రెడ్‌క్రాస్ ముసుగులో అవినీతి
► జనరిక్ మెడికల్ షాపు పేరుతో రూ.15 లక్షలు స్వాహా
► డిఫెన్స్ డ్ర గ్స్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న
► అధికారి చేతివాటం విచారణకు ఆదేశించిన స్విమ్స్ యాజమాన్యం
తిరుపతి కార్పొరేషన్ : వడ్డించేవాడు మనోడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏముంది అన్న సామెతలా మారింది స్విమ్స్‌లోని అధికారుల తీరు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (రెడ్‌క్రాస్) అంటే మంచి బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్‌ను తమకు అనుకూలంగా మలుచుకుని స్విమ్స్‌లోని కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. జనరిక్ మెడికల్ షాపు నుంచి బ్రాండెడ్ డ్రగ్స్ కొనుగోలు చేసి లక్షలాది రూపాయలు స్వాహా చే సిన ఘటనలో స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్‌పై చెక్ బౌన్స్ కేసు నమోదు కావడం, విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్విమ్స్‌లోని షాపు నంబరు 2లో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో జనరిక్ మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. ఇందులో హాస్పిటల్ డ్రగ్స్ అతి తక్కువ ధరకు విక్రయిస్తుంటారు.
అయితే జనరిక్ షాపు తిరుపతి కార్యదర్శి శ్రీశెట్టి, కోశాధికారి, ప్రస్తుత స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణరెడ్డి పేరుతో ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ నుంచి 2015 జనవరిలో రూ.24లక్షలకు బ్రాండెడ్ మందులు కొనుగోలు చేశారు. వాటిని అధిక ధరలకు విక్రయాలు చేసి సొమ్ము చేసుకున్నారు. మందులు తీసుకొచ్చిన హైద రాబాద్‌కు చెందిన శ్రీశక్తి జనరిక్ ఏజెన్సీ, గుంటూరుకు చెందిన విశ్వసాయి జనరిక్ ఏజెన్సీ, తిరుపతికి చెందిన వీరేంద్ర సర్జికల్ ఏజెన్సీలకు మాత్రం రూ.15.60లక్షలు చెల్లించకుండా స్వాహా చేశారు. సదరు ఏజెన్సీలు తమకు చెల్లని చెక్ ఇచ్చి మోసం చేశారని కేసు పెట్టడంతో వారికి నోటీసులు జారీ చేశారు.
విచారణకు ఆదేశించిన మంత్రి..
ఇక్కడ జరిగిన మోసాన్ని ఏజెన్సీలు మంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. ఆయన ఆదేశాల మేరకు స్విమ్స్ యాజమాన్యం గత ఏడాది నవంబర్‌లో సత్యనారాయణ, శ్రీశెట్టిపై విచారణకు క్రెడిట్ సెల్ ఏడీ స్థాయి అధికారి ఆదికృష్ణయ్యను నియమించింది. ఈ కేసులో ఉన్న మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ ఇదివరకే స్విమ్స్‌కు డిఫెన్స్ డ్రగ్స్ సరఫరా చేసిన ఆరోపణలో విచారణ ఎదుర్కొంటున్నారు. మరో నిందితుడు శ్రీ శెట్టి మాత్రం అజ్ఞాతంలో ఉన్నారు.
షాపు కేటాయింపులోనూ అవినీతి..
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రమణ్యం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ స్విమ్స్‌లో జనరిక్ మెడికల్ (జీవనధార ఫార్మసీ) షాపు పొందారు. 2014 ఆగస్టు 21న రెడ్‌క్రాస్ సొసైటీ పేరుతో షాపు నెంబరు 2ను మూడేళ్ల కాల పరిమితిపై వర్క్ ఆర్డర్ ఇచ్చారు. నెలకు రూ.15లక్షలకు పైగా బాడుగ వస్తున్న షాపు నెంబరు 2ను కేవలం నెలకు రూ.10వేలు బాడుగ చెల్లించేలా, అదికూడా మూడేళ్లకు వర్క్ ఆర్డర్ ఉంటే 5 సంవత్సరాలకు లోపాయికారి అగ్రిమెంట్‌పై అడ్డంగా కట్టబెట్టేశారు. తద్వారా సంస్థకు నెలకు లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లిందని స్విమ్స్ యాజమాన్యం భావిస్తోంది.