తెలంగాణలో టీఆర్‌ఎస్ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందని సీ–ఓటర్ సర్వే చెబుతోంది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలుండగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కు 9, కాంగ్రెస్‌కు 6, బీజేపీ, ఎంఐఎంలకు చెరో సీటు దక్కుతాయని సర్వే తేల్చింది. 2014లో టీఆర్‌ఎస్ 11 స్థానాల్లో గెలుపొందింది. ఇప్పుడు ఆ పార్టీకి దాదాపు 35 శాతం ఓట్లు పడతాయనీ, 2014తో పోలిస్తే 2 సీట్లు తగ్గుతాయని సర్వే అంటోంది. తెలంగాణలో కాంగ్రెస్–టీడీపీ, ఇతర పార్టీలు కలిసి ఎన్నికల్లో కూటమిగా పోటీచేయాలని ఇప్పటికే నిర్ణయించడం తెలిసిందే. 2014లో టీడీపీ–బీజేపీ కలిసి పోటీ చేయగా ఇరు పార్టీలూ చెరో సీటును గెలిచాయి. ఇటీవలే ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఇప్పుడు బీజేపీ తన ఒక్క సీటును నిలుపుకోనుండగా టీడీపీ మాత్రం ఆ సీటును కూడా కోల్పోనుందని తేలింది. మరోవైపు కాంగ్రెస్ గత ఎన్నికల్లో రెండే సీట్లు గెలిచినప్పటికీ టీడీపీ, ఇతర పార్టీల కూటమితో లాభపడి ఈసారి ఆరు సీట్లు గెలవనుందని సర్వే పేర్కొంది. ఎంఐఎం పార్టీకి 2014లో వచ్చిన ఓట్ల కన్నా ఇప్పుడు 22 శాతం ఓట్లు అధికంగా వస్తాయనీ, అయితే ఆ పార్టీ ఒక్క సీటుకే పరిమితమవుతుందంది.
Comments
Please login to add a commentAdd a comment