చిట్టి బొజ్జలకు.. చేటు భోజనం! | Low quality food for school children mid day meal | Sakshi
Sakshi News home page

చిట్టి బొజ్జలకు.. చేటు భోజనం!

Published Sat, Dec 15 2018 4:32 AM | Last Updated on Sat, Dec 15 2018 8:43 AM

Low quality food for school children mid day meal - Sakshi

మధ్యాహ్నం భోజనం కింద పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని జంతువులు కూడా తినవు. ఒకవేళ తిన్నా అవి బతికి బట్టకట్టవు’’.. ప్రభుత్వ పాఠశాలల్లో భోజన నాణ్యతా ప్రమాణాలపై ప్రకాశం జిల్లా రామాయపట్నం మండల పరిషత్‌ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టుకు లేఖరాయడంతో నివేదిక తెప్పించుకున్న రాష్ట్ర సర్వోత్తమ న్యాయస్థానం..విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలివి.. 
 
ఉడకని బియ్యం, నీళ్ల చారు. గోలీ సైజు కోడిగుడ్డు.. ఇదీ ప్రకాశం జిల్లాలో మధ్యాహ్న భోజనం మెను. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం విషయం ప్రస్తావిస్తేనే విద్యార్థులు ‘అమ్మో’ అంటున్నారు. అది తిని ఆరోగ్యంగా ఉంటామా? అని సందేహం వ్యక్తంచేశారు ఒంగోలు నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. మధ్యాహ్న భోజనం కంటే జైలు భోజనమే నయమంటూ వారు వ్యాఖ్యానించడం విశేషం. దీంతో చాలామంది ఇంటి నుంచే తెచ్చుకు తింటున్నారు. ఇది ఒక్క ప్రకాశం జిల్లాకే పరిమితం కాదు..రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పరిస్థితి దాదాపు ఇంతే.  

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: పిల్లలకు పౌష్ఠికాహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకం రాష్ట్రంలో అధ్వానంగా మారింది. జంతువులు కూడా ముట్టుకోని రీతిలో ఉంటున్న ఆహార పదార్థాలను ప్రభుత్వం పిల్లలకు అందిస్తోంది. ఈ ఆహారాన్ని తినలేక పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. పౌష్టికత మాట దేవుడెరుగు.. తిన్నవారంతా రోగాల బారిన పడుతున్నారు. ప్రధానంగా కమీషన్ల యావతో ప్రభుత్వ పెద్దలు పిల్లల కడుపుకొడుతున్నారు. భారీగా కమీషన్లు తీసుకుంటుండడంతో సరుకులు పంపిణీ చేసే సంస్థలు నాసిరకమైనవి సరఫరా చేస్తున్నాయి.

వాస్తవానికి గతంలో ఆయా జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోనే సరుకుల పంపిణీ వ్యవహారాల టెండర్లు ఖరారుచేసి, పాఠశాలల వారీగా అక్కడికక్కడే డ్వాక్రా మహిళల ద్వారా మధ్యాహ్న భోజనం వండించి పిల్లలకు వేడివేడి పదార్ధాలను అందించేవారు. కానీ, కమీషన్ల యావతో ప్రభుత్వ పెద్దలు ఈ టెండర్లను రాష్టస్థాయిలో కేంద్రీకరించి తమకు భారీగా ముడుపులిచ్చే సంస్థలకు కట్టబెడుతున్నారు. మరోపక్క డ్వాక్రా మహిళలను తప్పించి క్లస్టర్ల వారీగా పలు స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. ఎప్పుడో తెల్లవారుజామున వండిన పదార్థాలను మధ్యాహ్నానికి ఆయా స్కూళ్లకు అందిస్తున్నాయి. దీంతో ఆ పదార్థాలు పాడవుతున్నాయి. విద్యార్థులు తినడానికి పనికిరావడంలేదు. వారానికి ఐదు గుడ్లు అందించాల్సి ఉన్నా ఈ సంస్థలు పంపిణీ చేయడంలేదు. కొన్ని జిల్లాల్లో గుడ్లు పంపిణీ చేస్తున్నా అవి పురుగులుపట్టి ఉండడంతో విద్యార్థులు పారేస్తున్నారు.    



నాణ్యత ఒట్టిమాటే! 
రాష్ట్రంలోని 45,589 స్కూళ్లలోని 36.17 లక్షల మంది విద్యార్థులకుగాను హాజరును బట్టి 23.46లక్షల మందికి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్నారు. ఆరంభంలో 1 నుంచి 8వ తరగతి పిల్లల వరకే ఇది అమలుకాగా తరువాత 9, 10 తరగతుల పిల్లలకు విస్తరించారు. వీరికి ఉడికీ ఉడకని అన్నం, కూరలు కొన్నిసార్లు వడ్డిస్తుండగా కొన్నిమార్లు ముద్దయిన అన్నం పెడుతున్నారు. ఇక జిల్లాల్లో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో చూడండి.. 

- కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు దగ్గర ఇటీవల ఒక కేంద్రీకృత వంటశాలను ప్రారంభించారు. నాణ్యత సక్రమంగా లేకపోవడంతో రెండు రోజులకే బంద్‌ చేశారు. బియ్యం నాసిరకంగా ఉండడంతో ఉడకడంలేదు. కందిపప్పు సైతం విద్యార్థులకు సరిపడా పంపిణీ చేయడంలేదు. 840 స్కూళ్లకు కోడిగుడ్డు సరఫరా నిలిచి పోయింది.  

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలుచోట్ల పూర్తిస్థాయిలో భోజనం సరఫరా కావడంలేదు. అప్పుడప్పుడు తడిసిపోయిన, ముక్కిపోయిన బియ్యం సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో రంగుమారి వాసన వస్తుండడంతో అనేకమంది విద్యార్థులు భోజనం చేయడంలేదు.  

ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం, కందిపప్పు, కోడిగుడ్లు నాసిరకంగా ఉంటున్నాయని నెల్లూరు జిల్లా నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.  
చిత్తూరు జిల్లాలో బడ్జెట్‌ సరిపోక నీళ్లచారు, నీళ్ల పప్పును వడ్డిస్తున్నారు. బియ్యం కూడా నాసిరకం కావడంతో అన్నం ముద్దముద్ద అవుతోంది. భోజనం అధ్వానంగా ఉండటంతో చాలాచోట్ల పిల్లలు తినడానికి ఆసక్తి చూపించడంలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చదువుకున్న చంద్రగిరి బాలుర ఉన్నత పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి.  

కృష్ణాజిల్లా వ్యాప్తంగా 90శాతం పాఠశాలల్లో నీళ్లచారు, ఉడకని అన్నం, కుళ్లిన కోడిగుడ్లు అందిస్తున్నారు. వాటిని తినలేక బయటపడేస్తున్న పరిస్థితి నెలకొంది.  
కేంద్రీకృత వంటశాల విధానంతో అనంతపురం జిల్లాలోని నాలుగుచోట్ల ప్రయోగాత్మకంగా తెల్లవారుజామున 2.30గంటలకే తయారుచేస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లేసరికి నాణ్యత లోపిస్తోందని టీచర్లు ఆరోపిస్తున్నారు. కోడిగుడ్లను సైతం నాణ్యతలేనివి సరఫరా చేస్తున్నారు.  

విజయనగరం జిల్లాను ఐదు క్లస్టర్లుగా విడగొట్టి కార్పొరేట్‌ సంస్థకు అప్పగించారు. దీంతో రెండ్రోజులపాటు అనేక పాఠశాలలకు సకాలంలో భోజనాలు అందలేదు. జిల్లాలో శుక్రవారం గుడ్డు, అన్నం, వెజిటబుల్స్, పప్పు పెట్టాలి. కానీ, ఉడికీ ఉడకని అన్నం, తాలింపులేని పప్పు మాత్రమే పెట్టారు. గుడ్డు ఇవ్వలేదు.  

వైఎస్సార్‌ జిల్లాలో అయితే చాలాచోట్ల కోడిగుడ్ల సరఫరా లేదు. ఇక్కడ మెనూను పక్కన పెట్టి వండుతున్నారు.  
గుంటూరు జిల్లాలో సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం పెడుతుండడంతో పిల్లలు తినకుండా ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. అలాగే, ఎక్కువశాతం పాఠశాలల్లో మంచినీరు అందుబాటులో ఉండడంలేదు.  

ఇక విశాఖ జీవీఎంసీ పరిధిలో నాణ్యత కొంతమేర బాగానే ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతంలో మాత్రం అధ్వాన్నంగా ఉంది. ముతకబియ్యం సరఫరా చేస్తున్నారు. అన్నంలో రాళ్లు, ఇసుక, పురుగులు కూడా ఉంటున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.  సాంబారు చిక్కగా ఉండేందుకు పప్పుకు బదులుగా జొన్న, శనగపిండి కలిపేస్తున్నారు. సాంబారులో కూరగాయల ఊసే లేదు. దీంతో విద్యార్థులు ముట్టకుండానే పారేస్తున్నారు.  

తూర్పుగోదావరి జిల్లాలోనైతే విద్యార్థులు ఆహారాన్ని తినడంలేదని సాక్షాత్తు  కేంద్ర, రాష్ట్ర ఆహార కమిటీ సభ్యులు గుర్తించడం గమనార్హం. ఢిల్లీ, అమరావతి నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు గత నెల 68 పాఠశాలల్లో పరిశీలించగా 20 శాతానికిపైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తీసుకోవడంలేదని గుర్తించాయి. పర్యవేక్షణ లేకపోవడం, శుభ్రత పాటించకపోవడం, నాసిరకం సామాగ్రి వినియోగంతో విద్యార్థుల్లో పోషకాహారం లోపించి వ్యాధుల బారిన పడుతున్నారని.. వయసు, ఎత్తుకు తగిన బరువు కలిగి ఉండటంలేదని, మరికొన్ని, ఇతర ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నట్టు వారి పరిశీలనలో తేలింది. 

వంట ఏజెన్సీలపై బకాయిల బండ 
పిల్లలకు భోజనాలు అందించే వంట ఏజెన్సీలకు, కార్మికులకు బిల్లులు ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ఉదాహరణకు.. శ్రీకాకుళం జిల్లాలో రెండు నెలలుగా ఇలా బకాయి ఉన్నాయి. దీంతో పలుచోట్ల ప్రధానోపాధ్యాయులే సొంత డబ్బులతో గుడ్లు తెప్పిస్తున్నారు. వారానికి ఐదు కోడిగుడ్లు అందించాల్సి ఉన్నప్పటికీ కర్నూలు జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఏజెన్సీలు, కార్మికులకు మొత్తం రూ.4.36 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఇస్తున్న నిధులు సరిపోవడంలేదని నెల్లూరు జిల్లాలోని నిర్వాహకులు వాపోతున్నారు. కృష్ణాజిల్లాలోనూ సకాలంలో బిల్లులు రాక అప్పుల పాలవుతున్న వంట నిర్వాహకులు నాణ్యమైన భోజనం అందించలేకపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రెండు నెలలుగా బిల్లులు విడుదల చేయకపోవడంతో ఏజెన్సీలు, కార్మికులకు మొత్తం రూ.3.72కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక విజయనగరం జిల్లాల్లోనూ రూ.6కోట్ల వరకు బకాయిలున్నాయి. ఇక్కడ సకాలంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోయినా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అప్పులు చేసి వారు బాధ్యతగా భోజనాలు పెడుతుండగా ఇక్కడ ప్రైవేట్‌కు అప్పజెప్పడంతో నిర్వాహకులు రోడ్డునపడ్డారు. వైఎస్సార్‌ జిల్లాలో రూ.1.32కోట్ల బకాయిలున్నాయి. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో అప్పులు చేస్తూ మరీ నిర్వాహకులు వంట చేస్తున్నారు. జిల్లాలన్నింటిలో ఇదే పరిస్థితి. 

రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ తప్పుబట్టినా మారని వైనం 
మధ్యాహ్న భోజనం తీరుపై రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జేఆర్‌ పుష్పరాజ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కొద్దికాలం క్రితం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మధ్యాహ్న భోజనం అత్యంత నాసిరకంగా ఉంటోందని ప్రభుత్వానికి కమిషన్‌ నివేదిక ఇచ్చినా పథకం అమలు తీరులో ఎలాంటి మార్పు రాలేదు. గుడ్లలో 60 శాతం మాత్రమే పంపిణీ అవుతోందని తేల్చింది. గుడ్లు కూడా 52 గ్రాములు ఉండాల్సి ఉండగా కేవలం 35 గ్రాములే ఉంటున్నట్లు గుర్తించింది. ఈ లెక్కన రూ.131కోట్ల వరకు నిధులు పక్కదారి పడుతున్నట్లు కమిషన్‌ నివేదిక ద్వారా తేటతెల్లమవుతోంది.  

స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం సరికాదు 
16 ఏళ్లుగా మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వహిస్తున్నా. ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థకు అప్పగిస్తే మేం రోడ్డున పడతాం. ప్రస్తుతం మూడు నెలల బిల్లులు రావాలి. తొమ్మిది నెలల బిల్లులు పెండింగ్‌లో ఉన్న రోజుల్లో కూడా అప్పులు తెచ్చి విద్యార్థులకు వడ్డించాం.      
– రుక్మిణి, ఏజెన్సీ నిర్వాహకురాలు, బేతంచెర్ల, కర్నూలు జిల్లా 

కడుపులో నొప్పి వస్తోంది
అన్నం లావుగా ఉంటోంది. తినాలంటే చాలా కష్టంగా ఉంది. ముద్ద దిగడంలేదు. ఆకలికి ఉండలేక తింటున్నాం. ఒక్కోసారి అన్నం తిన్నాక కడుపులో నొప్పి వస్తోంది. అందుకే ఎక్కువ రోజులు ఇంటి దగ్గర నుంచి అన్నం తెచ్చుకుంటాం. ఇక్కడ మంచి నీళ్లు కూడా సరిగాలేవు.  
– ఓర్చు అశ్వని, 4వ తరగతి, చండ్రాజుపాలెం పాఠశాల, బెల్లంకొండ మండలం, గుంటూరు జిల్లా 

రోడ్డున పడేస్తున్నారు 
పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని బట్టి మాకు రేషన్‌ సరుకులు ఇచ్చేవారు. వాటితోనే అప్పటికప్పుడు వండి వేడివేడిగా పిల్లలకు పెడుతున్నాం. కానీ, ఇప్పుడు నవప్రయాస్‌ సంస్థ వారు వండి తీసుకొస్తున్నారు. నాణ్యత లేని భోజనం పెడుతున్నారు. విద్యార్థులు చాలా ఇబ్బందిపడుతున్నారు. అయినా సరే ఆ ఏజెన్సీకే సహకరిస్తూ సేవలందిస్తున్న మమ్మల్ని రోడ్డుపాల్జేస్తున్నారు. చాలా దారుణం. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి.    
– జి.వరలక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలు, మిడ్‌ డే మీల్స్‌ నిర్వాహుకల సంఘం, విశాఖపట్నం 

వంట కార్మికులకు ఇస్తున్న వేతనం అత్యల్పం 
రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం రూ.1000 చొప్పున మాత్రమే అందిస్తోంది. ఇది కనీస వేతనం కూడా కాదు. అదే ఇతర ప్రాంతాల్లో చూస్తే తమిళనాడులో రూ7,500, కేరళలో 6వేలు, లక్షద్వీప్‌లో రూ.6వేలు, పాండిచ్చేరిలో రూ.5నుంచి 9వేలు ఇస్తున్నారు. కేంద్రం ఇస్తున్నది రూ.1000 అయినా మిగతా మొత్తాన్ని కలిపి టైమ్‌స్కేల్‌ కింద ఈ మొత్తాన్ని ఆయా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రూ.1000 మాత్రమే ఇస్తుండగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని క్రమేణా స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తూ వారి నోట మట్టికొడుతోంది.

రూ.4.35తో భోజనం వస్తుందా.. 
ప్రభుత్వం ఆయా విద్యార్థులకు భోజనానికి నిర్దేశించిన మొత్తాన్ని పరిశీలిస్తే విస్మయం కలుగక మానదు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్ధుల్లో 90 శాతానికి పైగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ఈ రోజుల్లో బయట భోజనం చేయాలంటే కనీసం 30 నుంచి 40 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక ఈ పిల్లల భోజనానికి అవసరమయ్యే బియ్యాన్ని పౌరసరఫరాల ద్వారా అందిస్తుండగా పప్పులు, కూరగాయలు, ఆయిల్, ఇతర పప్పు దినుసులు, గుడ్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇస్తున్న మొత్తం మరీ దారుణంగా చాలా తక్కువగా ఉంటోంది. ఈ విద్యార్ధుల్లో ప్రాథమిక స్థాయి వారికి రూ.4.35, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వారికి రూ.6.51 కేటాయిస్తున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తున్నాయి. ఈ మొత్తమే అతి తక్కువ కాగా ఇందులో ఆయా సరుకుల కాంట్రాక్టులను కట్టబెడుతూ ప్రభుత్వ పెద్దలు కమీషన్లు కోట్లలో కాజేస్తున్నారు. కోడిగుడ్లు, కందిపప్పు, ఆయిల్‌ సరఫరా కాంట్రాక్టుల్లో రూ.10 నుంచి 15 కోట్ల వరకు ముడుపులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలున్నాయి. 

ఇలా అయితే క్యాలరీస్, ప్రొటీన్లు ఎలా.. 
ప్రభుత్వమిచ్చే మొత్తమే తక్కువగా ఉండగా అందులో కమీషన్ల కారణంగా కాంట్రాక్టర్లు నాసిరకంగా ఉన్న వాటిని సరఫరా చేస్తున్నారు. దీంతో విద్యార్ధులకు సరైన పౌష్ఠికాహారం అందడంలేదు. హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్, హోమ్‌సైన్సు కాలేజీ, అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ సూచనల మేరకు స్థానిక వనరులతో పౌష్టికాహార మెనూను నిర్దేశించారు. అన్నం, పప్పు, కూరగాయలు, సాంబారు, పులిహోరతో పాటు వారానికి ఐదు గుడ్లు, అరటి పండ్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత మార్గదర్శకాలు విడుదల చేస్తున్నా ఆ మేరకు పథకం అమలుకావడంలేదు.  మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.

ఈ స్థాయిలో క్యాలరీస్, ప్రొటీన్లు అందకపోవడంతో అందడానికి విద్యార్థులకు ప్రయోజనం లేకుండాపోతోంది. ఏ మోతాదులో ఆయా పదార్థాలు అందించాలో సూచించినా అవి అందడం లేదు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆధ్యాత్మిక వ్యవహారాలతో కూడుకున్నవి అయినందున కోడిగుడ్ల పంపిణీని పూర్తిగా నిలిపివేశాయి. 

కిచెన్‌ షెడ్లు ఏవీ? 
ఇప్పటివరకు ఈ మధ్యాహ్న భోజనాన్ని ఆయా పాఠశాలల పరిధిలోని డ్వాక్రా మహిళలకు అప్పగించారు. వారే స్కూళ్లలో ఈ ఆహారాన్ని వండి విద్యార్థులకు వేడివేడిగా అందిస్తున్నారు. అనేకచోట్ల కిచెన్‌ షెడ్లు వంటివి లేకపోయినా ఆరుబయటే ఏదోలా సర్దుబాటు చేసుకుంటూ భోజన తయారీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇదే పరిస్థితి. కర్నూలు జిల్లాలో 1,078 స్కూళ్లలో వంట గదులు, 1,445 స్కూళ్లలో తాగునీటి సదుపాయంలేదు. అనంతపురం జిల్లాలో షెడ్లు లేకపోవడంవల్ల పొయ్యిలు మండక ఉడికీ ఉడకని భోజనాన్నే పిల్లలకు వడ్డించే పరిస్థితి. ఇక్కడ 2012లో మంజూరు చేసిన వంట గదుల నిర్మాణాలు ఇప్పటికీ పూర్తికాలేదు. గుంటూరు జిల్లాలోని సగం పాఠశాలల్లో కిచెన్‌ షెడ్లు లేక అపరిశుభ్రమైన వాతావరణంలోనే విద్యార్థులకు భోజనాన్ని వండి పెడుతున్నారు.

పాఠశాలల్లోనే వండి వడ్డించాలని ‘సుప్రీం’ చెప్పినా.. 
విద్యార్థులకు అందించే భోజనాన్ని పాఠశాలల్లోనే వండి వడ్డించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2013లో రాష్ట్రంలో సుప్రీంకోర్టు నియమించిన కమిషన్‌ పర్యటించింది. మొత్తం 13 మందితో కూడిన ఈ కమిషన్‌ ఆయా స్వచ్ఛంద సంస్థల్లో తయారవుతున్న ఆహార పదార్ధాలను, సరఫరా తీరుతెన్నులను పరిశీలించింది.  
- ఈ సంస్థలు అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు కమిషన్‌ గుర్తించింది.  
అటెండెన్సు ప్రకారం కాకుండా తమ ఇష్టానుసారం పిల్లల సంఖ్యలను వేస్తూ కోట్లాది రూపాయలను ప్రభుత్వం నుంచి పిండుకుంటున్నట్లు నివేదికలో పొందుపరిచింది.  
భోజనాన్ని అందించే పరిమాణంలో కూడా 200 గ్రాముల నుంచి 275 గ్రాములు తక్కువగా ఉంటోందని పేర్కొంది.  
యంత్రాల సహాయంతో అత్యధిక వేడితో టన్నుల కొద్దీ ఆహార పదార్ధాలను వండుతుండడం వల్ల రేడియేషన్‌ ప్రభావం పడుతోందని గుర్తించింది. 
అదే సమయంలో తెల్లవారుజాము నుంచి ఈ పదార్ధాలు తయారుచేసి మధ్యాహ్నానికి ఆయా స్కూళ్లకు పంపిణీ చేస్తున్నందున పాచిపోతున్నాయని గుర్తించింది.  
వీటిని తింటున్న విద్యార్ధులు అనారోగ్యం పాలవుతున్నారని నివేదించింది.  
కుళ్లిన కూరగాయలు, నాణ్యతలేని సరుకులతో వంటకాలు తయారు చేస్తుండడంవల్ల అవి మరింత త్వరగా పాడవుతున్నాయి. 

డ్వాక్రా మహిళల పొట్టకొట్టి.. 
పాఠశాలలకు బియ్యం వచ్చినా ఇతర సరకులు సరఫరా కాని సమయంలో కూడా డ్వాక్రా మహిళలు స్థానికంగా ఉన్న షాపుల్లో అరువుకు తెచ్చి పిల్లలకు పదార్ధాలు చేసి పెడుతుండేవారు. ఈ వంటలకు కాలసిన గ్యాస్‌ సరఫరా ప్రభుత్వమే చేయాల్సి ఉన్నా పలుచోట్ల అదీ లేదు. దీంతో స్థానికంగా ఉన్న వనరులతో పూర్తిచేస్తూ వచ్చారు. ఇటీవల గ్యాస్‌ సరఫరాను చేస్తున్నా దానికి సంబంధించిన నిధులు విడుదల చేయకపోతుండడంతో నెలల తరబడి ఆ గ్యాసూ రావడంలేదు. నూరు శాతం గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేశామని, కిచెన్‌ షెడ్లు నిర్మాంచామని గొప్పలు చెబుతున్నప్పటికీ విశాఖ జిల్లాలోని 70 పాఠశాలల్లో ఆరుబయటే కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

కాగా, ప్రస్తుతం గుడ్లు, పప్పు, ఆయిల్‌ వంటి సరుకుల సరఫరా కాంట్రాక్టును రాష్ట్రస్థాయిలో కేంద్రీకరించడంతో పాటు ఆహార పదార్థాలు వండి స్కూళ్లకు సరఫరా బాధ్యతను కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం అప్పగిస్తోంది. క్లస్టర్ల వారీగా ఆయా స్కూళ్లకు సెంట్రలైజ్డ్‌ కిచెన్‌లను తానే ఏర్పాటుచేసి అక్కడ వండే పదార్థాలను ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా పంపిణీ చేయిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80వేల మంది డ్వాక్రా మహిళలను దశలవారీగా ఈ వంట పని నుంచి తొలగిస్తూ వస్తున్నారు. దీనిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వారు ఉద్యమం చేపట్టినా ప్రభుత్వం స్పందించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement