ఘట్‌కేసర్, న్యూస్‌లైన్:
పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని ప్రత్యర్థులు వెంటాడి.. వేటాడి .. కళ్లలో కారంపొడి చల్లి కత్తి, ఇనుపరాడ్డుతో దాడి చేశారు. ఈ సంఘటన మండలంలోని కొర్రెముల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొర్రెములకు చెందిన భవానీఆనంద్, కళమ్మ దంపతులు. భవానీఆనంద్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా భార్య వీబీకేగా విధులు నిర్వర్తిస్తోంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో భవానీఆనంద్ ఉద్యోగం నుంచి బైకుపై ఇంటికి వచ్చాడు. భార్య తలుపు తీయకపోవడంతో బైకు హారన్ మోగించాడు. ఇంటికి సమీపంలో నివాసముంటున్న ప్రత్యర్థులు గ్యార యాదయ్య, అతని కుమారులు గోవర్ధన్, శివకుమార్‌లు అక్కడి వచ్చారు. తమకు నిద్రాభంగం చేశావని భవానీఆనంద్‌తో గొడవపడ్డారు. దీంతో స్థానికులు ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించారు. శనివారం ఉదయం కూడా ఇరువర్గాల వారు ఘర్షణకు దిగారు.
పాత కక్షలు ఉండడంతో గ్యార యాదయ్య తన కుమారులతో కలిసి భవానీఆనంద్‌ను వెంబడించారు. కళ్లలో కారం పొడి పోసి కత్తి, ఇనుపరాడ్డు, క్రికెట్ వికెట్‌తో బాదారు. భయపడిన భవానీఆనంద్ గ్రామంలోని మాజీ సర్పంచ్ గుడ్డు కృష్ణ ఇంటికి పరుగెత్తాడు. యాదయ్య తన కుమారులతో అక్కడికి చేరుకొని భవానీఆనంద్‌పై తిరిగి దాడి చేసి కళ్లలో కారంపొడి పోశారు. దీంతో భవానీఆనంద్ కుప్పకూలిపోయాడు. మాజీ సర్పంచ్ వచ్చి యాదయ్యతో పాటు ఆయన కుమారులను అడ్డుకున్నాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్న భవానీఆనంద్‌ను ఆస్పత్రికి తరలించాడు. స్థానికుల సాయంతో ఆయన యాదయ్య, ఆయన కుమారుడు శివకుమార్‌ను పోలీసులకు అప్పగించాడు. గోవర్ధన్ పరారీలో ఉన్నాడు. నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యర్థుల దాడితో తీవ్ర భయాందోళనకు గురైన భవానీఆనంద్ కుటుంబం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. ప్రస్తుతం భవానీఆనంద్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
రూ. 50 కోసం కక్షలు..
ఏడాది క్రితం భవానీ ఆనంద్ కొర్రెముల గ్రామంలో కొన్నాళ్లపాటు టైప్‌రైటింగ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించాడు. నెలకు ఫీజు రూ.150గా నిర్ణయించాడు. ఇన్‌స్టిట్యూట్‌లో గ్యార యాదయ్య కుమారుడు గోవర్ధన్ చేరాడు. ఆయన ఫీజు రూ.150కు బదులు రూ.100 చెల్లించాడు. మిగతా రూ.50 కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇది చినికిచినికి గాలివానలా మారింది. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య కక్షలు పెరిగాయి. తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో రెండు నెలల క్రితం గోవర్ధన్‌పై ఆనంద్ దాడి చేశాడు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా శనివారం భవానీఆనంద్‌పై యాదయ్య కొడుకులతో కలిసి దాడి చేశాడు.
వెంటాడి.. వేటాడి
Published Sat, Feb 1 2014 11:35 PM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement
Advertisement