రిమ్స్‌క్యాంపస్: జాతీయ లోక్ అదాలత్ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన రెండో లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా జిల్లాలో 1709 కేసులను పరిష్కరించినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు వి. అప్పారావు వెల్లడించారు. ఇందులో 108 మోటారు వాహనాల కేసులకు రూ.కోటీ 99 లక్షల, 4 వేలను కక్షిదారులకు నగదు రూపంలో చెల్లించినట్లు తెలిపారు. మిగతా కేసులకు సంబంధించి రూ. లక్షా 73వేల 262 విధించినట్టు వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2వ జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. అప్పారావు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌అదాలత్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని, శ్రీకాకుళంతో పాటు చుట్టు పక్క గ్రామాలకు చెందిన కక్షిదారులు అధికసంఖ్యలో హాజరై వారి కేసులను రాజీ మార్గంలో పరిష్కారం చేసుకున్నారని ఆయన వివరించారు. కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కక్షిదారులు ఇరువర్గాల కేసులకు సంబంధించి కోర్టు ఫీజులు చెల్లించనవసరం లేదని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో సత్వర న్యాయం కోసం ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకున్నారని తెలిపారు.
లోక్ అదాలత్ కార్యక్ర మం నిరంతర ప్రక్రియ అని, ఇందులో సివిల్ కేసులు, కుటుంబ తగాదాలు, క్రిమినల్ కేసులు, వినియోగదారుల కేసులు, ఇతర కేసులకు సంబంధించి జాతీయ లోక్‌అదాలత్ ద్వారా పరిష్కార మార్గం చూపించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి పి. అన్నపూర్ణ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ పర్యవేక్షకులు సుధాకర్, డీఆర్‌వో బీహెచ్‌ఎస్ వెంకటరావు, సంఘ సేవకుడు మంత్రి వెంకటస్వామి, వాకర్స్ ఇంటర్ నేషనల్ గవర్నర్ జి. ఇందిరాప్రసాద్, లోక్ అదాలత్ సభ్యుడు కె. పోలినాయుడు పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌కు అనూహ్య స్పందన
Published Sun, Dec 7 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM
Advertisement
Advertisement