సాక్షిప్రతినిధి, విజయనగరం: అంచనాలను మించిన తీర్పుతో.. విశ్లేషణలకు అందని ఫలితాలతో.. తెలం గాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)కి ఓటర్లు అఖండ విజయాన్ని అందించారు. తెలం గాణలో మహా కూటమిని నడిపించిన తెలుగుదేశం పార్టీపై తెలుగు ప్రజలు పెం చుకున్న వ్యతిరేకతకు ఈ ఎన్నికలు నిదర్శనమని ప్రతిపక్షాలు అంటుంటే, అనవసరంగా టీడీపీతో పొత్తుపెట్టుకుని అభాసుపాలయ్యామని కాంగ్రెస్ పార్టీ నేతలు మదనపడుతున్నారు. తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఇంటగెలవలేకపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు రచ్చ గెలిచేసి, జాతీయ రాజకీయాలను శాసించేద్దామని చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీతో అనైతిక పొత్తు పెట్టుకుని, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కలుపుకుని మహాకూటమిగా ఏర్పడి, తెలంగాణలో ఎన్నికల ప్రచా రాన్ని కూడా చంద్రబాబు చేశారు. అయితే, వచ్చే ఆకొద్దిపాటి ఓట్టు కూడా ఈ పొత్తుల వల్ల కొట్టుకుపోయాయి. ఆ ప్రభావం జిల్లా రాజకీయాలపైనా పడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంట గెలవలేక..
తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ప్రత్యేకహోదాను అస్త్రంగా వాడి, కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపించి గెలుపు సాధించింది. ప్రత్యేక హోదా హామీని అస్త్రంగా వాడిన చంద్రబాబు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ప్రత్యేక రైల్వే జోన్ తీసుకువస్తామని నమ్మించారు. ఉపాధిలేక, వ్యవసాయం గిట్టుబాటు కాక, ఉద్యోగాలు దొరక్క ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసపోతుంటారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఇక్కడి ప్రజలు ఆశపడి చంద్రబాబును నమ్మి ఓట్లేశారు. కానీ అవేవీ నెరవేరలేదు. నాలుగున్నరేళ్లు కేంద్రంలో బీజేపీతో కలిసి ఉండి కూడా ఏమీ సాధించుకోలేకపోయారు. చివరికి తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడం కోసం తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టి మహా కూటమిని తయా రు చేశారు. ఇవన్నీ గమనిస్తున్న జిల్లా టీడీపీ, కాంగ్రెస్ నేతలు తెలంగాణలో కూటమి విజయంపైనే తమ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని ముందే నిర్ణయించుకున్నారు.
రేపటి పరిస్థితేంటి..
చంద్రబాబు మాటలతో పాటు, లగడపాటి సర్వే కూడా కూటమికి అనుకూలంగా ఉండటంతో కొంత ధీమాగానే ఉన్నారు. అయితే, టీడీపీ కుట్ర లను పటాపంచలు చేస్తూ టీఆర్‌ఎస్ పార్టీ గెలుపొందింది. దీంతో జిల్లా టీడీపీలో ఆందోళన మొదలైంది. రాష్ట్ర విభజన తర్వాత జిల్లా కాంగ్రెస్‌లో ఇప్పటికే ముఖ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోగా, మిగిలిన ఆ కొద్దిపాటి నాయకుల్లో తాజా ఫలితాలతో అంతర్మథనం మొదలైంది. జిల్లాలో ఉన్న టీడీపీ సీనియర్ నేతలకు మహానటుడు, మాజీ సీఎం, దివంగత ఎన్‌టీ రామారావుతోనూ, ఆయన కుటుంబంతోనూ ప్రత్యక్ష సత్సంబంధాలున్నాయి. చంద్రబాబు పంచన ఉన్నప్పటికీ ఎన్‌టీఆర్‌పై వారికి అభిమానం అలాగే ఉంది. పదవి కోసం ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు ఆయన మనుమరాలు, నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని బలిపశువుని చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. రేపటి నుంచి ప్రతి పక్షం, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలెలా చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు.
ఇక్కడా అదే పరాభవం..
ఇక టీడీపీ–కాంగ్రెస్‌ల అనైతిక పొత్తు వల్లనే వచ్చే ఆ కొద్దిపాటి ఓట్లు కూడా పడలేదని ప్రతిపక్షం విశ్లేషిస్తోంది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్ని కల్లోనూ తెలంగాణలో మాదిరిగా> కాంగ్రెస్–టీడీపీలు తుడిసిపెట్టుకుపోతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. హైదరాబాద్‌లో ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన వారే వలసలు వెళ్లి బతుకుతున్నారు. కూటమి ఓటమికి వారు కూడా ఓ కారణమని, తమ ప్రాంతానికి టీడీపీ చేస్తున్న అన్యాయానికి వారు ప్రతీకారం తీర్చుకున్నట్లయ్యిందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. దమ్ముంటే తెలంగాణలో కాదు ఇక్కడ కూడా కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ పోటీచేయాలని సవాలు విసురుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment