
తాజాగా ‘సాఫ్ట్‌వేర్’ బేజార్
అమలాపురం :ఈ సంవత్సరంలో ఇంకో రెండు నెలలు గడవాల్సి ఉన్నా.. ఈ ఏటి ‘అత్యంత దుర్భర పరిహాసం’ ఏమిటో ఇప్పుడో చెప్పెయ్యవచ్చు. అదే.. టీడీపీ సర్కారు ‘రుణమాఫీ’ హామీ అమలులో అటు అర్హులైన వారిలో, ఇటు అధికారుల్లో సృష్టిస్తున్న గజిబిజి, గందరగోళం. అమలు సర్వం గందరగోళంగా మారింది. ఎన్నికల ఏరు దాటడానికి ఆ పార్టీ ఎన్నుకున్న తెప్పల్లో రుణమాఫీ వాగ్దానం ప్రధానమైనది. అయితే అధికారంలోకి వచ్చి, సంబంధిత ఫైలుపై సీఎం చంద్రబాబు తొలి సంతకం పెట్టిన క్షణం నుంచి ఇప్పటి వరకూ.. అటు రైతులు, ఇటు డ్వాక్రా మహిళల ఆశలతో బంతాట ఆడుకుంటోంది. వారిని నిత్యం ఊగిసలాటలోకి నెడుతోంది. మాఫీకి విధించిన నిబంధనలు, రైతులు, బ్యాంకుల నుంచి కోరిన సమాచారం, మాఫీకి కేటాయించిన అరకొర నిధులు.. ఇలా సర్కారు చేస్తూ వచ్చిన పరిహాసం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా రైతు రుణమాఫీ లబ్ధిదారుల డేటా ఎంట్రీకి ప్రభుత్వం ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, సిబ్బంది చేసిన తప్పిదాలు బ్యాంకర్లను
గడువు పెంచినా గందరగోళమే..
రుణమాఫీ డేటా ఎంట్రీ సాఫ్ట్‌వేర్‌లో చోటు చేసుకున్న లోపాల వల్ల బ్యాంకు ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. డేటా ఎంట్రీ గడువు సోమవారంతో ముగిసింది. తొలుత ఈ నెల 25 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం కోరగా, బ్యాంకులు కోరడంతో 27 తుది గడువుగా నిర్ణయించారు. డేటా ఎంట్రీ పూర్తి చేస్తే మాఫీ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఎక్కువ రోజులు గడువు ఇవ్వకపోవడంతో వాణిజ్య, సహకార బ్యాంకులు హడావిడిగా డేటా ఎంట్రీని పూర్తి చేశాయి. సమయం లేకపోవడం, డేటా ఎంట్రీపై పెద్దగా అనుభవం లేని కొన్ని సహకార బ్యాంకుల్లో బయట వ్యక్తులతో ఆ పని పూర్తి చేయించారు.
దీని వల్ల, డేటా ఎంట్రీకి ప్రభుత్వం వాడుతున్న ఎన్‌ఐసీ ప్లాట్‌ఫామ్ సాఫ్ట్‌వేర్ లోపాల వల్ల కూడా డేటా ఎంట్రీలో పొరపాట్లు చోటు చేసుకుంటున్నాయి. లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం 34 రకాల సమాచారం కోరింది. ఆధార, రేషన్‌కార్డు, పాస్‌బుక్, సర్వే నంబరు వంటి సమాచారం రైతుల నుంచి, రుణాలు ఎందుకు, ఎప్పుడు తీసుకున్నారు, బకాయిల మొత్తం వంటి వివరాలను బ్యాంకర్ల నుంచి సేకరిస్తోంది. దీనికి ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేసి దానిలో డేటాను ఎంట్రీ చేయాలని సూచించింది. డేటా ఎంట్రీ చేసి బ్యాంకులు తమ ప్రధాన కార్యాలయాలకు పంపించాయి. అయితే కొంతమంది లబ్ధిదారుల డేటాల్లో కొన్ని తప్పులు వచ్చాయని, మార్పులు చేయాలని డీసీసీబీతోపాటు పలు వాణిజ్య బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నుంచి వాటి శాఖలకు సోమవారం మధ్యాహ్నం సమాచారం వచ్చింది. దీనితో డేటా ఎంట్రీ ఉద్యోగులు, సిబ్బంది హడావిడిగా మరోసారి డేటాను అప్‌లోడ్ చేశాయి.
రేషన్‌కార్డుతో ఇంకో చిక్కు..
ఇదిలా ఉండగా రుణమాఫీ లబ్ధిదారులకు మరో కొత్త చిక్కువచ్చి పడింది. రేషన్‌కార్డులకు ఆధార్ అనుసంధానం చేసిన సమయంలో చాలా మంది ఇంటి యజమాని ఆధార్ నంబర్లు ఇచ్చారు. వీటినే పౌరసరఫరాల అధికారులు నమోదు చేసుకున్నారు తప్ప మొత్తం కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లను నమోదు చేయలేదు. ఇప్పుడు ఇంటి యజమాని కాక అతని భార్య లేదా కొడుకు, కూతురు పేరు మీద రుణం తీసుకున్న వారు మాఫీ కోసం రేషన్‌కార్డు ఇచ్చినప్పటికీ దానికి ఆధార్ నంబరు సరిపోక తిరస్కరణకు గురవుతుంది. దీని విషయంలో ప్రభుత్వం మినహాయింపు ఇవ్వకపోతే చాలా మంది అర్హులకు రుణమాఫీ ప్రయోజనం అందక నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.