దర్శి ఆస్పత్రి వద్ద విలపిస్తున్న తల్లి, బంధువులు
ప్రకాశం,ముండ్లమూరు: మండలంలోని రెడ్డినగర్‌కు సమీపంలో రజానగర్ మేజర్‌లో ప్రమాదవశాత్తు కాలుజారి పడి పిట్టం అజయ్‌రెడ్డి (23) అనే వ్యక్తి మృతి చెందాడు. అజయ్‌రెడ్డిది దర్శి మండలం అబ్బాయిపాలెం. భార్య శివమణి దర్శిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం మగబిడ్డకు జన్మనిచ్చింది. రాత్రంతా అజయ్‌రెడ్డి భార్య వద్దే ప్రైవేటు ఆస్పత్రిలోనే ఉన్నాడు. గురువారం ఉదయం స్నానం చేసేందుకు రజానగరం మేజర్ పరిధిలో రెడ్డినగర్ వద్దకు ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లాడు. కాలువలో మెట్లపై కూర్చొని స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడ్డాడు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కాలువలో కొట్టుకు పోతుండగా ఇద్దరు స్నేహితులూ పెద్దగా కేకలు వేశారు.
చుట్టు పక్కల ఉన్న వారు అక్కడకు చేరుకున్నారు. ఇంతలోనే దగ్గరలోని తూములోకి జారుకోవడంతో ఊపిరాడక అజయ్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం 11 గంటల వరకు భార్య పక్కనే ఉండి బిడ్డను చూసి మురిసిపోయాడు. అంతలోనే కాలువకు వెళ్లి మృతి చెందాడని వార్త తెలుసుకున్న బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇంతలో అక్కడకు చేరుకున్న అజయ్‌రెడ్డి తల్లిదండ్రులు ప్రభావతి, సుబ్బారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు భోరున విలపించారు. మృతుడు తమ్ముడు రాజశేఖరరెడ్డి దర్శిలో డిగ్రీ చదువుతున్నాడు. వీఆర్వో మందా పెద్దన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె.రామకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment