సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రియుని మోజులో పడి కట్టుకున్న భర్తను భార్యే హతమార్చింది. కర్ణాటక రాష్ట్రంలో హత్యకు ప్రణాళికను సిద్ధం చేసి తమిళనాడులో ప్రియునితో కలిసి ప్రాణాలు తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా దేవదానంపట్టి సమీపం కొడైక్కెనాల్ కొండ ప్రాంతంలో గొంతుకోసిన స్థితిలో గుర్తుతెలియని యువకుని మృతదేహాన్ని ఈనెల 18వ తేదీన పోలీసులు కనుగొన్నారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం దేవదానపట్టి శ్మశానంలో ఖననం చేశారు. ఇదిలా ఉండగా, కర్ణాటక రాష్ట్రం మంగళూరు పోలీసులు దేవదానపట్టి పోలీసులను ఈనెల 24న సంప్రదించగా వారి వద్ద ఉన్న ఫొటోల ద్వారా హత్యకు గురైన వ్యక్తి కర్ణాటకకు చెందిన మహ్మమద్ సమీర్ (32) అనే ఇంజినీర్‌గా గుర్తించారు. మృతుడు సమీర్ రెండేళ్ల క్రితం ఫిర్‌దౌస్ అనే యువతిని వివాహం చేసుకోగా వారికి ఆరునెలల కుమార్తె ఉంది. అరబ్ దేశంలో ఇంజినీరుగా పనిచేసే అతడు ప్రతినెలా ఖర్చులకు పెద్ద మొత్తంలో డబ్బులు పంపుతూ ఆరు నెలలకు ఒకసారి భార్య వద్దకు వచ్చి వెళ్లేవాడు. భర్త విదేశాల్లో ఉన్నపుడు ఫిర్‌దౌస్‌కు మంగళూరుకు చెందిన కారు డ్రైవర్ మహ్మమద్ యాసిన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ప్రియునితోనే శాశ్వతంగా కాపురం చేయాలని నిర్ణయించుకున్న ఫిర్‌దౌస్ భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. భారత్‌కు వచ్చిన భర్తతో కలసి బిడ్డతో సహా ఈనెల 13వ తేదీన కారులో పర్యాటక ప్రాంతాల సందర్శనకు అద్దె కారులో బయలుదేరింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కారు డ్రైవర్‌గా తన ప్రియుడిని ఏర్పాటు చేసుకుంది. కొడైక్కెనాల్ వెళ్లే మార్గంలో డమ్‌డమ్ పారై అనే ప్రాంతంలో ఫిర్‌దౌస్, యాసిన్ ఇద్దరూ కలిసి సమీర్ గొంతుకోసి హతమార్చి పట్టరపారై అనేచోట శవాన్ని తోసివేసి వెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్న తర్వాత అల్లుడు ఎక్కడా అని ప్రశ్నించగా సేలంలో తన స్నేహితురాలితో వెళ్లిపోయాడని ఫిరదోష్ బదులిచ్చింది. సమీర్ చనిపోయాడని అందరూ అనుమానిస్తుండగా ఫిరదోష్ మాత్రం ఏమాత్రం చలించకుండా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటిలోని 60 సవర్ల నగలు తీసుకుని ఫిరదోష్ ఇంటి నుంచి ఉడాయించింది. డ్రైవర్ యాసిన్ భార్య కూడా తన భర్త కనపడడం లేదని ఫిర్యాదు చేయడంతో సమీర్ హత్య ఉదంతం బయటపడింది. ఖననం చేసిన సమీర్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించి ఫిరదోష్ , యాసిన్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment