జూపూడికి ఎమ్మెల్సీ
- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎంపీ మాగుంట
- జిల్లా పార్టీ అధ్యక్ష పదవిపై నేడు నిర్ణయం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా జూపూడి ప్రభాకరరావు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్లను తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. జిల్లా నుంచి ఎమ్మెల్సీ కోసం కరణం బలరామకృష్ణమూర్తితో పాటు పలువురు పోటీపడినా సామాజిక సమీకరణాల పేరుతో జూపూడి ప్రభాకరరావు పేరును తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో ఖరారు చేసింది. ఎమ్మెల్సీగా ఉన్న పాలడుగు వెంకట్రావు మృతి చెందడంతో ఖాళీ అయిన స్థానంలో జూపూడి ప్రభాకర్ పేరు ఖారారు చేశారు. ఆయన గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి డోలా బాలవీరాంజనేయస్వామి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిపై చంద్రబాబునాయుడు ఎటూ తేల్చలేదు. బుధవారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో దీనిపై పెద్దగా చర్చ జరగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలపైనే సుదీర్ఘంగా చర్చించగా.. జిల్లా అధ్యక్ష పదవిపై ఐదు నిమిషాలు మాత్రమే చర్చ జరిగినట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం కూర్చుని దీనిపై నిర్ణయం తీసుకుందామని చంద్రబాబునాయుడు చెప్పినట్లు తెలిసింది. జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, దివి శివరామ్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. దామచర్లకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థి వర్గం పావులు కదుపుతోంది. అయితే చంద్రబాబునాయుడు మాత్రం దామచర్ల జనార్దన్‌నే కొనసాగించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.