
మంత్రి శిద్దాను కలసిన మాగుంట
ఒంగోలు: రాష్ట్ర రహదారులు, భవనాలు, రవాణ శాఖామంత్రి శిద్దా రాఘవరావును ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి బుధవారం ఉదయం ఆయన స్వగృహంలో కలిసి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరూ దాదాపు అర్ధగంటపాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల ఎన్నికల కోడ్ సందర్భంగా మంజూరు చేయించిన పలు పథకాల పనులు ఆగిపోయాయని, వాటిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో వారిని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్, సంతనూతలపాడు టీడీపీ ఇన్‌చార్జి మన్నెం శ్రీధర్, ఒంగోలు సూపర్‌బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం తదితరులు కలిశారు.
సిటీ బస్సులు నడపాలి: ఒంగోలు నగరంలో సిటీ బస్సులు నడపాలని సీపీఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాశరావు, సయ్యద్‌సర్థార్ తదితరులు మంత్రి శిద్దా రాఘవరావును కలిసి విజ్ఞప్తి చేశారు. ఆటో చార్జీలు ప్రయాణికులకు పెనుభారంగా మారాయని, అందువల్ల సిటీ బస్సులు నడపాల్సిన అవసరం ఉందన్నారు. ఒంగోలు డిపో అధికారులు సిటీ బస్సులు నడపకుండా వంకలు చెబుతున్నారన్నారు. జేఎన్‌యూఆర్‌ఎం నిధులతో సంబంధం లేకుండానే సిటీ బస్సులు నడిపేందుకు దృష్టి సారించాలని, దాంతోపాటు పలు మార్గాల్లో పల్లె వెలుగు బస్సులు నడిపేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఆర్టీసీ అధికారులతోను, రవాణాశాఖ అధికారులతో సమీక్షిస్తానని, తప్పకుండా అభివృద్ధి పనులు చేపడదామంటూ మంత్రి వారికి హామీ ఇచ్చారు.
మంత్రికి అభినందనల వెల్లువ:
మంత్రి శిద్దా రాఘవరావుకు అధికారులు, అనధికారులు పలువురు అభినందనలు తెలిపారు. ఆర్టీసీ ఆఫీసర్స్ అసోసియేషన్, ఆర్టీసీ సీఎంఈ రవికాంత్, ఆర్టీసీ నాయకులు తిరుమలేషు, పలువురు ఎక్సయిజ్ అధికారులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. వీరితోపాటు పలువురు జనసేన నాయకులు కూడా శిద్దాను కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.