
చరిత్రలో 'మందడం' ప్రాశస్త్యం
అప్పట్లో ఓ వెలుగువెలిగిన ప్రాంతం
రాణి రుద్రమదేవి జన్మదిన వేడుకలకు వేదిక
తాజా పరిశోధనలో వెల్లడి
తెనాలి: ఆంధ్రుల కీర్తి పతాకగా, రాజరాజులు ఏలిన రాచరికపు ప్రాంతంగా విరాజిల్లిన తుళ్లూరు మండలం మందడం గ్రామం నేడు రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టానికి తెరలేచింది. రాజధాని ఆవిర్భావానికి మొదటి అడుగు అయిన భూమిపూజ శనివారం ఇక్కడే జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని ఒకసారి పరికిస్తే.. కాకతీయుల ఆనవాళ్లు అడుగడుగునా సాక్షాత్కరిస్తాయి. కాకతీయ రాజుల వంశావళి, గణపతిదేవుడి గుణగణాలు, రాణీ రుద్రమదేవి నడయాడిన ప్రాంతంగా కీర్తికెక్కింది. తాజాగా జరిపిన పరిశోధనల్లో రుద్రమదేవి జన్మదిన వేడుకలకు మందడమే వేదిక నిలిచిందని నిర్ధారణ కావడం విశేషం.
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శనివారం తుళ్లూరు మండలం మందడంలో భూమిపూజ జరిగింది. రాజధానికి ఈశాన్యంగా ఉన్న ఈ గ్రామానికి ఉత్తరంగా కృష్ణానది ప్రవహిస్తున్నందున వాస్తురీత్యా ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇక్కడే భూమిపూజ చేయాలని నిర్ణయించుకున్నారు. ఉత్తరవాహినిగా ఉన్న కృష్ణమ్మ తీరంలోని మందడం కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి పాలనలోనూ వెలిగింది.
గ్రామ శివారులోని మల్కాపురం, సుగాలీ కాలనీలోని పెద్ద శిలాశాసనం ఇందుకు సాక్షీభూతం. 14 అడుగుల ఎత్తు, 3.0 అడుగుల చదరంగా ఉన్న నల్లరాతిపై 200 పంక్తుల శాసనముంది. క్రీస్తుశకం 1261లో కాకతీయ గణపతిదేవుడు, ఆయన కుమార్తె రుద్రమదేవి కలిసి వేయించిన శాసనమిది. శతాబ్దం కిందటే ఈ శాసన విశేషాలు ప్రచురితమైనా, అవి కేవలం చక్రవర్తుల దానాలనే ప్రస్తావిస్తున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. ఆ గ్రామానికి నేటి ప్రాధాన్యత దృష్ట్యా రాష్ర్ట పురావస్తుశాఖలో రిటైరై, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ సీఈవోగా ఉన్న డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి మరోసారి శాసనాన్ని అధ్యయనం చేసి పలు అంశాలను కనుగొన్నారు.
రుద్రదేవీపురంగా ప్రసిద్ధి
ఉత్తరదేశంలోని గోళకి మఠ సంప్రదాయాన్ని మందడంలో ప్రవేశపెట్టి గోళకి మఠం, విశ్వేశ్వరుని ఆలయాన్ని ఇక్కడ నిర్మించింది గణపతిదేవుడే. ఆయన హామీ ఇచ్చినట్టుగా మందడం, వెలగపూడిని రుద్రమదేవి, విశ్వేశ్వర శివాచార్యుడికి దానమిచ్చారు. ఈ రెండింటినీ ఒక అగ్రహారంగా ప్రకటించి రుద్రదేవీపురంగా నామకరణం చేశారు. సంస్కృత కళాశాల, శైవులకు మఠం, వైద్యశాల, ప్రసూతి ఆస్పత్రి నిర్మించారు.
వెలగపూడితో సహా మందరంలంక, కృష్ణానది మధ్యలోని లంకలు, పెనుంబాక (పెనుమాక), తాండి (తాడికొండ), రావిపూండి (రావిపూడి) మొదలైన ఎనిమిది గ్రామాలకు, గోళకీ మఠంలోని విద్యార్థుల కోసం 60మంది బ్రాహ్మణులను రప్పించారు. ఆలయంలో సేవలకు నర్తకులు, వాద్యగాండ్రు, మద్దెలగాండ్రు, కాశ్మీర్ నుంచి గాయకులను పిలిపించారు. పది రకాల వృత్తిపనివారలను సమకూర్చారు. వీరభద్రులు అనే రక్షభటులు, వారి సేవకులైన వీరముష్టులు, నిమ్నవర్గాలతో సహా అన్నసత్రం, అందుకిచ్చిన దానాలు ఈ శాసనంలో ఉన్నాయి.
కాకతీయ సామ్రాజ్ఞి జన్మదిన వేడుకల వేదిక
కాకతీయ రాజుల వంశావళి, గణపతిదేవుడి గుణగణాలు, రుద్రమదేవి పరాక్రమాన్ని ఈ శాసనం తెలియజేస్తోంది. క్రీస్తుశకం 1199-1261 వరకూ తెలుగు నేలను పాలించిన గణపతిదేవుడు 1261లో తన కుమార్తె రుద్రమదేవిని సింహాసనం ఎక్కించారు. రుద్రమదేవి జన్మదిన వేడుకలు తండ్రి గణపతిదేవుడు, రాజగురువు విశ్వేశ్వర శివాచార్యుల సమక్షంలో మందడంలోనే వైభవంగా జరిగినట్టు ఉందని డాక్టర్ శివనాగిరెడ్డి వెల్లడించారు. (శ్రీరుద్రమదేవి భువం! యస్యా జన్మమహోత్సవమూ గణపతేః విక్రమ స్త్రి క్షోణిత జగద్దళం ప్రతిబళ ప్రధ్వంసి జన్మోత్సవః) రుద్రమదేవి ఏ సంవత్సరంలో జన్మించినదీ కచ్చితంగా తెలియకున్నా, ఆమె పుట్టిన తేదీ మాత్రం మార్చి 25వ తేదీ (చైత్రే సితేతరా ష్టమ్యాం వారే శుక్రాభిధానకే) శుక్రవారానికి సరిపోతుందని తమ పరిశోధనలో తేలిందన్నారు.
శాసనాల్లోని కీలక విషయాలు
అప్పట్లో భూములను కొలిచే పెనుంబాక గడె, పెనుమాకరెడ్డి ఆధ్వర్యంలో పంటకాలువలు తవ్వించటం, విశ్వేశ్వర శివాచార్యుడి కాళేశ్వరంలో మఠాన్ని నిర్మించి పొన్న గ్రామాన్ని దానంగా ఇచ్చిన విషయం ఈ శాసనంలో పేర్కొన్నారు. మంత్రకూటం (మంధని) చంద్రవల్లిలో శివలింగ ప్రతిష్ఠ, కంచంపల్లిలో చెరువుకట్ట ఎత్తు పెంచటం, మునికూటపురం (మున్నంగి)ను బ్రాహ్మణులకు దానం ఇవ్వటం, దుగ్గిరాల దగ్గర లింగ ప్రతిష్ఠ వంటి అనేక ధార్మిక కార్యక్రమాలతో పాటు మందడంలో ఆలయం నిర్మించి, శాసనం చెక్కిన శిల్పులకు చేసిన దానాలన్నింటినీ పేర్కొన్నారు. ఇంతటి విశిష్టత సంతరించుకున్న మందడం కేంద్రంగా ఇప్పుడు నూతన రాజధాని నిర్మాణానికి భూమిపూజ జరిగింది.
ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని పర్యాటకరంగ విస్తృతికి, ఇక్కడి విశ్వేశ్వర ఆలయం, శాసన పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది.