
200 నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించండి..
మరోసారి తడబడిన మంత్రి లోకేశ్
అనంతపురం అర్బన్: సీఎం చంద్రబాబు తనయుడు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు మాట తడబడడం ఆనవాయితీగా మారింది. గురువారం అనంతపురంలో జరిగిన ‘నీరు– ప్రగతి ఉద్యమం’ సమావేశంలో ఆయన మరోసారి ఇలానే వ్యవహరించారు. రాష్ట్రంలో ఉన్నది 175 అసెంబ్లీ స్థానాలయితే.. 2019 ఎన్నికల్లో 200 స్థానాల్లో పార్టీని గెలిపించాలనడంతో అక్కడున్న వారంతా కంగుతిన్నారు.
సమావేశంలో విద్యార్థులు, నీటి వినియోగ సంఘాల అధ్యక్షులను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడుతూ...‘చివరగా మీకు ఒక మాట చెబుతున్నా. మనం చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాలి. 2019 ఎన్నికల్లో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలి. భారీ మెజార్టీ అంటే మామూలుగా కాదు. 200 స్థానాలు గెలిపించి చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి చేయాలి’ అని కోరారు. రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలున్న విషయం కూడా లోకేశ్‌కు తెలియదా అంటూ అక్కడున్న వారు చర్చించుకోవడం కనిపించింది.