వరకట్న వేధింపుల కేసులో ఇద్దరి మధ్యా రాజీ
రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైన లోక్ అదాలత్
సాక్షి, అమరావతి : విభేదాల కారణంగా విడివిడిగా ఉంటున్న భార్యా భర్తలను జాతీయ లోక్ అదాలత్ కలిపింది. ఇందుకు గాను వారిద్దరినీ హైకోర్టు న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ గుహనాథన్ నరేందర్ అభినందించారు. ఈ భార్య భర్తలు విజయవాడకు చెందిన వారు. వీరికి 2008లో వివాహమైంది.
ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ భార్య 2022లో పటమట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భర్తపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసులో వారు రాజీపడి కలిసి ఉండేందుకు సిద్ధపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా లోక్ అదాలత్‌లు
శనివారం జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా హైకోర్టుతో సహా రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్‌లు నిర్వహించారు. జస్టిస్ నరేందర్ హైకోర్టు ప్రాంగణం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విజయవాడ, మచిలీç³ట్నం న్యాయస్థానాల్లో జరిగిన లోక్ అదాలత్‌లను స్వయంగా పరిశీలించారు. హైకోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ తర్లాడ రాజశేఖర్, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో లోక్ అదాలత్ జరగ్గా.. 175 కేసులు పరిష్కారమయ్యాయి.
రూ.2.90 కోట్ల మేర పరిహారాన్ని అందచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 377 లోక్ అదాలత్‌లు నిర్వహించారు. మొత్తం 45,898 కేసులు పరిష్కారం కాగా, రూ.64.72 కోట్లు పరిహారంగా చెల్లించారు. ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన పోషకులు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని సేవాధికార సంస్థ రాష్ట్ర కార్యదర్శి బబిత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment