రుణాలు పూర్తిగా మాఫీ చేయూల్సిందే
జెడ్పీ సర్వసభ్య సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్ బాష డిమాండ్
చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయాలన్న అధికారపక్ష సభ్యులు
అన్ని రుణాలు పూర్తిగా మాఫీ చేశాక అలా చేస్తే అభ్యంతరం లేదన్న విపక్ష సభ్యులు
ఎమ్మెల్యే విశ్వ రైతు పక్షాన మాట్లాడుతుంటే పక్కదారి పట్టించేయత్నం చేసిన అధికార పక్షం
అనంతపురం సెంట్రల్ : ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీ, జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా పూర్తిగా రుణ మాఫీ చేసి చిత్తశుద్ది నిరూపించుకోవాలని ప్రతిపక్షసభ్యులు నిలదీస్తే, అలా వీలు కాదంటూ అధికార పక్షం నేతలు వాగ్వాదానికి దిగడంతో జెడ్పీ సమావేశ హాలు దద్దరిల్లింది. మంగళవారం జిల్లా పరిషత్ రెండవ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్మన్ చమన్ అధ్యక్షతన నిర్వహించారు. సభ ప్రారంభమైన వెంటనే పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు జిల్లాలో పాదయాత్ర చేస్తూ రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామి ఇచ్చారన్నారు. అందులో భాగంగా రైతుల రుణాలను మాఫీ చేస్తున్నారని, చంద్రబాబుకు కృతజ్ఞతగా ఏకగ్రీవ తీర్మానం చేయాలని ప్రతిపాదించారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కలుగజేసుకుని మాట్లాడుతూ.. జిల్లాలో వరుస కరువులు సంభవిస్తున్నాయని, జిల్లాను శాశ్వత కరువు ప్రాంతంగా గుర్తించాలన్నారు. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను గుర్తించి రుణాలన్నీ మాఫీ చేయాలని కోరుతూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించిందని, దానినే అడుగుతున్నామన్నారు.
రాజధాని కోసం భూములు కోల్పోతున్న పరిసర ప్రాంతాల్లో రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తున్నారని తెలిపారు. రైతు రుణాలన్నీ మాఫీ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును జిల్లాకు రప్పించి సన్మానం చేసినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. జిల్లాలో 10.24 లక్షల ఖాతాలుంటే 8.06 లక్షల ఖాతాలు మాత్రమే రుణమాఫీ అర్హత సాధించాయన్నారు. దీని వలన అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కావున జిల్లాలో రైతులు తీసుకున్న 7 వేల కోట్ల రుణాలను మాఫీ చేయూలని తీర్మానం చేయాలని కోరారు. ఎమ్మెల్యే బీకే పార్థసారథి కలుగజేసుకొని చంద్రబాబునాయుడు ఏమీ చేయలేదన్నట్లుగా మాట్లాడడం భావ్యం కాదన్నారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డి అసాధ్యమన్న రుణ మాఫీని చంద్రబాబు సుసాధ్యం చేసి చూపిస్తున్నాడని అన్నారు. రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఏర్పడిందని, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయన్నారు. పూర్తిగా రుణమాఫీ చేయాలని అడిగేందుకు కూడా పేదరికం అడ్డువస్తుందా అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషా అధికార పక్ష సభ్యులను నిలదీశారు. జిల్లాలో టీడీపీ అధికారంలోకి వచ్చాక 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇలాంటి సమయంలో కూడా రాజకీయం చేయడం తగదన్నారు. మొత్తం రుణాలు రూ.7 వేల కోట్లు కాగా ట్రాక్టర్ లోన్లు పోనూ రూ.4800 కోట్లు మాఫీ చేస్తున్నామ,. దేశంలో ఈ విధంగా ఎక్కడా చేయలేదంటూ టీడీపీ ఎమ్మెల్యే బీకేపార్థసారథి, వరదాపురం సూరి పేర్కొన్నారు. రుణ మాఫీ హామీ రాష్ట్రం విడిపోక ముందు ఇచ్చినదని, అయినా కూడా రైతుల కోసం చంద్రబాబు ఆ హామీ నెరవేరుస్తున్నారని చెప్పారు. అలాంటప్పుడు ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎలా ప్రకటించారని ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌బాషా ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు జెడ్పీటీసీ సభ్యుడు రవీంద్రారెడ్డి మాట్లాడుతూ... జిల్లా పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పింఛన్ విషయంలో ఏ విధంగా అయితే 10 ఎకరాల వరకూ మినహాయింపు ఇచ్చారో అదే విధంగా రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేయూలన్నారు.
ఉన్నం హనుమంతరాయ చౌదరి కలుగజేసుకొని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత హామీలు ఇచ్చారంటూ సభను పక్కదోవ పట్టించే యత్నం చేశారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణాలో మిగులు బడ్జెట్ ఉన్నా రూ.లక్ష మాత్రమే మాఫీ చేశారని, రూ. 16వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా మన రాష్ట్రంలో రూ. 1.50 లక్షలు చేస్తున్న విషయాన్ని గుర్తిస్తూ.. సీఎంకు అభినందనలు తెలియజేస్తూ ఏకగీవ్ర తీర్మానం చేయాలని సూచించారు. ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించమని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, విప్ యామిని బాల, జెడ్పీ వైస్‌చెర్మైన్ సుభాషిణమ్మ హాజరయ్యారు.