తిరుపతిలో సందడే సందడి
- అడుగడుగున స్వాగతతోరణాలు
- చంద్రబాబుకు టీడీపీ శ్రేణుల ఘనస్వాగతం
- ఎమ్మెల్యేల పలకరింపులు, అభినందనలతో కోలాహలం
సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్షం నేత ఎన్నిక కోసం బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు సహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ ప్రముఖులు తిరుపతి చేరుకోవడంతో నగరంలో సందడి నెలకొంది. ఉదయం నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి ఎమ్మెల్యేలు నగరానికి చేరుకోవడం ప్రారంభించారు. దీంతో ఎక్కడ చూసినా వీఐపీల తాకిడి కనిపించింది.
అధినేత చంద్రబాబు మాత్రం ప్రత్యేక విమానంలో సాయంత్రం 6.20 గంటలకు రేణిగుంట చేరుకున్నారు. రేణిగుంటలో ఆయనకు కార్యకర్తల నుంచి ఘనస్వాగతం లభించింది. అక్కడి నుంచి తిరుచానూరు, ఎయిర్ బైపాస్ రోడ్డు, పద్మావతి మహిళా యూనివర్సిటీ మీదుగా పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుమహిళ అధ్యక్షురాలు పుష్పావతి నేతృత్వంలో తెలుగుమహిళలు ఘనస్వాగతం పలికారు.
చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొత్తగా ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు. చంద్రబాబు కాన్వాయ్ ప్రయాణించిన మార్గంలో అడుగడుగునా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. జిల్లాకు చెందిన నాయకులే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల పేరుతోనూ స్వాగత ఫ్లెక్సీలు కనిపించాయి. ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాలను పసుపు తోరణాలతో అలంకరించారు.
గంటన్నరపాటు పద్మావతిలో మంతనాలు
పద్మావతి అతిథిగృహం ప్రధాన ద్వారం వద్ద చంద్రబాబుకు టీటీడీ కార్యనిర్వహణాధికారి గిరిధర్‌గోపాల్ ఆహ్వానం పలికారు. కొద్దిసేపు గోపాల్‌తో మర్యాదపూర్వక భేటీ జరిగింది. అనంతరం అక్కడికి వచ్చిన శాసనసభ్యులు, పార్టీ నాయకులతో మంతనాలు చేస్తూ గంటన్నరపాటు గడిపారు.
జిల్లాకు చెందిన సీనియర్ నేతలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ముద్దుకృష్ణమనాయుడు, ఎం. వెంకటరమణ, జి.శంకర్, తలారి ఆదిత్య, సత్యప్రభ, చదలవాడ కృష్ణమూర్తి, ఎన్వీ.ప్రసాద్, ఊకా విజయకుమార్, ఎస్సీవీ.నాయుడు తదితరులతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన నేతలతోనూ చంద్రబాబు మాట్లాడారు. రాత్రి ఏడున్నర గంటలకు టీడీఎల్పీ నేత ఎన్నికలో పాల్గొనేందుకు గెస్ట్‌హౌస్ నుంచి యూనివర్సిటీ సెనేట్ హాల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు.
యూనివర్సిటీ గోల్డన్‌జూబ్లీ ఆర్చి నుంచి సెనేట్ హాల్ వరకు అరటితోరణాలతో అలంకరించారు. దీంతోపాటు యూనివర్సిటీ ప్రాంగణంలో టీడీపీ జెండాలు కట్టారు.
పోలీసుల గుప్పెట్లో యూనివర్సిటీ
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ బుధవారం అంతా పోలీసుల గుప్పెట్లో ఉండిపోయింది. యూనివర్సిటీ ప్రధాన ద్వారం గుండా ఎవరినీ అనుమతించలేదు. వీఐపీలు, ఎమ్మెల్యేలను సైతం రెండో ద్వారం గుండానే లోపలికి అనుమతించారు. ఇక్కడి నుంచి సెనేట్‌హాల్ వెళ్లే వరకు పలుచోట్ల పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు జరిపిన తరువాతనే పంపారు. కొత్తగా ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలను సైతం పోలీసులు గుర్తించలేక అడ్డుకున్నారు.
సాయంత్రం ఆరు గంటల నుంచి సెనేట్ హాల్‌కు ఎమ్మెల్యేల రాక మొదలైంది. దీంతో శాసనసభ్యుల పరస్పరం పలకరింపులు, అభినందలతో అక్కడ సందడి నెలకొంది. చంద్రబాబు కాన్వాయ్‌కి ఇబ్బంది లేకుండా నగరంలోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. బాలాజీ కాలనీ సర్కిల్ నుంచి యూనివర్సిటీ వైపు వాహనాలు అనుమతించలేదు. దీంతో ఇటువైపు వెళ్లే వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.