హైదరాబాద్: తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరిన మాజీ ప్రియుడిని.. తాజా ప్రేమికుడితో కలిసి కిడ్నాప్ చేయాలని యత్నించిన ఓ యువతి సంఘటన ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలో ఆదివారం కలకలం లేపింది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..మేడిపల్లికి చెందిన కీసర అవినాశ్‌రెడ్డి (29) పీర్జాదిగూడ బుద్దానగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమార్తె అరోషికారెడ్డి (25) అలియాస్ అన్షితారెడ్డి గతంలో ప్రేమించుకున్నారు. 2016 నుంచి 2021 వరకు వీరి మధ్య స్నేహం, ప్రేమ కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే అన్షితారెడ్డి తన అవసరాల కోసం అవినాశ్‌రెడ్డి వద్ద రూ.25 లక్షలు తీసుకుంది.
అనంతరం కొద్దిరోజుల తర్వాత అన్షితారెడ్డి అతడ్ని దూరం పెట్టి మాదాపూర్‌లో ఉండే సిద్దిపేట్‌కు చెందిన చక్రధర్‌గౌడ్‌తో స్నేహం ఏర్పరుచుకుంది. ఈ విషయం తెలుసుకున్న అవినాశ్‌రెడ్డి ఆమెతో విభేదించి..తనవద్ద తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కోపం పెంచుకున్న అన్షితారెడ్డి ఎలాగైనా అవినాశ్‌రెడ్డిని అంతం చేయాలని భావించి చక్రధర్‌గౌడ్‌తో కలిసి కిడ్నాప్‌నకు పథకం వేశారు. ఈమేరకు ఆదివారం సాయంత్రం ఘట్‌కేసర్‌లోని వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న ఓ హోటల్ వద్దకు వస్తే తీసుకున్న డబ్బులు ఇస్తామని నమ్మబలికారు.
దీంతో అవినాశ్‌రెడ్డి అక్కడకురాగానే అప్పటికే అక్కడ తన అనుచరులతో కలిసి మాటువేసి ఉన్న చక్రధర్‌గౌడ్..అవినాశ్‌రెడ్డిని కారులోకి బలవంతంగా ఎక్కించారు. ఈ క్రమంలో ఘర్షణ జరగడంతో స్థానికులు గమనించి అక్కడికి రాగా...కిడ్నాపర్లు అక్కడి నుంచి పారిపోయారు. బాధితుడు అవినాశ్‌రెడ్డి అక్కడి నుంచి తప్పించుకుని ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో తక్షణమే స్పందించిన పోలీసులు చక్రధర్‌గౌడ్, కారు డ్రైవర్ మామిండ్ల గౌత్‌మ్‌ను పీర్జాదిగూడలో అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కాగా చక్రధర్‌గౌడ్‌కు అప్పటికే పెళ్లయి..ఇద్దరు సంతానం ఉన్నట్లు, అన్షితారెడ్డిని ఆర్యసమాజ్‌లో వివాహమాడినట్లు సమాచారం. ఈ మేరకు ఘట్‌కేసర్ పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment