ప్రతియేటా చాలామంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) అందని ద్రాక్షగా మారుతోంది. ఏటా రైతులు పంటలను నష్టపోతున్నారు.
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ప్రతియేటా చాలామంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) అందని ద్రాక్షగా మారుతోంది. ఏటా రైతులు పంటలను నష్టపోతున్నారు. మరీ ముఖ్యంగా వేరుశనగ పంట చేతికి అందకపోవడంతో కోలుకోలేని రీతిలో దెబ్బతింటున్నారు. ఏదో ఒక రూపంలో ప్రకృతి కన్నెర చేస్తుండటంతో రూ.వందల కోట్ల పంట పెట్టుబడులు భూమిలో కలసిపోతున్నాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో అన్నదాతలను అన్నివిధాలా ఆదుకోవాల్సిన పాలకులు, అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
అరకొర పరిహారాన్ని ప్రకటించి పాలకులు చేతులు దులుపుకుంటుండగా... దాన్ని కూడా సక్రమంగా అందజేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2011, 2012కు సంబంధించి జిల్లాకు విడుదలైన ఇన్‌పుట్ సబ్సిడీలో ఇప్పటికీ రూ.350 కోట్లకు పైగా రైతులకు పంపిణీ కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పరిహారం కోసం రైతులు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ అలసిపోతున్నారు. ‘మిస్ మ్యాచింగ్’, జాబితాలో పేర్లు గల్లంతు కావడం వల్ల వేలాదిమంది రైతులకు అన్యాయం జరుగుతోంది. క్షేత్ర స్థాయిలో వీఆర్‌ఓలు, వ్యవసాయాధికారులు, బ్యాంకర్లు రైతులను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. వీరి మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. రూ.వందల కోట్ల పరిహారం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు.. అందులో రైతులకు అందకుండా ఎంత వెనక్కి వెళుతుందనే అంశంపై మాత్రం దృష్టి సారించడం లేదు.
వర్షాభావం, చివర్లో జల్ తుపాను వల్ల 2011 ఖరీఫ్‌లో 7.33 లక్షల హెక్టార్లలో పంటలు సర్వనాశనమయ్యాయి. దీంతో పంటలు నష్టపోయిన 6.72 లక్షల మంది రైతులకు 2012 ఏప్రిల్‌లో ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.398.71 కోట్లు విడుదలైంది. ఇందులో తొలివిడతగా 3.31 లక్షల మందికి రూ.229.24 కోట్లు, రెండో విడతగా 1.33 లక్షల మందికి రూ.87.38 కోట్లు జమ చేశారు. ఇంకా రూ.81 కోట్లు మిగిలిపోయింది.
మిగిలిపోయిన పరిహారం కోసం అధికారులు రెండు జాబితాలు తయారు చేశారు. ఇందులో ‘మిస్‌మ్యాచింగ్’ అయిన 69,408 మంది రైతులకు రూ.43.98 కోట్లు ఇవ్వడానికి వీలుగా ఒక జాబితా, అర్హులైన మరో 47,633 మందికి అందజేయడానికి వీలుగా రూ.28.40 కోట్లతో మరో జాబితా రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఇటీవల ‘మిస్ మ్యాచింగ్’ రైతులకు రూ.42.11 కోట్లు విడుదలైంది. రెండో జాబితాకు మాత్రం అనుమతి రాలేదు. ‘మిస్‌మ్యాచింగ్’ కింద విడుదలైన మొత్తంలోను కొంత మొత్తం పంపిణీ కాకుండా మిగిలిపోయేఅవకాశం కనిపిస్తోంది. మొత్తమ్మీద 2011కు సంబంధించి 50 వేల మంది రైతులకు కాస్త అటూ ఇటుగా రూ.30 కోట్లు పరిహారం అందకుండా పోయే సూచనలున్నాయి.
2012 ఇన్‌పుట్‌దీ అదే తీరు
2012 ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావం వల్ల 6.72 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 6.32 లక్షల మంది రైతులకు రూ.648.88 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ప్రకటించింది. ఇందులో తొలివిడతగా గత ఏడాది జూన్ 30వ తేదీన 39 మండలాలకు చెందిన 3.94 లక్షల మంది రైతులకు రూ.407.16 కోట్లు విడుదలైంది. ఈ మొత్తంలో రూ.378 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతుల పేర్లు, వారి అకౌంట్లు, బ్యాంకుల పేర్ల నమోదులో తప్పిదాల కారణంగా రూ.29 కోట్లు ‘మిస్‌మ్యాచింగ్’గా తేలింది. దీనివల్ల దాదాపు 30 వేల మంది రైతులకు పరిహారం జమ కావడం లేదు. ప్రస్తుతానికి తొలివిడత పంపిణీని పక్కనపెట్టారు. ఇటీవల రెండో విడతగా 2.11 లక్షల మందికి పంపిణీ చేయడానికి వీలుగా రూ.221.14 కోట్లు విడుదలైంది. దాన్ని ఇంతవరకు పరిహారం రాని 24 మండలాల పరిధిలోని 1.95 లక్షల మందితో పాటు ‘మిస్సింగ్ జాబితా’ రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే... ఇప్పటికీ బ్యాంకుల్లో జమ చేయలేదు. రైతుల ఖాతాల్లోకి చేరడానికి మరో నెల పట్టే అవకాశముంది.