
‘టీడీపీ’లో ‘మాడుగుల’ చిచ్చు
జిల్లా అధ్యక్షునిగా గవిరెడ్డి రామానాయుడ్ని సాగనంపే వరకు భీష్మించుకొని...
- ఇన్‌చార్జి బాధ్యతలను ‘గవిరెడ్డి’ని తప్పించే యత్నం
- పావులు కదుపుతున్న అనకాపల్లి ఎంపీ
- గంటాతో మాడుగుల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భేటీ
సాక్షి, విశాఖపట్నం: జిల్లా అధ్యక్షునిగా గవిరెడ్డి రామానాయుడ్ని సాగనంపే వరకు భీష్మించుకొని కూర్చున్న మంత్రిగంటా శ్రీనివాసరావు వర్గం ఇప్పుడు మాడుగుల ఇన్‌చార్జి బాధ్యతల నుంచి కూడా తప్పించేందుకు పావులు కదుపుతోంది. శనివారం మాడుగుల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీ అవంతి శ్రీనివాసరావు మంత్రి గంటాతో సమావేశమై చర్చించారు. ఏజెన్సీకి చెందిన పలువురు జెడ్పీటీసీ, ఎంపీపీ లతో పాటు పలువురు సర్పంచ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. రూరల్ జిల్లా అధ్యక్షునిగా సీనియర్ నాయకుడైన పప్పల చలపతి రావును ఎంపికచేయడం పట్ల మంత్రిగంటాకు వారు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
మాడుగుల ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడ్ని తప్పించి ఆయన స్థానంలో పార్టీ పటిష్టత కోసం పనిచేసిన వారిని నియమించాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి గంటా దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు విశాఖలో శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా అధ్యక్షునిగా గవిరెడ్డిని కొనసాగించాలని మంత్రి అయ్యన్న వర్గం పట్టుబట్టగా ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించడానికి వీల్లేదంటూ గంటా పట్టుబట్టారు. మధ్యే మార్గంగా పార్టీ అధినాయకత్వం పప్పల చలపతిరావు పేరును తెరపైకి తీసుకు రావడంతో ఇరువర్గాలు ఆయన అభ్యర్థిత్వం పట్ల ఆమోద ముద్ర వేశాయి. తాజాగా గవిరెడ్డిని టార్గెట్ చేసిన గంటా ఆయన్ని మాడుగుల ఇన్‌చార్జి బాధ్యతలను తప్పించాలన్న పట్టుదలతో ఎత్తుగడలు వేస్తున్నట్టు తెలుస్తోంది.