మానవసేవే మాధవ సేవ | Manavaseve Madhava service | Sakshi
Sakshi News home page

మానవసేవే మాధవ సేవ

Published Tue, Oct 14 2014 2:54 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

మానవసేవే మాధవ సేవ - Sakshi

మానవసేవే మాధవ సేవ

  • వైద్య విద్యార్థులకు స్విమ్స్ వైస్‌చాన్స్‌లర్ వెంగమ్మ పిలుపు
  • స్నాతకోత్సవంలో ఏడుగురికి గోల్డ్‌మెడల్స్..
  • కోర్సులు పూర్తిచేసుకున్న 296 మందికి డిగ్రీలు ప్రదానం
  • తిరుపతి కార్పొరేషన్ : మానవ సేవే మాధవ సేవ అని, అదే స్ఫూర్తితో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని స్విమ్స్ డెరైక్టర్, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ బి.వెంగమ్మ పిలుపునిచ్చారు. స్విమ్స్ 5వ స్నాతకోత్సవ వేడుకలు సోమవారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పద్మవిభూషణ్ గ్రహీత, మణిపాల్ యూనివర్సిటీకి చెందిన జాతీయ పరిశోధనాచార్యులు డాక్టర్ మార్తాండ వర్మ శంకరన్ వలియాతన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    జ్యోతి ప్రజ్వలన చేసి స్నాతకోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.వెంగమ్మ మాట్లాడుతూ డిగ్రీలు పొందిన వైద్యులు నిరుపేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నారు. 1993లో ప్రారంభించిన స్విమ్స్ ఆసుపత్రి ద్వారా వైద్య, విద్య పరంగా పరిశోధనలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచామని గుర్తుచేశారు. ప్రాణదానం వంటి పథకాలతో పాటు పేదలకు ఉచిత వైద్యం, గ్రామీణ ప్రాంతాల్లో వై ద్యశిబిరాలు నిర్వహించి వైద్యసేవలు అందిస్తున్నట్టు తెలిపారు.

    ఈ సందర్భంగా వైద్యవిద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పంపిన స్నాతకోత్సవ ప్రసంగాన్ని వేదికపై ఆమె చదివి వినిపించారు. టెంపుల్ సిటీగా ఉన్న తిరుపతిలో స్విమ్స్ మెడికల్ హబ్‌గా ఎదగాలని మంత్రి సందేశంలో వినిపించారు. అనంతరం, స్విమ్స్ యూనివర్సిటీలో వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న 296 మంది వైద్య విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. అందులో ఉత్తమ ప్రతిభ చూపిన ఏడుగురికి బంగారు పతకాలు, నలుగురికి మెరిట్ సర్టిఫికెట్లు అందించారు.

    వీరందరికీ ప్రొఫెసర్ అల్లాడి మోహన్ నేతృత్వంలో వేద పండితులు వేదమంత్రోచ్ఛారణతో ఆశీర్వచనాలు, శ్రీవారి పుస్తక ప్రసాదాలు అందించారు. అనంతరం డాక్టర్ వెంగమ్మ చేతుల మీదుగా అతిథులైన డాక్టర్ మార్తాండ వర్మ శంకరన్ వలియాతన్, టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, ఎస్వీయూ వీసీ రాజేంద్ర, ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ టి.రవిరాజులకు శ్రీవారి చిత్రపటాలను జ్ఞాపికలుగా అందించారు.

    చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, స్విమ్స్ రిజిస్ట్రార్ ఆంజనేయులు, శ్రీపద్మావతి మహిళా మెడికల్ కళాశాల డీన్ రామసుబ్బారెడ్డి, మాజీ స్పీకర్ డాక్టర్ అగరాల ఈశ్వర్‌రెడ్డి, శ్రీసాయిసుధా హాస్పిటల్స్ డెరైక్టర్ డాక్టర్ సుధారాణి, తిరుమల డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, స్విమ్స్‌లోని అన్ని వైద్య విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement