అనధికారికంగా శ్రీ విజయ వైన్‌షాపు పక్కన ఏర్పాటు చేసిన గది
ఎంవీపీ కాలనీ, విశాఖ క్రైం: తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లిక్కర్ మాఫియా బాగోతం మరోసారి తెరపైకొచ్చింది. ధనార్జనే లక్ష్యంగా సాగుతున్న ఈ వ్యవహారానికి మరో నిండు ప్రాణం బలైంది. ఇటీవల ఇందిరానగర్‌లోని అనుపమ బార్ అండ్ రెస్టారెంట్ ఆవరణలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం మరువకముందే మరో విషాద సంఘటన అప్పుఘర్‌లో చోటు చేసుకుంది. మర్రిపాలెం ప్రాంతానికి చెందిన ములంపాక తిరుమలరావు ఈ లిక్కర్ మాఫియా షాపులో మృతిచెందాడు. తూర్పు నియోజకవర్గంలోని పలు షాపులను ఎమ్మేల్యే వెలగపూడి రామకృష్ణబాబు బినామీ పేర్లతో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీ విజయ వైన్స్‌లో శుక్రవారం రాత్రి మరో వ్యక్తి మృతి చెందడం ఈ లిక్కర్ ఫియాను మరోసారి తెరపైకి తెచ్చింది.
కుప్పకూలిన తిరుమలరావు
మర్రిపాలెంకు చెందిన తిరుమలరావు కీ బోర్డు కళాకారుడిగా పనిచేస్తున్నారు. కార్తీకమాసం నేపథ్యంలో తన బృందంలోని ఇతర కళాకారులతో కలిసి ఆయన అప్పుఘర్ దరి శ్రీ సాయిరామ శక్తిలింగేశ్వర ఆలయంలో భజన కార్యక్రమానికి హాజరయ్యాడు. ఉదయం నుంచి అక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు సంగీత సహకారం అందించిన ఆయన శుక్రవారం రాత్రి అక్కడికి కూతవేటు దూరంలో ఉన్న శ్రీ విజయవైన్స్‌లో మద్యం సేవించడానికి వెళ్లినట్లు సహచరులు వెల్లడిస్తున్నారు. అయితే వైన్‌షాపుకు వెళ్లిన తిరుమలరావు మేన్‌సన్ హౌస్ (ఎంహెచ్) క్వార్టర్ బాటిల్ తీసుకున్నాడు. తీసుకున్న అనంతరం అనధికారికంగా వైన్‌షాపు పక్కన ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్లి సేవించినట్లు పలువురు వెల్లడించారు. అయితే ఆ మద్యం సేవించిన కొద్ది సేపటికే ఆయన కుప్పకూలినట్లు తెలిపారు. దీంతో కొద్దిసేపటి తర్వాత పక్కనున్న పలువురు దగ్గరికొచ్చి చూడగా తిరుమలరావు మృతి చెందినట్లు తెలిసిందని అక్కడ మద్యం సేవిస్తున్న పలువురు వెల్లడించారు. అనంతరం అక్కడి నుంచి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించినట్లు వారు తెలిపారు.
పత్తాలేని ఎక్సైజ్ శాఖ
వైన్‌షాపులో మద్యం సేవిస్తూ తిరుమలరావు మరణించడంపై ఎక్సైజ్ శాఖ స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పక్క మృతదేహం వైన్‌షాపులో ఉండగానే మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగాయి. షాపు నిర్వాహకులు కనీసం తిరుమలరావు కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకుగాని, ఆస్పత్రికి తరలించేందుకు గాని ప్రయత్నించకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని కళా బృందానికి చెందిన వ్యక్తులు వైన్‌షాపుకు వచ్చి గొడవ చేస్తేగానీ అక్కడి షాపు నిర్వాహకులు అంబులెన్స్‌కు కూడా సమాచారం అందించలేదు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది కనీసం అటువైపు చూసిన దాఖలాలు లేవు. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా అక్కడ విచారణ చేపట్టకపోవడం గమనార్హం. దీంతో ఎక్సైజ్, సివిల్ పోలీసులు సైతం కల్తీ మాఫియా కనుసన్నల్లోనే విధులు నిర్వహిస్తున్నారనే వాదనలకు మరింత బలం చేకూరింది.
Comments
Please login to add a commentAdd a comment