బసవరాజు
ఫేస్‌బుక్‌లో సీఎంపై పోస్టు పెట్టాడని అదుపులోకి తీసుకున్న పోలీసులు
శాంతిపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఫేస్‌బుక్‌లో వ్యంగ్యంగా పోస్టు పెట్టాడంటూ వైఎస్సార్‌సీపీ అభిమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారం క్రితం ఫేస్‌బుక్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కించపరిచేలా అధికార టీడీపీకి చెందిన ఒకరు పోస్టు పెట్టారు. ఆ పోస్టును చూసి సహించలేనిచిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కాలిగానూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ అభిమాని బసవరాజు దాన్ని ఖండిస్తూ ఫేస్‌బుక్‌లో సీఎంపై ఓ ఫొటో కామెంట్ పోస్ట్ చేశాడు. దీనిపై పోలీసులు తీవ్రంగా స్పందించారు.
బెంగళూరులో దర్జీగా పనిచేస్తున్న బసవరాజుకు ఫోన్ చేసి పిలిపించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు పోలీసు స్టేషన్ వద్దకు రాగానే లోపల కూర్చోబెట్టారు. 3 గంటలకు సీఐ పిలుస్తున్నారంటూ కుప్పం తీసుకువెళ్లారు. అక్కడి నుంచి గుడుపల్లి స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించి రాత్రి విడుదల చేశారు. వైఎస్ జగన్‌పై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వారిని వదిలేసి, దాన్ని ఖండించిన వ్యక్తిని అరెస్ట్ చేయడం దారుణమని బసవరాజు కుటుంబీకులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేధింపులను సహించం..
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న రాజకీయ వేధింపులను సహించబోమని కుప్పం నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కె.చంద్రమౌళి తేల్చిచెప్పారు. అధికార పార్టీ దురాగతాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. ప్రతి కార్యకర్తనూ, అభిమానిని కాపాడుకుంటామన్నారు.