
ప్రేమికుడి ఇంటిముందు యువతి బైఠాయింపు
తణుకు క్రైం: ప్రేమించి మోసం చేశాడంటూ ప్రేమికుడి ఇంటి ముందు యువతి బైఠాయించిన ఘటన బుధవారం తణుకులో చోటుచేసుకుంది. బాధితురాలు, ఆమె బంధువులు తెలిపిన వివరాలు. స్థానిక సజ్జాపురంలో నివాసముంటున్న డి.సంతోష్ స్వరూప్ అలియాస్ విక్కీ విద్యాభ్యాసం నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో తన బంధువుల ఇంట్లో అద్దెకు ఉంటున్న కొమ్ము కవితతో రెండు సంవత్సరాల క్రితం అతడికి పరిచయం ఏర్పడిండి.
కొంతకాలం అనంతరం అది ప్రేమకు దారితీసింది. రెండు నెలల క్రితం కవిత పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో విక్కీ అప్పటి నుంచి ముఖం చాటేస్తున్నాడని, హైదరాబాద్ నుంచి తణుకు వచ్చేశాడని బాధితురాలి బంధువులు తెలిపారు. దీంతో తాము తణుకు రావాల్సి వచ్చిందని చెప్పారు. మూడు రోజులుగా తణుకులోనే ఉంటున్నా విక్కీ కనిపించడంలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంటిముందు బైఠాయించామని బాధితురాలి తల్లి జంగమ్మ, అక్క లావణ్య చెప్పారు. కొంత సమయం బైఠాయించిన అనంతరం ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించారు.