పొందూరు: ఒకరిని విడిచి మరొకరు ఉండలేక ఆ యువతీ, యువకులు క్షణికావేశానికిలోనై బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనన్న అనుమానం వారిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించింది. జీవితంలో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుందామని ఒప్పంద పత్రం రాసుకున్న వీరు.. అంతలోనే నిర్ణయం మార్చుకుని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపారు. పొందూరు మండలంలోని కనిమెట్టకు చెందిన అన్నెపు పవన్ కల్యాణ్ (17), మొదలవలసకు చెందిన మొదలవలస రేణుక(17) కింతలి రెవెన్యూ పరిధిలోని మామిడి తోటల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనంగా మారింది. పోలీసులు, తల్లిదండ్రులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం..
శుక్రవారం కాలేజీ నుంచి వెళ్లిపోయి..
కింతలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పవన్‌కల్యాణ్, రేణుక ఇంటర్ హెచ్‌ఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరు ఏడాది క్రితం నుంచి ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం కళాశాలకు వచ్చిన వీరు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బయటకు వెళ్లిపోయారు. రేణుక తన సైకిల్, టిఫిన్ బాక్సు కళాశాలలోనే విడిచిపెట్టింది. వీరు ఇళ్లకు చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వారి ప్రేమ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి చర్చించుకుని వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. అర్ధరాత్రి వరకు విద్యార్థుల ఆచూకీ కోసం గాలించారు. కానీ మామిడి తోటలో వీరు ఉరేసుకుని చనిపోయారనే వార్త విని హతాశులయ్యారు.
డీఎస్పీ పరిశీలన
ఈ సమాచారం శనివారం ఉదయం పోలీసులకు అందింది. శ్రీకాకుళం డీఎస్పీ వేణుగోపాలరావు, జె.ఆర్.పురం సి.ఐ వై.రామకృష్ణ, పొందూరు ఇన్‌ఛార్జి (ఎచ్చెర్ల) ఎస్.ఐ వై.కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షణికావేశంలో రాత్రి సమయంలో వీరు ఉరేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వారి బ్యాగుల్లోని ఉపాధ్యాయులు, స్నేహితులు, తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతూ రాసిన ఉత్తరాలు, సూసైడ్ నోట్, వీరి పెళ్లి శుభలేక నమూనా వంటివి సేకరించారు. అనంతరం మృతదేహాలను శ్రీకాకుళం రిమ్స్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
గ్రామాల్లో విషాద ఛాయలు
వీరు మృతిచెందడంతో ఇరువురి కుటుంబాల్లో, మొదలవలస, కనిమెట్ట గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పవన్ తల్లిదండ్రులు అన్నెపు హరనాథరావు, ఇందు రైతులు. కూలి చేస్తుంటారు. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి. రేణుక తల్లిదండ్రులు రమణరావు, రోహిణి పాల వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. రేణుక చిన్నమ్మాయి. పవన్ ఇంట్లో మూడీగా ఉండేవాడని, ఎవరితోను మాట్లాడేవాడు కాదని కుటుంబీకులు తెలిపారు.
ఇద్దరం కలిసి చనిపోతున్నాం
అమ్మ, నాన్న నన్ను క్షమించండి. నాకు చాలా సమస్యలు ఉన్నాయి. అవి తట్టుకోలేకపోతున్నాను. ఎవరితో చెప్పుకోలేక నాలో నేను కుమిలిపోతున్నాను. బాధను భరించలేక ఈ పని చేస్తున్నాను. మనస్ఫూర్తిగా మన్నిస్తారని భావిస్తాను. నేను చనిపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. నా మెదడులో సమస్య ఉంది. దాని వల్ల ఎప్పుడు ఎలా ఉంటున్నానో నాకే తెలియటం లేదు. మిమ్మల్ని కూడా బాధపెట్టాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తాను చనిపోతానని చెప్పింది. అందుకే ఇద్దరం కలిసి చచ్చిపోతున్నాం. మనస్ఫూర్తిగా మన్నించండి.
ఒప్పంద పత్రంలో ఏముందంటే..
రేణుక, పవన్ కల్యాణ్ ఇరువురు ఒప్పంద పత్రం రాసుకున్నారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత చదువుకోవడానికి ఐదేళ్లు విడిచి వెళ్లేందుకు రేణుక గడువు కోరింది. ఇందుకు పవన్ సమ్మతించాడు. మళ్లీ 2022 ఫిబ్రవరిలో కలుస్తానని చెప్పాడు. అప్పుడు నీకు ఉద్యోగం ఉంటే, నేను నీ మనసులో ఉంటే ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని ఒప్పంద పత్రం రాసుకున్నారు. ఒక నమూనా పెళ్లి శుభలేఖను కూడా తయారు చేసుకున్నారు.
ఇద్దరికీ పెళ్లి చేద్దామనుకున్నాం
రేణుక, పవన్ కల్యాణ్ శుక్రవారం నుంచి కనిపించకపోవడంతో నేను, పవన్ తండ్రి హరనాథరావు కలిసి వెతికాం. వారిద్దరూ ఇష్టపుతున్నారని తెలిసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. ఎక్కడికి వెళ్లినా ఉదయాన్నే వచ్చేస్తారని, తర్వాత ఇద్దరితో కలిసి మాట్లాడదామని అనుకున్నాం. కానీ ఇంతలోనే ఇలా జరిగింది.
– రమణరావు, రేణుక తండ్రి
అందరికీ క్షమాపణలు
మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయానికి అందరికీ క్షమాపణలు చెబుతున్నాం. స్నేహితులంతా చక్కగా చదువుకోవాలి. నేను దూరమైనందుకు ఎవరూ బాధపడకండి. సివిక్స్ మేడమ్ తల్లిలాంటివారు. బాగా చదువుతానని నామీద పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు.
Comments
Please login to add a commentAdd a comment