అమలుకు నోచని ఎన్నికల హామీలు | no implementation of the guarantees | Sakshi
Sakshi News home page

అమలుకు నోచని ఎన్నికల హామీలు

Published Tue, Dec 9 2014 1:11 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

అమలుకు నోచని  ఎన్నికల హామీలు - Sakshi

అమలుకు నోచని ఎన్నికల హామీలు

గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు.. బందరు పోర్టుకు వీడని భూగ్రహణం
రుణ‘మాయ’తో అన్నదాత కుదేలు
మహిళల జీవితాల్లోనూ మాఫీ చిచ్చు
పింఛను పేరుతో వంచన
ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు విలవిల
వీవోఏల ఉపాధికి ఎసరు

 
విజయవాడ : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి ఆరు నెలలు పూర్తయ్యింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు జిల్లాపై హామీల వరద కురిపించారు. అందులో వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ, పింఛన్ల సొమ్ము పెంపు, బందరు పోర్టు నిర్మాణం, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన లేదా నిరుద్యోగ భృతి చెల్లింపు వంటి అనేక ప్రధాన అంశాలున్నాయి. గడచిన ఆరు నెలల్లో ఒక్కటి కూడా జిల్లావాసుల దరిచేరలేదు.

రుణమాఫీ.. అంతా గందరగోళమే...

జిల్లాలో 7.03 లక్షల మంది రైతులకు రూ.9,137 కోట్లు రుణమాఫీ జరగాల్సి  ఉంది. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. తొలి సంతకమే రుణమాఫీ ఫైలుపై చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. కోటయ్య కమిటీ ఏర్పాటు ఫైలుపై సంతకం చేసి.. అనేక నిబంధనలు, వడపోతలు పెట్టి జాబితాలు రూపొందించారు. ఆధార్, రేషన్ కార్డులను రుణమాఫీకి అనుసంధానం చేశారు. ఎన్నికల్లో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకొచ్చాక మాట మార్చారు. పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అందులోనూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తాజాగా నిబంధన పెట్టి.. తొలి విడత జాబితా ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఈ జాబితాలోనూ స్పష్టత లేదు. జిల్లాలో ఎంతమందికి లబ్ధి చేకూరుతుందో బ్యాంకర్లు కూడా చెప్పలేకపోతున్నారు. మరోపక్క డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి.. ఇప్పుడు ఒక్కొక్కరికి రూ.10 వేల సాయం అందిస్తానని మాత్రమే చెబుతున్నారు. జిల్లాలో 58 వేల డ్వాక్రా గ్రూపులకు రూ.918 కోట్లు రుణమాఫీ కావాల్సి ఉంది. సకాలంలో రుణాలు చెల్లించలేదని మరో రూ.18 కోట్లు డ్వాక్రా గ్రూపుల నుంచి వడ్డీగా వసూలు చేసేందుకు బ్యాంకర్లు సిద్ధమౌతున్నారు. ప్రభుత్వం సకాలంలో రుణమాఫీ సొమ్ము చెల్లించకపోవడంతో బ్యాంకర్లు మహిళలు దాచుకున్న పొదుపు నుంచి బకాయిలను మినహాయించుకుంటున్నారు. అయినా నేటికీ డ్వాక్రా రుణాల మాఫీ ఎప్పుడు చేస్తారనేది స్పష్టత లేదు.
 
అవ్వాతాతలకు షాక్...


ఎన్నికల్లో తనను గెలిపిస్తే వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ.1,500 పింఛను ఇస్తానని హోరెత్తించిన చంద్రబాబు.. అధికారంలోకొచ్చాక అవ్వాతాతలకు షాకిచ్చారు. పింఛన్లలో భారీగా కోతపెట్టి.. వస్తున్న పింఛన్లు కూడా రద్దు చేశారు. జిల్లాలో ఎన్నికలకు ముందు 3.13 లక్షల పింఛన్లు ఉండగా, వాటిలో 36 వేలను ప్రభుత్వం రద్దు చేసింది. ఒక్క విజయవాడలోనే ఎన్నికలకు ముందు 35,200 ఉండగా, అందులో 7,200 పింఛన్లు రద్దు చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 42,200 మంది కొత్తగా పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
 
పేదల ఇళ్ల బకాయి చెల్లింపుల్లో జాప్యం
 
జిల్లాలో ప్రస్తుతం 5,500 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు నిర్మించుకుంటున్నారు. వారికి రూ.12 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. కొత్తగా 35 వేల మంది ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోగా, 33 వేల మంది పేర్లు ఆన్‌లైన్ చేశారు. వీరి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని గృహ నిర్మాణ శాఖాధికారులు చెబుతున్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం

నూజివీడులోని ట్రిపుల్ ఐటీ కళాశాలతో పాటు వివిధ కోర్సులు చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము అందకపోవడంతో అనేకమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 18,500 మంది ఎస్సీ, 60 వేల మంది బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ జరగలేదు. పీజీ, ట్రిపుల్ ఐటీ ఆఖరి సంవత్సరం చదివే విద్యార్థులు తప్పనిసరై అప్పులు చేసి ఫీజులు చెల్లించుకుంటున్నారు.
 
పులి‘చింతలు’ తీరలేదు


అధికారం వచ్చిన వెంటనే పులిచింతల ప్రాజెక్టు పనులు పూర్తిచేసి కృష్ణాడెల్టా రైతాంగం కన్నీరు తుడుస్తానని చెప్పారు. పులిచింతల ప్రాజెక్టులో 45.77 టీఎంసీల నీరు నిల్వ చేయాల్సి ఉండగా, ముంపు ప్రాంతాల ప్రజలు ఖాళీ చేయకపోవడం, ప్రాజెక్టు పనులు పూర్తికాకపోవడంతో ప్రస్తుతానికి 13 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ చేస్తున్నారు. దీంతో వచ్చే వేసవిలో, ఖరీఫ్‌లోనూ నీటి ఎద్దడి యథావిధిగా ఉంటుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
 
శంకుస్థాపనకు నోచుకోని బందరు పోర్టు

 
అధికారంలోకి రాగానే బందరు పోర్టుకు శంకుస్థాపన చేసి ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు శంకుస్థాపన ప్రస్తావనే ఎత్తడం లేదు. బందరు పోర్టు విస్తరణకు 5,324 ఎకరాల భూమి అవసరం కాగా 2,400 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. మిగిలిన భూమి సేకరణకు ఇప్పటివరకు రైతులతో అధికారులు కాని, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కాని చర్చించిన దాఖలాలు లేవు. పోర్టు భూసేకరణకు రూ.540 కోట్ల నిధులు అవసరం. భూసేకరణ నిధుల మంజూరులో కాని, సేకరణ నోటిఫికేషన్ జారీలో కాని ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు.
 
అంతర్జాతీయ విమానాశ్రయం.. కాగితాలకే పరిమితం

గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు ప్రకటనలకే పరిమితమైంది. 465 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంది. భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌కే పరిమితమైంది తప్ప నిధులు మంజూరు చేయలేదు.
 
హామీలన్నీ.. అమలుకు దూరంగానే...
 
మహిళలపై దాడుల్ని అరికట్టేందుకు వారికి సెల్‌ఫోన్లు ఇస్తానంటూ విజయవాడలో జరిగిన మహిళా గర్జనలో చంద్రబాబు ఆర్భాటంగాప్రకటించారు. సెల్‌ఫోన్లు ఇవ్వడం మాట పక్కన పెడితే గత ఆరు నెలల కాలంలో జిల్లాలో చైన్ స్నాచింగ్‌లు యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.
 
విజయవాడ-నూజివీడు మధ్య ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా మార్చుతామంటూ ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం ఐటీ రంగాన్ని విశాఖపట్నంలో అభివృద్ధి చేస్తామని చెప్పడంతో ఈ ప్రాంత ప్రజలు నిరాశ చెందుతున్నారు. చెవిటికల్లు-అమరావతి మధ్య వారధిని నిర్మించి కృష్ణా-గుంటూరు జిల్లా మధ్య దూరం తగ్గిస్తానన్న హామీపైనా స్పందన లేదు. అధికారంలోకి రాగానే  విజయవాడ దుర్గగుడి వద్ద ఫై ్లఓవర్‌కు శంకుస్థాపన చేస్తామని ఇక్కడ ధర్నా చేసి మరీ చంద్రబాబు ప్రకటించారు.
 
విజయవాడలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కావాలనేది ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. దాన్ని తీర్చుతానంటూ ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటివరకు దానికి నిధులు మంజూరు కాలేదు.విజయవాడ ఔటర్ రింగ్‌రోడ్డు పనులు వేగవంతం చేస్తానని ఇచ్చిన హామీ కార్యరూపమే దాల్చలేదు. విజయవాడలోని ఆటోనగర్‌ను ట్రాన్స్‌పోర్టు హబ్‌గా మార్చుతానంటూ ఇచ్చిన హామీ ఊసే పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆటోనగర్ వాసుల కష్టాలను తీర్చే ప్రణాళిక కూడా ప్రభుత్వం ఏమీ చేయలేదు.
 
జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర, బస్సు యాత్ర, మహిళా గర్జన తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన హామీలు మాత్రమే ఇవి. ఇక జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడి ప్రజల కష్టాలను తెలుగు తమ్ముళ్ల ద్వారా తెలుసుకుని వాటిపై ఇబ్బడి ముబ్బడిగా హామీలు గుప్పించారు. ప్రస్తుతం వాటిని పట్టించుకునేందుకు అధికాార పార్టీ ప్రజాప్రతినిధులకే తీరిక లేదు.ఇక ఎన్నికల్లో అధికారంలోకి రాగానే తెలుగుదేశం నేతలు, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తానంటూ హామీలు గుప్పించిన చంద్రబాబు ఆరు నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వకపోవడంపై ఆ పార్టీ శ్రేణుల్లోనే నిరుత్సాహం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement