సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ అంశంలో తనపై వచ్చిన ఆరోపణలను సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఖండించారు. రీ పోలింగ్ విషయంలో తనను తప్పుబట్టడం సరికాదని ఆయన అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 7 గ్రామాలకు చెందిన ఎస్సీలు ఓటు వేయలేదని ఫిర్యాదు అందిందని, ఫిర్యాదులో తీవ్రత ఉన్నందునే ఈసీకి పంపామన్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేసేలా చూడటం అధికారులుగా తమ బాధ్యత అని అన్నారు.
ఫిర్యాదుపై సాక్ష్యాలు చూసి నిర్ణయం తీసుకునేది ఎన్నికల సంఘమేనని సీఎస్ పేర్కొన్నారు. రీ పోలింగ్ విషయంలో తనను, అధికారులను తప్ప పట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. చూసీ చూడనట్లుగా వదిలేయలేమని, అధికారులు న్యాయం చేయడానికే ఈ వ్యవస్థను రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. రాజ్యాంగం ప్రకారం సమన్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులదేనని, పాలన గుడ్డిగా సాగే పరిస్థితి రానివ్వకూడదని సీఎస్ వ్యాఖ్యానించారు.
చక్రబంధంలో రీపోలింగ్
చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించే పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తుతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మండలంలోని పులివర్తివారిపల్లి 104వ పోలింగ్‌కేంద్రంలో 19వ తేదీ రీపోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, అడిషనల్ ఎస్పీ సుప్రజ గురువారం పులివర్తివారిపల్లెను సందర్శించారు. ఇక్కడ పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి, చిత్తూరు డీఎస్పీ రామాంజనేయులు సారధ్యంలో 13 మంది సీఐలు, 17 మంది ఎస్‌ఐలు, 50 మంది సివిల్ పోలీసులు, వంద మంది స్పెషల్ పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. రీపోలింగ్ జరిగే రోజు వరకు ఇక్కడ 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు.
రిగ్గింగ్‌కు యత్నిస్తే జిల్లా బహిష్కరణ
చంద్రగిరి నియోజకవర్గం ఆర్‌సీ. పురం మండలంలో జరగనున్న రీపోలింగ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ కేకేఎన్.అన్బురాజన్ తెలిపారు. ఆర్సీపురం మండలంలోని రీపోలింగ్ జరిగే వెంకట్రామాపురం, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, ఎన్‌ఆర్.కమ్మపల్లెల్లో గురువారం అర్బన్ ఎస్పీ పర్యటించారు. రీపోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ప్రజలను కోరారు. ఓటు హక్కు స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని కోరారు. రీపోలింగ్ రోజు హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రిగ్గింగ్‌కు యత్నిస్తే, జిల్లా బహిష్కరణతో పాటు పీడి యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించా రు. సమస్యాత్మక గ్రామాలల్లో సాయుధ బలగాలను మోహరించామన్నారు. నిఘాతో పాటు షాడో పార్టీలతో పర్యవేక్షణ ఉంటుందన్నారు.
అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మండలానికి ఒక రక్షక్ మొబైల్, స్ట్రైకింగ్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రీపోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ సమన్వయంతో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలింగ్‌కేంద్రాల వద్ద క్యూల నిర్వహణ, ఈవీఎంల భద్రత కల్పించే బాధ్యత పోలీస్ అధికారులు, సిబ్బందిదే అన్నారు. బూత్‌లోపల, బయట ఎలాంటి సంఘటనలు జరిగినా బాధ్యులపై శాఖాపరమైన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment