
నిందితుడిని గేటుకు కట్టేసిన స్థానికులు
గాజువాక: ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారితో ఓ మృగాడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి అకృత్యాన్ని సకాలంలో గుర్తించిన స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటనపై గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీనగర్ ప్రాంతంలోని తన అమ్మమ్మ ఇంటి ముందు ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన టి.గౌరీశంకర్ అనే వ్యక్తి వృద్ధురాలితో మాట్లాడుతుండగా.. ఆ చిన్నారి మూత్ర విసర్జన కోసం ఇంటి బయటకు వెళ్లింది. గమనించిన ఆయన అక్కడ్నుంచి చిన్నారి వద్దకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
దీంతో బాలిక గట్టిగా అరవడంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూసేసరికి గౌరీశంకర్ తప్పించుకొని వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. అతడిని స్థానికుల సహాయంతో పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం ఇంటి గేటుకు కట్టేసి గాజువాక పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాజువాక సీఐ సూరినాయుడు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుడు ఒడిశా ప్రాంతానికి చెందిన వాడని సీఐ తెలిపారు. స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ ఈ ప్రాంతంలోనే బాధ్యతారాహిత్యంగా తిరుగుతుంటాడు. చిన్నారి కుటుంబ సభ్యులు శ్రీనగర్ ప్రాంతంలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment