ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు విమర్శించారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఒంగోలు వచ్చిన ఆయన.. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపి ఎండగట్టడంలో భాగంగా నగరంలోని లాయర్‌పేటతో పాటు పలు ప్రాంతాల్లో కార్పొరేషన్ అందిస్తున్న రక్షిత మంచినీటిని పరీక్షించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు కలుషిత నీరు సరఫరా చేస్తుండటం వల్ల అనేక రోగాలబారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నీటిలో ఎలాంటి కలుషితాలున్నాయో తెలియజేసేందుకే పరీక్షకు పంపామన్నారు. 24 గంటల తర్వాత పరీక్షల నివేదిక వస్తుందన్నారు. అదేవిధంగా మద్యం బారినపడి మరణించిన వారి కుటుంబాలను పలకరించి ఆదుకునేందుకు లోక్‌సత్తా ఆధ్వర్యంలో శ్రీకారంచుట్టినట్లు తెలిపారు. ముందుగా స్థానిక ప్రగతి, మదర్‌థెరిస్సా కాలనీల్లో ఆయన పర్యటించారు.
మద్యం బారినపడి మృతి చెందిన 15 కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి నెలకు 2 వేల రూపాయలిచ్చే విధంగా ప్రభుత్వం ఒక నిధిని ఏర్పాటు చేయాలని, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగమివ్వాలని, ప్రతి జిల్లా కేంద్రంలో డి-ఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అల్లు శివరమేష్‌రెడ్డి, నాయకులు చప్పిడి రత్నకుమారి, మహమ్మద్ఫ్రీ, అహ్మద్, వరికూటి ఆంజనేయులు, వరికూటి రాము, కరీమున్నీసా, రఫీ, అల్లాబాషా, ప్రసాద్ పాల్గొన్నారు.
ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం :కఠారి శ్రీనివాసరావు
Published Tue, Dec 24 2013 7:06 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement