♦ రాజధానిలో సీతారాముల భూములు తీసుకున్న ప్రభుత్వం
♦ పోరాటం చేస్తున్న గ్రామస్తులు, పాలకవర్గం
♦ విచారణ చేపట్టిన ఏమ్మార్వో
తాడేపల్లిరూరల్ : రాజధాని నిర్మాణం పేరిట భూసమీకరణ ప్రారంభించిన రాష్ట్రప్రభుత్వం సీతారాములను సైతం నిరాశ్రయులను చేసింది. భూసమీకరణకు సీతారాముల భూముల్ని దేవదాయ శాఖ అధికారులు అప్పగించారు. కనీసం గుడివైపు కన్నెత్తి చూడని ఆ శాఖ అధికారులు భూమికి సంబంధించిన ఒరిజినల్ దస్తావేజులు లేకుండానే మెప్పు కోసం అప్పగించేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామంలో బ్రిటిష్ కాలంలో గ్రామస్తులు నిర్మించుకున్న సీతారాముల దేవాలయం ఎంతో పేరుగాంచింది.
దేవుడు మాన్యంగా కొంత భూమి అలనాటి నుంచి ధూపదీప నైవేద్యాలకు వినియోగిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరిట చేపట్టిన భూసమీకరణకు దేవాదాయ శాఖాధికారులు తమ శాఖ పరిధిలోనిదే అని పేర్కొంటూ అప్పనంగా భూమిని ఇచ్చేశారు. ఇది తెలిసిన గ్రామస్తులు ఆలయ భూములకు సంబంధించిన రికార్డులను తిరగవేసి, ఆ భూమి దేవాదాయశాఖది కాదని, గుడిసైతం దేవదాయ పరిధిలో లేదని తెలియచేస్తూ వారికి వినతి పత్రం అందించారు.
అయినప్పటికీ దేవదాయ శాఖ వారు స్పందించకపోవడంతో, గతంలో ఆ భూమి తమ్మా సుబ్బారెడ్డి అనే పేరు మీద ఉన్నదని, దేవాదాయ శాఖ పొరపాటు పడిందనీ ఆలయ కమిటీ వివరించింది. 104 2సిలో61 సెంట్లు, 104 2ఎ 8 సెంట్లు 130లో 44సెంట్లు మొత్తం 113 సెంట్ల భూమి ఉండవల్లి రామాలయం పేరిట ఉన్నదని, వారు జిల్లా కలెక్టర్‌కు, స్థానిక తహాశీల్దారుకు తెలియజేశారు. దీంతో శనివారం ఈ విషయమై తహశీల్దారు వెంకటేశ్వర్లు రామాలయం వద్ద గ్రామ సభ ఏర్పాటు చేసి విచారణ నిర్విహంచారు.
ఈ సంధర్భంగా ఆలయ కమిటీ, గ్రామస్తులు ముక్తకంఠంతో ఆ భూమి రామాలయానికి చెందినదనీ, సీతారాములు దేవుడి మాన్యమనీ తెలిపారు. ఆ భూములు ఇచ్చేది లేదని వారు తేల్చి చెప్పారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి తగిన న్యాయం చేస్తానని తహశీల్దార్ తెలిపారు.
రైతుల్నే కాదు... రాముణ్ణీ వదల్లేదు...
Published Sun, Apr 26 2015 3:10 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement