- ‘ఎర్ర’స్మగ్లర్లను పట్టుకోవడంలో పోలీసులు విఫలం
- ప్రత్యేక బృందాల దర్యాప్తులో కానరాని పురోగతి
- స్మగ్లర్ల పేర్ల చిట్టా ఉన్నా పోలీసుల మౌనం?
సాక్షి, చిత్తూరు: జిల్లాలో పేట్రేగిపోతున్న ఎర్రచంద నం స్మగ్లర్లను పట్టుకోవడంలో పోలీసులు చేతులెత్తేశారు. తమిళనాడు, కర్ణాటక, చిత్తూరు జిల్లాకు చెందిన స్మగ్లర్లు కోట్లు కొల్లగొడుతున్నారు. ఎర్ర దొంగల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా పురోగతి కానరావడం లేదు. వందల సంఖ్యలో కూలీలను పట్టుకుని హడావుడి చేస్తున్న పోలీసు లు అసలు దొంగలను పట్టుకోలేక పోతున్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఆ ప్రభుత్వ ఆశీస్సులతో యథేచ్ఛగా ఎర్రచందనం అక్రమ రవాణా చేసి కోట్లు గడించి నవారు పీలేరు, చంద్రగిరి నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. కేవీ పల్లె, కలకడ, చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాళెం మండలాల్లో చిన్నా, చితకా స్మగ్లర్లు చాలా మంది ఉన్నారు. 10 సంవత్సరాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా ఆదాయం పెంచుకున్నవారి వివరాలు పోలీసులు వద్ద ఉన్నా ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి.
పీడీ యాక్టు కింద అదుపులోకి తీసుకున్నారని చెబుతున్న భాస్కర్‌నాయుడు ఒక్కడే పీలేరు నియోజకవర్గం నుంచి పట్టుకున్న స్మగ్లరు. రెడ్డినారాయణ, మహేష్, శేషు కడప జిల్లాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు, తాజగా డాను శీను(శీను) అనే మైదుకూరుకు చెందిన స్మగ్లరును కడప పోలీసులు తిరుపతిలో అరెస్టు చేశారు.
పీలేరు స్మగ్లర్లపై దృష్టి
పీలేరు కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందని కాంగ్రెస్ అధికారంలో ఉండగా అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ప్రతిపక్షనేతగా ఉన్న కాబోయే సీఎం చంద్రబాబు చాలాసార్లు ఆరోపణ లు చేశారు. అప్పట్లో పెద్దగా స్పందిం చని పోలీసులు తాజాగా మారిన పరిస్థితుల నేపధ్యంలో పీలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ముసుగులో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లు ఎవరెవరు, వారికి ఎంత వరకు అక్రమరవాణాతో సంబంధం ఉందనే వివరాలను కూపీలాగుతున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ దిశగా పోలీసులు కార్యాచరణ మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులపై కూడా పోలీసులు దృష్టిసారించినట్టు తెలిసింది.
దొరకని తమిళనాడు, కర్ణాటక స్మగ్లర్లు
తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చి ఎర్రచందనాన్ని కొల్లగొడుతున్న స్మగ్లర్లను జిల్లా పోలీసులు పట్టుకోలేకపోయారు. టాస్క్‌ఫోర్స్ కూడా ప్రయత్నం చేస్తున్నా అసలు వ్యక్తులు దొరకడంలేదు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు బెంగళూరు రూరల్‌కు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు దుబాయ్‌కు చేరి అక్కడ నుంచే అక్రమరవాణాను తమ అనుచరుల ద్వారా నడిపిస్తున్నారు.
తమిళనాడు చెన్నయ్‌కు చెందిన స్మగ్లర్లు వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని కొందరు మధ్యవర్తులు, దళారులను పెట్టుకుని ఎర్రచందనాన్ని దోచుకుపోతున్నారు. 35 మంది వివరాలను సేకరించిన పోలీసులు వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. స్మగ్లర్ల అనుచరుల సెల్‌ఫోన్లపై నిఘా ఉంచినా సరైన సమాచారం దొరకడం లేదని పోలీసులు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు.