సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జగనన్న గోరుముద్ద కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పకడ్బందీగా నాణ్యతతో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ పథకానికి నిధుల కేటాయింపును కూడా ఆ మేరకు పెంచింది. ఈ పథకానికి 2020–21లో రూ.1,546 కోట్లు, 2021–22లో రూ.1,797 కోట్లు ఖర్చు పెట్టింది. 2022–23 విద్యాసంవత్సరానికి రూ.1,908 కోట్లు కేటాయించింది. అలాగే గతంలో ఈ పథకం కింద 32 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఈసారి 43.46 లక్షల మందికి మధ్యాహ్న భోజనాన్ని అందించనుంది. గత ప్రభుత్వ హయాంలో కేవలం సాంబారు, అన్నంతోనే సరిపెట్టేవారు. కానీ ప్రస్తుతం వారానికి ఒక మెనూ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గుడ్లు, చిక్కీలు సహా అన్నం, పప్పుచారు, పులిహోర, పప్పూటమోటా, ఆలూకుర్మా, కిచిడి, పొంగలి.. ఇలా రోజుకోరకమైన ఆహారపదార్థాలను విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి విద్యార్థికి వారానికి 5 గుడ్లు అందిస్తున్నారు.
గతంలో మధ్యాహ్న భోజనానికి రూ.515 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టేది. అందులోనూ రూ.400 కోట్లు కేంద్రం నిధులే. కానీ ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.400 కోట్లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.1,500 కోట్లు విద్యార్థుల భోజనం కోసం కేటాయిస్తోంది. కేంద్రం కేవలం 1–8 తరగతుల విద్యార్థులకు మాత్రమే నిధులు అందిస్తుండగా 9, 10 తరగతుల విద్యార్థులకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఆహార పదార్థాల్లో నాణ్యత, పౌష్టికతతోపాటు రుచికరంగా ఉండేందుకు వీలుగా గతంలో విద్యార్థులకు ఒక్కొక్కరిపై రోజువారీ వెచ్చించే మొత్తాన్ని పెంచింది. ప్రాథమిక తరగతుల్లో ప్రతి విద్యార్థికి రూ.11.26ను రూ.16.07కి, ప్రాథమికోన్నత తరగతుల్లో ప్రతి విద్యార్థికి రూ.12.87ను రూ.18.75కి, ఉన్నత పాఠశాలల విద్యార్థుల్లో ప్రతి విద్యార్థికి రూ.17.52ను రూ.23.40కి పెంచారు. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే 88,296 మంది వంట వాళ్లు, సహాయకులకు ఇచ్చే రూ.1,000 గౌరవ భృతిని రూ.3 వేలకు ఇంతకు ముందే పెంచిన సంగతి తెలిసిందే.
అమలుపై ప్రత్యేక శ్రద్ధ.. నాలుగంచెల్లో పర్యవేక్షణ
గతంలో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. ఈసారి నాలుగు అంచెల్లో పర్యవేక్షణ చేస్తూ పథకాన్ని సమర్థంగా అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాల స్థాయిలో.. ప్రధానోపాధ్యాయుడు, తల్లిదండ్రుల కమిటీలు, గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ సేవాసంఘాలు (సెర్ప్, మెప్మా), వివిధ స్థాయిల అధికారులకు పర్యవేక్షణ కమిటీల బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ద్వారా జగనన్న గోరుముద్ద పర్యవేక్షణ కోసం ప్రత్యేక యాప్‌ను, డ్యాష్ బోర్డును ఏర్పాటు చేసింది. రాష్ట్రమంతా జగనన్న గోరుముద్ద ఒకేలా నాణ్యతతో అమలయ్యేలా ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను తెచ్చింది. ఎక్కడైనా సమస్య ఏర్పడితే 14417 టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ప్రవేశపెట్టింది.
Jagananna Gorumudda Scheme: మరింత పకడ్బందీగా ‘జగనన్న గోరుముద్ద’
Published Sun, Mar 27 2022 4:05 AM | Last Updated on Thu, Jun 2 2022 1:37 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment