ఆ కథనాలు తప్పు: లోక్‌సత్తా
హైదరాబాద్: ఎపీఎన్జీవోల సంఘం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో లోక్‌సత్తా పార్టీ సమైక్యవాదాన్ని స్వతంత్రంగా వినిపిస్తుందన్నట్టు కొన్ని పత్రికలలో, చానెళ్లలో వచ్చిన వార్తలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు ఖండించారు. రాష్ట్ర అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిపి సామరస్యంగా సాధించే పరిష్కారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని లేదా మరో రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసినా లోక్‌సత్తా స్వాగతిస్తుందని చెప్పారు.
ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎపీఎన్జీవోల సమావేశానికి వెళ్లడం వల్ల అలా వార్తలు రాసి ఉండొచ్చని అయితే, తాము తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యామని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారటీల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై టీఆర్‌ఎల్‌డీ నేత దిలీప్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశంలోనూ తమ పార్టీ పాల్గొందని తెలిపారు.