న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న సన్యాసినాయుడు కుటుంబ సభ్యులు
సాక్షి, బుచ్చెయ్యపేట(చోడవరం): తమ కుమార్తెతో అసభ్యకరంగా మాట్లాడాడని ఆగ్రహించిన మండలంలో రాజాం గ్రామంలో బాలిక కుటుంబ సభ్యులు దాడి చేయడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య కన్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తన పొలంలో వరి పంటకు తెగుళ్లు సోకడంతో పురుగుమందు స్ప్రేయర్ కోసం రాజాం గ్రామానికి చెందిన ఏడువాక సన్యాసినాయుడు(40) అదే గ్రామానికి చెందిన మరిసా రాజులమ్మ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో రాజులమ్మ ఇం టి వద్ద లేకపోగా ఆమె 13 సంవత్సరాల కుమార్తెను స్ప్రేయర్ ఇవ్వమని సన్యాసినాయుడు అడిగాడు. ఇంటివద్ద మా కుటుంబ సభ్యులు లేర ని, తరవాత రమ్మని రాజులమ్మ కుమార్తె తెలి పింది. సాయంత్రం ఇంటికి వచ్చిన రాజులమ్మకు తనతో సన్యాసినాయుడు అసభ్య పదజాలంతో మాట్లాడినట్టు బాలిక తెలిపింది.
సన్యాసినాయుడుతో బాలిక తల్లి,కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి గొడవ పడి, అతనిపై దాడి చేశారు. ఆ సమయంలో సన్యాసినాయుడు రోడ్డుపై పడడంతో తలకి గాయమై అక్కడకక్కడే మృతి చెందాడు. సంఘటన సమాచారం తెలిసిన వెంటనే అనకాపల్లి డీఎస్పీ శ్రావణి,చోడవరం సీఐ కె.ఈశ్వరరావు, బుచ్చెయ్యపేట పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి, మృత దేహాన్ని చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతుడి భార్య కన్నమ్మ ఆమె కుటుంబ సభ్యులు సోమవారం గ్రామంలో ఆందోళనకు దిగారు. చిన్న విషయానికే ప్రాణాలు తీసేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన భర్త చావుకు కారణమైన బాలిక తల్లి రాజులమ్మ,బాబాయి శ్రీను,నానమ్మ అప్పలకొండ కుటుంబ సభ్యులు సత్యవతి,సన్యాసినాయుడులపై చర్యలు తీసికోవాలని కన్నమ్మ ఫిర్యాదు చేయడంతో ఆ ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సన్యాసినాయుడు మృత దేహానికి పంచనామా నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment