర్తి
-
జిల్లాతో ‘బంగారు’ బంధం
బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కు మన జిల్లాతో ఎనలేని అనుబంధం ఉంది. జాతీయ నాయకుడిగా ఎదిగిన ఆయన రాజకీయ అరంగేట్రం జిల్లా నుంచే ఆరంభమైంది. అప్పటి మేడారం అసెంబ్లీ, తర్వాత పెద్దపల్లి లోక్‌సభ స్థానాలకు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ.. ఈ ప్రాంతం నుంచే కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహించి జిల్లావాసులకు దగ్గరయ్యారు. జనసంఘ్, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బీజేపీలలో క్రియాశీలకంగా పనిచేసిన బంగారు లక్ష్మణ్‌కు జిల్లాలో ని చాలామంది నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం ఆయన మరణించారనే విషయం తెలుసుకున్న అభిమానులు విషాదానికి లోనయ్యారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బీజేపీ ఆవిర్భావానికి ముందు భారతీయ జన్‌సంఘ్ పార్టీ కార్యకలాపాలు కొనసాగించిన సమయంలో బంగారు లక్ష్మణ్ 1972లో మేడా రం అసెంబ్లీ(ఎస్సీ) నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేవలం రెండువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వెంకటస్వామి అన్న కుమారుడు, కాంగ్రెస్ పార్టీకి చెంది న అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే గుడిసెల ఈశ్వర్‌పై బంగారు లక్ష్మణ్ పోటీ చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత బసంత్‌నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ, రామగుండం ఎరువుల కర్మాగారం, అంతర్గాం స్పిన్నింగ్ వీవింగ్ మిల్లు కార్మిక సంఘాలకు నాయకుడిగా పలుమార్లు ఎన్నికయ్యారు. 1977 లో జరిగిన ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి ఎంఆర్.కృష్ణపై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 1980లో శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ పక్షాన ఎమ్మెల్సీగా గెలిచారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే శాసనమండలిని రద్దు చేయడంతో లక్ష్మణ్ పదవిని కోల్పోయారు. అనంతరం పార్టీ క్రియాశీల రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించిన ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన ప్రధానమంత్రి వాజ్‌పేయి కేబినెట్లో రైల్వేశాఖ మంత్రిగా పనిచేశారు. జాతీయ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత రైల్వేశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రైల్వే మంత్రి హోదాలో పెద్దపల్లిలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరి చేసింది ఆయనేనని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. బీజెపీ జాతీయ అధ్యక్షుడిగా 2000 సంవత్సరంలో ఎన్టీపీసీలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశాలకు బంగారు లక్ష్మణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అప్పటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య ఆధ్వర్యంలో లక్ష్మణ్‌కు వెండి కిరీటాన్ని బహుకరించి ఘనంగా సన్మానించారు. 2008లో ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి, దివంగత బయ్యపు కిషన్‌రెడ్డిలు ఒకప్పుడు మంగారు లక్ష్మణ్‌కు ప్రధాన అనుచరులుగా కొనసాగినవారే. జనసంఘ్ పార్టీకి రాజీనామా చేసిన ముకుందరెడ్డి 1982లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బంగారు లక్ష్మణ్ మరణం పట్ల మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, బీజేపీ రాష్ట్ర అధికారిప్రతినిధి ఎస్.కుమార్, ఎఫ్‌సీఐ ఉద్యోగుల సంఘం నాయకులు బొర్ర సత్యనారాయణ తదితరులు సంతాపం ప్రకటించారు. -
బంగారు లక్ష్మణ్ కన్నుమూత
అనారోగ్యంతో నెలరోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స కార్మిక నాయకుడి నుంచి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఎదుగుదల అవినీతి ఆరోపణలతో పతనమైన రాజకీయ జీవితం సంతాపం తెలిపిన రాజ్‌నాథ్, భగవత్ నేడు పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ శనివారం కన్నుమూశారు. సికింద్రాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 5.15 నిమిషాల సమయంలో మృతి చెందారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆయనకు భార్య సుశీల, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. లక్ష్మణ్ భార్య సుశీల 2004లో రాజస్థాన్‌లోని ఝాలోర్ నియోజకవర్గంనుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కుమార్తె శృతి ప్రస్తుతం బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శిగా బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. గతంలో బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న లక్ష్మణ్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూనే గత నెల మూడోతేదీన ఆసుపత్రిలో చేరారు. మూత్రపిండాలు, కాలేయం పూర్తి దెబ్బతినడంతో ఆయనను ఐసీయూలో ఉంచే చికిత్స అందిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 5.15 నిమిషాలకు ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కన్నుమూశారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆయన పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలోని బెల్లా విస్తా అపార్ట్‌మెంట్‌కు తరలించారు. లక్ష్మణ్ మృతితో ఆయన స్వగ్రామం సిద్దంతి బస్తీలోనూ విషాదఛాయలు అలముకున్నాయి. ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉంచుతారు. అనంతరం పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ హైదరాబాద్ రానున్నారు. ప్రముఖుల సంతాపం బంగారు లక్ష్మణ్ మృతదేహాన్ని బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్, బద్దం బాల్‌రెడ్డి, సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ సందర్శించి నివాళులర్పించారు. లక్ష్మణ్ మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, మాజీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు, ఆర్ఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడు మోహన్‌భగవత్, కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవి, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్రావు లక్ష్మణ్ మృతిపట్ల సంతాపం తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు పీవీ చలపతిరావు, జాతీయ నాయకులు ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్. రామచంద్రరావు, తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ రాజేశ్వరరావు, పార్టీ అధికార ప్రతినిధి ఎస్. కుమార్‌లు లక్ష్మణ్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్‌లు కూడా సంతాపం తెలిపారు. ఎత్తు పల్లాల ‘బంగారు లక్ష్మణ’ం ఎతైన శిఖరం పక్కనే లోయ ఉంటుందన్నట్టుగా బంగారు లక్ష్మణ్ రాజకీయ జీవితం ముందుకు సాగింది. లక్ష్మణ్ 1939 మార్చి 17వ తేదీన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలోని సిద్దంతి బస్తీలోని అతి సామాన్య దళిత కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్ నాంపల్లి గవర్నమెంట్ హైస్కూలులో పదవ తరగతి వరకు, ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కాలేజీలో ఎల్ఎల్బీ చదివారు. 12 ఏళ్ల వయస్సులోనే ఆర్ఎస్ఎస్లో చేరారు. 1958 -69 వరకు రాష్ట్ర విద్యుత్ శాఖలోనూ, కేంద్ర రైల్వే, ఏజీ శాఖలలో వివిధ ఉద్యోగ బాధ్యతలను నిర్వహించి ఆ తరువాత జనసంఘ్‌లో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా చేరిపోయారు. బీహెచ్ఈఎల్, మిథానీ, ఎఫ్ఐసీ కార్మిక నాయకుడి బాధ్యతలు నిర్వహించిన ఆయన ఎమర్జెన్సీ కాలంలో జైలు శిక్షను అనుభవించారు. 1978లో అప్పటి జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ, 1986లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండేళ్ల పాటు పదవీ బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా ఏడేళ్లు పనిచేశారు. 1985- 86 మధ్య కాలంలో రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగానూ, 1996లో గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వాజ్‌పేయ్ మంత్రివర్గంలో రైల్వే, ప్లానింగ్ మరియు ప్రోగామింగ్ మంత్రిత్వ శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడుగా, 2000 -2001 మధ్య కాలంలో బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. తెహల్కా పత్రిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో చిక్కుకొని అవినీతి ఆరోపణలతో ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అవే ఆరోపణలతో రెండేళ్ల కిత్రం కోర్టు ఆయనకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. ఒక దళిత నేతగా అత్యున్నత శిఖిరాలకు ఎదిగిన తనను చూసి ఓర్వలేని వారు కక్ష కట్టి అక్రమ కేసులలో ఇరికించారంటూ ఆయన చివరివరకు తన సన్నిహితుల వద్ద చెబుతుండేవారు. -
బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కన్నుమూత