katari srinivasa rao
-
'హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తాం'
విజయవాడ: హైదరాబాద్‌లో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేస్తామని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడలో శనివారం జరిగిన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. త్వరలో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కార్యవర్గాల్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో, తెలంగాణలోని హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. పార్టీ సిద్ధాంతాల కోసం పార్టీ రాజ్యాంగం మేరకు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల ద్వారా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
‘ఆమ్ ఆద్మీ’తో కలిసి పనిచేస్తాం: కఠారి
కడప: కేజ్రీవాల్ స్థాపించిన ‘ఆమ్ ఆద్మీ’ పార్టీతో తాము కలిసి పని చేయనున్నట్లు లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు తెలిపారు. కడప వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుని లోక్‌సత్తా పార్టీ బరిలోకి దిగుతోందన్నారు. ఈ నెల 11వ తేదీన వివరాలు వెల్లడవుతాయన్నారు. లోక్‌సత్తా పార్టీ మొద టి నుంచి సామాజిక సమస్యలపై పోరాటం చేస్తోందన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం మద్యం, యువతకు విద్య, తాగునీటి సమస్యపై దృష్టి సారించిందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను లోకసత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ తన పార్టీ నేతలతో కలిసి జనవరి 11 తేదిన సమావేశం కానున్నారు. దేశంలో రాజకీయేతర ఉద్యమాన్ని పటిష్టం చేయడానికి ఇరుపార్టీలు కలిసి పనిచేసే అవకాశంపై చర్చించనున్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం :కఠారి శ్రీనివాసరావు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు విమర్శించారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఒంగోలు వచ్చిన ఆయన.. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపి ఎండగట్టడంలో భాగంగా నగరంలోని లాయర్పేటతో పాటు పలు ప్రాంతాల్లో కార్పొరేషన్ అందిస్తున్న రక్షిత మంచినీటిని పరీక్షించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు కలుషిత నీరు సరఫరా చేస్తుండటం వల్ల అనేక రోగాలబారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నీటిలో ఎలాంటి కలుషితాలున్నాయో తెలియజేసేందుకే పరీక్షకు పంపామన్నారు. 24 గంటల తర్వాత పరీక్షల నివేదిక వస్తుందన్నారు. అదేవిధంగా మద్యం బారినపడి మరణించిన వారి కుటుంబాలను పలకరించి ఆదుకునేందుకు లోక్‌సత్తా ఆధ్వర్యంలో శ్రీకారంచుట్టినట్లు తెలిపారు. ముందుగా స్థానిక ప్రగతి, మదర్‌థెరిస్సా కాలనీల్లో ఆయన పర్యటించారు. మద్యం బారినపడి మృతి చెందిన 15 కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి నెలకు 2 వేల రూపాయలిచ్చే విధంగా ప్రభుత్వం ఒక నిధిని ఏర్పాటు చేయాలని, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగమివ్వాలని, ప్రతి జిల్లా కేంద్రంలో డి-ఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అల్లు శివరమేష్‌రెడ్డి, నాయకులు చప్పిడి రత్నకుమారి, మహమ్మద్ఫ్రీ, అహ్మద్, వరికూటి ఆంజనేయులు, వరికూటి రాము, కరీమున్నీసా, రఫీ, అల్లాబాషా, ప్రసాద్ పాల్గొన్నారు. -
ఆ కథనాలు తప్పు: లోక్‌సత్తా
హైదరాబాద్: ఎపీఎన్జీవోల సంఘం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో లోక్‌సత్తా పార్టీ సమైక్యవాదాన్ని స్వతంత్రంగా వినిపిస్తుందన్నట్టు కొన్ని పత్రికలలో, చానెళ్లలో వచ్చిన వార్తలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు ఖండించారు. రాష్ట్ర అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిపి సామరస్యంగా సాధించే పరిష్కారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని లేదా మరో రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసినా లోక్‌సత్తా స్వాగతిస్తుందని చెప్పారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎపీఎన్జీవోల సమావేశానికి వెళ్లడం వల్ల అలా వార్తలు రాసి ఉండొచ్చని అయితే, తాము తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యామని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారటీల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై టీఆర్ఎల్డీ నేత దిలీప్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశంలోనూ తమ పార్టీ పాల్గొందని తెలిపారు. -
మహాసభలో పొత్తులపై చర్చిస్తాం: కటారి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సత్తా పార్టీ ఏడో వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 24న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభలో... వచ్చే ఎన్నికలలో ఇతర పార్టీలతో పొత్తు విషయంపైనా చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు చెప్పారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలా.. లేదా అంశంపై నాయకుల అభిప్రాయాల సేకరణ ఉంటుందన్నారు. మం గళవారం లోక్‌సత్తా పార్టీ నాయకులు మహాసభ పోస్టరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కటారి విలేకరులతో మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడం మీదే మహాసభలో ప్రధానంగా చర్చించి తీర్మానాలు చేస్తామన్నారు.