మదనపల్లి : చిత్తూరు జిల్లా మదనపల్లిలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న నరసింహ ప్రైవేటు లాడ్జిలో మంగళవారం శివశంకర్(30) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుంగనూరు చెందిన శివశంకర్(30) మూడురోజుల క్రితం లాడ్జిలో రూం తీసుకున్నాడు. కాగా మంగళవారం లాడ్జికి చెందిన వ్యక్తులు తలుపుకొడుతుంటే ఎంతకీ తీయకపోయేసరికి కిటీకీలు తెరచి చూశారు.
శివశంకర్ బెడ్‌పై అచేతనంగా పడిఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా.. శివశంకర్ బీరులో విషం కలుపుకుని తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే చనిపోయిన వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని అతడి అన్న తెలిపారు.