లక్కున్న వారికే కిక్కు..!
కర్నూలు : లక్కున్న వారికే కిక్కు దక్కింది. జిల్లా పరిషత్ సమావేశ భవనంలో నిర్వహించిన లక్కీ డ్రాలో మద్యం వ్యాపారులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి దగ్గరుండి లక్కీ డ్రాను ప్రారంభించారు. ఎక్సైజ్ ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్ హేమంత్‌నాగరాజు, సూపరింటెండెంట్లు సుర్జీత్ సింగ్, హనుమంతరావుతో పాటు ఏజేసీ అశోక్‌కుమార్, డీఆర్‌ఓ వేణుగోపాల్ రెడ్డి టెండర్ల ప్రక్రియను కొనసాగించారు. దరఖాస్తులు చేసుకున్న వారు శనివారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో జిల్లా పరిషత్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీలు నిర్వహించి పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా కర్నూలు డీఎస్పీ మనోహర్‌రావు పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రాత్రి పొద్దు పోయే వరకు కొనసాగింది. జిల్లాలో 194 మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగా 180 దుకాణాలకు 1801 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 28 మద్యం దుకాణాలకు సింగిల్ దరఖాస్తులు నమోదయ్యాయి. మరో ఏడు మద్యం దుకాణాలకు రెండేసి దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మూడు దరఖాస్తులు వచ్చిన దుకాణాలు ఏడు ఉన్నాయి. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రతి దుకాణానికి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 180 మద్యం దుకాణాల ద్వారా లెసైన్స్ ఫీజు, దరఖాస్తు రుసుం, పర్మిట్ రూం ఫీజు కలిపి మొత్తం ఎక్సైజ్ శాఖకు ఈ ఏడాది రూ. 73.6 కోట్లు ఆదాయం సమకూరింది.
లక్కీ డిప్‌లో దుకాణాలు దక్కించుకున్న వెంటనే డబ్బు చెల్లించేందుకు ప్రత్యేకంగా బ్యాంకు కౌంటర్‌ను పక్కనే అధికారులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది 42 మంది మహిళలు పోటీ పడి తొమ్మిది మంది దుకాణాలు దక్కించుకున్నారు. మద్యం వ్యాపారంతో సంబంధం లేని వారికి కర్నూలు, కోడుమూరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో లక్కీ డిప్ ద్వారా దుకాణాలు దక్కాయి. వాటిని పాత వ్యాపారులే నిర్వహించేందుకు గుడ్‌విల్ పద్ధతిలో బేర సారాలు సాగుతున్నాయి. జిల్లాలోని సంత జూటూరు దుకాణానికి అత్యధికంగా 41 దరఖాస్తులు దాఖలు చేసి వ్యాపారులు పోటీ పడ్డారు. అదే గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డిని అదృష్టం వరించింది. రెండో స్థానంలో రుద్రవరం దుకాణానికి 40 దరఖాస్తులు దాఖలయ్యాయి. కర్నూలులో నాల్గవ నంబర్ దుకాణానికి 34 మంది దరఖాస్తు చేసి పోటీ పడ్డారు.
14 దుకాణాలకు మళ్లీ టెండర్లు...
జిల్లాలో గతేడాదితో పోలిస్తే దరఖాస్తులు రాని దుకాణాల సంఖ్య తగ్గింది. గతేడాది 20 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఈ ఏడాది 14 దుకాణాలకు మాత్రమే దరఖాస్తులు రాలేదు. దరఖాస్తులు రాని దుకాణాల విషయంలో వ్యాపారులు సిండికేట్ అయి ఉండవచ్చునని తెలుస్తోంది. వాటికి త్వరలో టెండర్లు నిర్వహిస్తామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ప్రకటించారు.
చర్చనీయాంశంగా మారిన హోలోగ్రామ్ బిల్లింగ్...
మద్యం వ్యాపారులు హోలోగ్రామ్ బిల్లింగ్ విధానం తప్పనిసరిగా అమలు చేయాలని నిబంధన విధించారు. ఈ విధానం అమలుకు అవసరమైన పరికరాలను సమకూర్చుకున్న తర్వాతనే మద్యం స్టాకు ఇస్తారు. ప్రతి సీసాపై ఒక స్టిక్కర్‌ను అతికిస్తారు. ఫలితంగా ఆయా మద్యం బాటిళ్లు బెల్టు దుకాణాలకు వెళ్లినా, కలుషితం జరిగినా వెంటనే ఆయా బాటిళ్లు ఎక్కడ విక్రయించారన్న విషయం సునాయాసంగా తెలుస్తోంది