ఎదురవుతున్న వ్యతిరేక పరిస్థితిని కూడా సానుకూలంగా మల్చుకోవాలని తరచుగా చెప్పే చంద్రబాబు తెలంగాణలో ప్రజాకూటమి పేరిట కాంగ్రెస్‌ని నిండా ముంచేశారు. కేవలం 13 స్థానాల్లో మాత్రమే పోటీ చేసినా ప్రజాకూటమికి తానే నాయకుడు, సర్వం అయినట్లు వ్యవహరించారు. తన వ్యవహార శైలితో ఎన్నికల వాతావరణాన్ని కూటమికి వ్యతిరేకంగా, తెరాసకు అనుకూలంగా మల్చి ప్రజల భావోద్వేగాలను మళ్లీ తీవ్రస్థాయిలో పెరిగేలా చేయడంలో విజయం సాధించారు. మొత్తంమీద బాబు స్పాన్సర్ చేసిన ప్రజాకూటమి కుట్రకూటమిగా ప్రజలముందు నిలబడగా, కేసీఆర్ వాస్తవికత ప్రాతిపదికన ప్రజలముందుకు వెళ్లి ఘనవిజయం అందుకున్నారు.
ఇటీవల మన చంద్రబాబు గారు నార్సిజం అనే వ్యాధితో బాధపడుతున్నారనిపిస్తోంది. ఆ వ్యాధి ఉన్నవారు తనకు తానే సాటి అని తమంతవారు తామేనని నిజంగానే భావిస్తారట! ఆ వ్యాధి ముదిరితే తన నీడ సైతం చాలా గొప్పదని దానికి కూడా సాటి లేదని అనుకుంటారట! అందుకే తన పార్టీ నిజంగానే జాతీయ పార్టీ అయిందని, తన పొరుగు రాష్ట్రంలో సైతం ప్రజానీకం ఇంకా తనను ఆరాధిస్తున్నారని, కనుక తెలంగాణ ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీవారితో కలిసి కూటమి కట్టారు. మొత్తం 119 స్థానాల్లో తన పార్టీ కేవలం 13 స్థానాల్లోనే పోటీలో ఉన్నా తానే దానికి నాయకుడు, సర్వస్వం అయినట్లు అక్కడ బాబుగారు వ్యవహరించారు. అయినా కాస్త లోకజ్ఞానం ఉన్నవారికెవరికైనా చంద్రబాబు రంగప్రవేశం చేయడంతో మొత్తం వాతావరణం కూటమికి వ్యతిరేకంగా, తెరాసకు అనుకూలంగా ప్రజల భావోద్వేగాలు తిరిగి తీవ్రస్థాయిలో పెరిగాయని గ్రహించడంలో గొప్ప ఏమీలేదు. కేసీఆర్ చెబుతున్నట్లు తెరాస 100 స్థానాలు సాధించినా ఆశ్చర్యం లేదని చెబుతున్నప్పటికీ, కొన్ని మీడియా సంస్థలు ఎందుకింతగా అక్కడ తీవ్ర పోటీ కూటమికి, తెరాసకి మధ్య ఉంటుందని చెబుతూ వచ్చాయో నాకు అర్థం కాలేదు.
అయితే లగడపాటి సర్వే... అదీ నిబంధనలకు, సాంప్రదాయానికి విరుద్ధంగా ఎన్నికలకు రెండు రోజుల ముందే పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మరీ, తెలంగాణ ఎన్నికలలో మహాకూటమి గెలవబోతోందని స్వయంగా తానే చెప్పడం చూసి ఆశ్చర్యపోయాను. లగడపాటి సర్వే కొంత వాస్తవికంగా ఉంటుందని నాకూ కొంత విశ్వాసం ఉండేది. కానీ ఈసారి ఫలితాలు వెలువడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీనే చంద్రబాబు నిలువునా ముంచడమే కాకుండా, చివరకు లగడపాటి వంటి తన మిత్రుడి ప్రతిష్టను కూడా గంగలో కలిపారని భావించాను. అదేమాట ఒక మిత్రుడితో అన్నాను. ఆయన నన్నొక అమాయకుడిని చూసినట్లు చూసి, లగడపాటి ఎవరు, ఆయన ఏపార్టీలో ఉన్నా, లేకున్నా చంద్రబాబు గారి అంతేవాసే కదా! ఆయన కూడా చంద్రబాబు గారి కూట మిలో అంతర్భాగమే! అన్నారు. అయినా ఇంత... అని ఏదో అనబోతోంటే, నా మిత్రుడు, ఆ సర్వే ఏదో కూటమికి చివరి క్షణాల్లో అయినా కాస్త నైతిక సత్తా కోసమే కాదండీ, అందువల్ల ఆయనకు, చంద్రబాబుకి కూడా కొంత ఐహిక లాభం కూడా ఉన్నది. లగడపాటి సర్వేపై కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 1500 కోట్ల రూపాయల పందెం జరిగిందట. పత్రికల్లో చూడలేదా, అన్నాడు.
లగడపాటి సర్వే అనేది బయటకు రాకపోతే బెట్టింగ్ ఎక్కడ ఉండేది? అలా బెట్టింగ్ జరగాలని కూడా లగడపాటి గారి ఉద్దేశం! బెట్టింగ్ కట్టిన వారిలో, బెట్టింగ్ జరగాలని కోరుకుంటున్న వారిలో బడా నేతలు ఉన్నారు. అయితే టీడీపీ నేతలు బెట్టింగ్ కాసింది మాత్రం టీఆర్‌ఎస్ గెలవబోతున్నదనే. అదే సమయంలో ఆ పార్టీలో పిన్నలూ, సాధారణ పందెం రాయుళ్లూ, మామూలు జనం లగడపాటి సర్వే నిజమవుతుం దని పందెం కట్టి సర్వం పోగొట్టుకున్నారట! అన్నాడు. ‘అంటే’ అని అడిగాను. ‘అరటిపండు వలిచినట్లు చెప్పిన తర్వాత కూడా గ్రహించకపోతే ఎలా, బెట్టింగ్ బిజినెస్‌కు తెరలేపి, తద్వారా కూడా లాభపడాలన్న తపనతో కావాలని బయటపెట్టిన సర్వే అది. అయినా ఈ బెట్టింగ్ నిర్వాహకులెవ్వరు? వీరు బెట్టింగ్ వ్యసనపరులా? లేదా ముంచేందుకు రంగంలోకి వచ్చిన రాజకీయవాదులా అని తేలిస్తే–ఈ గుట్టు రట్టవుతుంది!’ అన్నాడా మిత్రుడు.
ఇక ఆపై ఆలోచించసాగాను. తాడితన్నేవాడి తల తన్నేవాడొకడైతే వాటి తల తన్నేవాడుంటారు అంటారు.
అలాగే చంద్రబాబు గారి కౌటిల్యం గ్రహించిన కేసీఆర్, చంద్రబాబు గారి మోదీ వ్యతిరేక ఫ్రంట్ అనే రాజకీయ కూటమికి పోటీగా తాను అటు మోదీ ముక్త, ఇటు కాంగ్రెస్ ముక్త ఫెడరల్ ప్రంట్ నినాదం అందుకున్నారు. ఇక ఎన్నికలు ముగి సిందే తడవుగా, తాను ఫెడరల్ ఫ్రంట్ దిశగా దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని తదనుగుణంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. పార్టీ దైనందిన వ్యవహారాలు చూసేందుకు వీలుగా కేటీఆర్‌ను తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటించేశారు. తనది కుటుంబ పాలన అని తనను విమర్శిస్తున్నవారు మళ్లీ అదే గోల చేస్తారని ఆయనకు తెలుసు. తన కుమారుడు కేటీఆర్ అయినా, మేనల్లుడు హరీష్ రావు అయినా, తన కుమార్తె కవిత అయినా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తమవంతు పాత్ర నిర్వహించిన పార్టీ కార్యకర్తలు అన్న విషయం కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు! వీరిని కేసీఆర్ కుటుంబ సభ్యులనే కాకుండా, తమంత తాముగా పరిణతి చెందిన రాజకీయనేతలుగా కూడా గౌరవిస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఈ ముగ్గురూ తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.
కేసీఆర్‌ది కుటుంబ పాలన అని విమర్శించే ఆస్కారం తనకు లేదని బాబుకు తెలుసు. ఆ సందర్భంగా తమ చినబాబు ప్రస్తావన వస్తే మొదటికే మోసం వస్తుందని కూడా తెలుసు. చినబాబు పార్టీకి గుదిబండగా మారారని తెలిసినా ఏం మాట్లాడలేని పరిస్థితి. నిజానికి చిరంజీవి లోకేశ్‌ను చంద్రబాబే ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టారు. అవతల ప్రత్యర్థి జగన్. ఆయన తండ్రి దివంగత రాజశేఖరరెడ్డి పట్ల ప్రజల్లో ఈరోజుకీ ఆరాధనా భావం, కృతజ్ఞతా భావన అలాగే ఉంది. కాదనలేం కానీ అదే సమయంలో వైఎస్ జగన్ తన సామర్థ్యం, కృషి, పట్టుదలతో కాంగ్రెస్ అధిష్టానాన్నే ధిక్కరించి, పార్టీ స్థాపించి, చాలా కష్ట సమయంలో కూడా చంద్రబాబు టీడీపీని రానున్న ఎన్నికల్లో ఓడించగల పార్టీగా తీర్చిది ద్దారు. గత ఏడాదిగా ఆయన సాగిస్తున్న ప్రజాసంకల్పం యాత్రంలో తాను చూపిస్తున్న నిబద్ధత, ప్రజల పట్ల అభిమానం అన్ని వర్గాల ప్రజల హృదయాలను చూరగొన్నది. కనుక ‘‘ఆరంభింపరు నీచమానవులు’’ అంటూ శాసనసభలోనే వివరించిన తన తండ్రి వైఎస్సార్ స్ఫూర్తితో జగన్ ప్రజాసంకల్పయాత్ర నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో చినబాబును ఎంతగా పెద్ద రాజకీయ వేత్తగా ప్రచారం చేయదలిస్తే అంత నష్టం అని తెలుగుదేశం నేతలకూ తెలుసు. కానీ పిల్లిమెడలో గంటకట్టేదెవరు? చంద్రబాబు సత్యం పలుకరు, సరికదా సత్యం వినరు. అందుకే ఆ నేతలు నోరు మెదపడం లేదు.
ఈ స్థితిలో దేశరాజకీయాలలో ఏదో ఆ పార్టీ, ఈ పార్టీ, వారివారి సంఖ్యాబలాలు, కూడివేతలు, తీసివేతలతో కూటమి కట్టాలనుకుని, అలా చక్రం తిప్పుతున్నట్లు నటించుదామనుకున్నారు బాబు. కానీ పూర్తి సానుకూల ఎజెండాతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నినాదాన్ని తెరమీదకు తెచ్చారు. కేంద్రప్రభుత్వ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా, వివిధ రాష్ట్రాల సహజ హక్కులను నిలబెట్టేందుకు నిజమైన సమాఖ్య వ్యవస్థ రూపంలో దేశపాలన ఉండాలన్నదే కేసీఆర్ ’’సమాఖ్య సంఘటన’’ లక్ష్యం. అలా రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని ఆ దిశగా పయనిద్దామన్నది కేసీఆర్ తపన. కేంద్రప్రభుత్వం పేరిట వివిధ జాతుల ప్రత్యేకతలు, నాగరికత, సంస్కృతీ సంప్రదాయాలను ధ్వంసం చేయడం కూడదని, ఒక జాతి (భాషా ప్రయుక్త రాష్ట్రాలు, అందులో ఉపజాతులు) ప్రత్యేకత, ఆ జాతివనరులు, అభివృద్ధి, ప్రణాళికలు ఆ ప్రజానీకమే నిర్ణయించుకోవాలన్న చాలా సహజమైన, సత్యమైన సద్భావనే కేసీఆర్ సమాఖ్య సంఘటనలో కనిపిస్తున్నది. ఈ భావనతోనే ఆనాడు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అంటూ నాటి కమ్యూనిస్టు పార్టీ అభిప్రాయాన్ని పుచ్చలపల్లి సుందరయ్య నినదించారు. ఆ ప్రజారాజ్యం విశాలాంధ్రలో లేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యం కాకపోతే తెలంగాణ ప్రజానీకం తమకు ఒక ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాలని, తామనుకున్న రీతిలో తమ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకోవడం సహజం. అలా తెలంగాణ ఏర్పడటంలో టీఆర్‌ఎస్ పాత్ర అభినందనీయం.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజానీకం, అలాగే వివిధ రాష్ట్రాలు తమకు అనుకూలమేన్న రీతిలో పురోగమించేందుకు ఒక మంచి మార్గాన్ని తెరాస నేత ఫెడరల్ ఫ్రంట్ నినాదంతో ముందుకు తెస్తున్నారు. మన చంద్రబాబు ఒక నిర్దిష్ట ఆశయం, రాజకీయ విలువలు లేకుండా నిన్నటివరకు మోదీ చంకనెక్కి, అక్కడ గిట్టుబాటు కాలేదని తాజాగా కాంగ్రెస్ చంకనెక్కడం ద్వారా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మంటగలిపారు. దీనికి భిన్నంగా తెలుగు జాతితో సహా, వివిధ జాతుల ఆత్మగౌరవాన్ని ఫెడరల్ ఫ్రంట్ ద్వారా నిలపాలని తలచినవాడు కేసీఆర్. ఆనాడు ఎన్టీఆర్ కేంద్రం పెత్తనం ఏమిటి అని ప్రశ్నించగా ఇప్పుడు కేసీఆర్ సమాఖ్య సంఘటన పేరుతో మన దేశానికి, మన దేశంలోని వివిధ జాతులకు అనువైన ప్రయోజనకరమైన స్ఫూర్తిని రగిలించారు. ఆ స్ఫూర్తికి అనువైన మార్గంలో తగు మార్పులు చేర్పులు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఆ మార్గాన్ని అనుసరిస్తున్న తెరాస మార్గదర్శకమే! తన కాళ్ల కింద భూమి, దాంతో పాటు తన పదవీసింహాసనం కదిలిపోనున్న తరుణంలో ఆ వాస్తవికత నుండి ఏపీ ప్రజల దృష్టి మరల్చేందుకు తానే దార్శనికుడు అన్న రీతిలో కూటములు కట్టడం, వివిధ పార్టీనేతలతో చర్చలతో తలమునకలైనట్లు ప్రచారం చేసుకుంటూ బాబు చక్రం తిప్పుతున్న ప్రజాకూటమి.. కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి పేరుతో కేసీఆర్ ముందుకు తెచ్చిన సమాఖ్య సంఘటనకు సాటిరాదు.
మరోవైపున ఏ కూటమిని బలపర్చకుండా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి అవసరమైన అంశానికి మద్దతునిచ్చేవారినే కేంద్రంలో బలపరుస్తామని మొదటినుంచి తేల్చిచెబుతున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఆడిపోసుకోవడం బాబుకు రివాజుగా మారింది. తెలం గాణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కేసీఆర్‌కు మర్యాద పూర్వకంగా అభినందనలు తెలిపిన వైఎస్ జగన్‌ని పండుగ చేసుకుంటున్నాడంటూ హేళన చేసే స్థాయికి చంద్రబాబు, టీడీపీ దిగజారిపోవాలా?
డాక్టర్ ఏపీ విఠల్
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు, మొబైల్ : 98480 69720
Comments
Please login to add a commentAdd a comment