ఆలిని కత్తితో నరికి చంపిన భర్త
ఎంత నచ్చజెప్పినా భార్య ప్రవర్తన మార్చుకోకపోగా, కాపురానికి కూడా రావడం లేదని ఆగ్రహించిన భర్త అతి కిరాతకంగా ఆమెను నరికి చంపాడు. అడ్డొచ్చిన అత్తయ్య, ఇద్దరు బావమరుదుల పైనా దాడి చేశాడు. తూర్పుగోదావరి జిల్లా సీతాపురం మండలం సింగవరంలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సామర్లకోట మండలం నవరకు చెందిన కోరుమిల్లి శ్రీనివాస్ తాపీ పని చేస్తుంటాడు. అతడికి మూడేళ్ల క్రితం రెండో వివాహమైంది. సింగవరానికి చెందిన వీరమణి (28)ని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఏడాదిన్నర కుమార్తె ఉంది. పెళ్లయినప్పటి నుంచి సింగవరంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. శ్రీనివాస్ మొదటి భార్య గ్యాస్ స్టౌపై వంట చేస్తుండగా చీరకొంగు అంటుకుని మరణించింది. అప్పట్లో శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేయగా, కోర్టులో అతడిపై నేరం నిరూపణ కాలేదు. శ్రీనివాస్‌తో వీరమణిది నాలుగో వివాహం. అంతకు ముందు పెళ్లి చేసుకున్న వారు వివిధ కారణాలతో ఆమెను విడిచిపెట్టారు. వీరమణి నడవడిక సక్రమంగా లేదని నెల రోజుల క్రితం శ్రీనివాస్ ఆమెతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తగాదాను పెద్దల్లో పెట్టగా, ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలని వారు శ్రీనివాస్‌తో చెప్పారు. దీంతో శ్రీనివాస్ తన సొంత గ్రామానికి వెళ్లిపోయాడు.
హతమార్చి.. ఆత్మహత్య చేసుకోవాలని..
శనివారం రాత్రి రెండు బాటిళ్లలో పెట్రోలు, అగ్గిపెట్టె, కత్తి, రెండు జతల దుస్తులు, పురుగుమందును వెంట తీసుకుని శ్రీనివాస్ సింగవరంలో భార్య ఇంటికి వచ్చాడు. ఆదమరచి నిద్రపోతున్న వీరమణి కుడి చెంపపైనా, మెడపై కత్తితో వేటు వేయగా, ఆమె కేకలు వేస్తూ అక్కడికక్కడే చనిపోయింది. కుమార్తె కేకలు విన్న ఆమె తల్లి వెంకటలక్ష్మి అక్కడకు రాగా, ఆమె మెడ, తలపై కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన బావమరుదులు రామారావు, వీరమణి పెదనాన్న కుమారుడు వీరవెంకట కృష్ణలను గాయపర్చాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగేశాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న స్థానికులు.. శ్రీనివాస్‌ను పట్టుకుని చెట్టుకు కట్టేశారు.
తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని అంబులెన్స్‌లోను, అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్‌ను ఆటోలోను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంకటలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదివారం ఉదయం ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీనివాస్, రామారావు, వెంకటకృష్ణ రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరమణి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రవర్తన మార్చుకోమని వీరమణికి ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ఆమెను హతమార్చినట్టు శ్రీనివాస్ చెప్పాడని సీఐ రమణ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.