
నేడు ‘మున్సిపల్’ లెక్కింపు
యలమంచిలి/నర్సీపట్నంటౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం సోమవారం తేలనుంది. కొత్తగా ఏర్పడిన యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోనన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడనుంది. వాస్తవానికి ఏప్రిల్ రెండో తేదీనే పురఫలితాలు వెలువడాల్సి ఉన్నా సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కోర్టు ఆదేశాలతో ఈ ఓట్ల లెక్కింపు మే 12కు వాయిదాపడిన విషయం తెలిసిందే. అనకాపల్లి ఎఎంఎఎల్ కళాశాలలో యల మంచిలి ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. మొదటి ఫలితం 9గంటలకే వెలువడే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
యలమంచిలి మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో రెండో వార్డు నుంచి టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి పిళ్లా రమాకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 23వార్డుల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీ, స్వతంత్రులు 52మంది పోటీలో ఉన్నారు. మున్సిపాలిటీలో 31,168మంది ఓటర్లు ఉండగా 23వార్డుల్లో 25,867మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలను వైఎస్సార్‌సీపీ, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వలస కూలీలు, కుటుంబాలను, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులను రప్పించి ఓటేయించారు. పలు వార్డుల్లో 90శాతానికి మించి పోలింగ్ నమోదయింది. 3,7, 12,13,19,21,22 వార్డుల్లో గెలుపు పందాలు రూ. లక్షల్లో జరిగాయి. దాదాపు 43 రోజులు ఫలితాల కోసం ఎదురుచూడవలసి వచ్చింది. దానికి సోమవారం తెరపడనుంది.
నర్సీపట్నంలో...
నర్సీపట్నం టౌన్ : నర్సీపట్నం మున్సిపాలిటి లో 27 వార్డులకు వివిధ పార్టీల నుంచి 85 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్య పోటీ నెలకొంది. పెదబొడ్డేపల్లి డాన్‌బాస్కో కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. 54 పోలింగ్ కేంద్రాల ద్వారా 54 ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపుపై ఎట్టకేలకు చిక్కుముడి వీడనుంది. కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లును మున్సిపల్ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లును మున్సిపల్ ఆర్‌జేడీ ఆశాజ్యోతి, ఆర్డీవో సూర్యారావు స్వయంగా పరిశీలించి అధికారులు, సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు.