ఆరిలోవ(విశాఖ తూర్పు): వారికి వివాహమై మూడు నెలలైంది. కలకాలం జీవించాలని ఎన్నో కలలు కన్నారు. ఇంతలోనే ఆ బంధాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో విధి విడదీసింది. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన బత్తిన అశోక్(32) సుమారు పదేళ్ల క్రితం విశాఖ వచ్చాడు. అప్పటి నుంచి ఆరిలోవలో ఉంటూ జీవీఎంసీ వాటర్ సప్‌లై డిపార్ట్‌మెంట్ బోర్‌వెల్స్ విభాగంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. మంచి పనితనం ఉన్న కుర్రాడిగా అధికారులు, తోటి సిబ్బంది నుంచి పేరు తెచ్చుకున్నాడు. పాలకొండకు చెందిన శోభారాణితో ఈ ఏడాది జూన్ 8న అశోక్‌కు పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వారిద్దరూ కలిసి ఆరిలోవ బాలాజీనగర్‌లో ఓ అద్దింట్లో ఉంటున్నారు. ఆషాఢ మాసంలో శోభారాణి కన్నవారి ఇంటి వద్ద ఉండి ఇటీవలే భర్త వద్దకు తిరిగి వచ్చింది
ఈ క్రమంలో అశోక్ సోమవారం మధ్యాహ్నం బైక్‌పై నగరానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో బీర్‌టీఎస్‌లో కొత్తవలస నుంచి బీచ్ రోడ్డుకు వెళుతున్న 68కే సిటీ బస్సు వస్తుండగా.. మధ్య లైన్‌లో అశోక్ బైక్‌పై ఆరిలోవ వైపు వస్తున్నాడు. సరిగ్గా సంజయ్‌గాంధీ కాలనీ వద్ద బస్సు కుడివైపున అశోక్ బైక్ ఢీకొట్టింది. దీంతో అశోక్ ఎగిరిపోయి పక్కనే ఉన్న డివైడర్‌పై పడ్డాడు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అతని కుడికాలు రెండు ముక్కలైంది. విషయం తెలుసుకున్న ఆరిలోవ ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని లా అండ్ ఆర్డర్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న భార్య శోభారాణి కేజీహెచ్ మార్చురీ వద్దకు చేరుకుని కన్నీటిపర్యంతమైంది. భోజనానికి ఇంటికి వచ్చేస్తున్నానంటూ చెప్పిన అర్ధ గంటలోనే
పాలకొండలో విషాదఛాయలు..
పాలకొండ రూరల్: బస్సులో ఉన్న తనను ‘జాగ్రత్తగా వెళ్లుమ్మా’ అని ఫోన్ చేసి చెప్పిన కుమారుడు తాను ఇంటికి చేరుకోకుండానే మృతి చెందిన కబురు వినిపించిందంటూ అశోక్ తల్లి పార్వతి కన్నీరుమున్నీరుగా విలపించింది. వైజాగ్‌లో ఉంటున్న తన కుమారుడి దగ్గరకు ఆదివారం వెళ్లానని, సోమవారం ఒంటి గంట సమయంలో పాలకొండ వచ్చేందుకు తన అల్లుడు బైక్‌పై విశాఖ బస్‌స్టాండ్‌కు చేరానని ఆమె తెలిపారు. రెండు గంటల సమయంలో తన కుమారుడు ఫోన్ చేశాడని ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని ఆమె విలపించారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న ఏకైక కుమారుడు మృతి వార్త విన్న తండ్రి ప్రసాద్ బోరున రోదించాడు. అశోక్ మృతి విషయం తెలుసుకున్న నగర పంచాయతీ కమిషనర్ ఇ.లిల్లీపుష్పనాథం మృతుని గృహానికి వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే సహాయాన్ని అందిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment