రూ.200 కోట్ల ఇన్‌పుట్‌ వెనక్కి! | rs.200 crores input funds going to back | Sakshi
Sakshi News home page

రూ.200 కోట్ల ఇన్‌పుట్‌ వెనక్కి!

Published Mon, Jul 3 2017 11:15 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

rs.200 crores input funds going to back

= ఎక్కడ పొలం ఉన్నా...ఒక్క మండలం నుంచే పరిహారం  
= అర్హత ఉన్నా రూ.30 వేలు కూడా ఇవ్వకపోవడం
= ఈ–క్రాప్‌ కారణంగా చాలా మంది పేర్లు లేకపోవడం


అనంతపురం అగ్రికల్చర్‌: ఖరీఫ్‌ –2016లో దెబ్బతిన్న వేరుశనగ, ఇతర 16 రకాల పంటలకు సంబంధించి మంజూరైన రూ.1,032.42 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ (పెట్టుబడిరాయితీ) పరిహారంలో రూ.200 కోట్ల వరకు పంపిణీ కాకుండా ప్రభుత్వ ఖాజానాకు జమ కావచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ప్రకటించినట్లుగా 7.17 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినగా 6,25,050 మంది రైతులకు రూ.1,032.42 కోట్లు పరిహారం మంజూరైంది. కానీ వ్యవసాయశాఖ వద్ద ప్రస్తుతం ఉన్న జాబితాలు పూర్తిగా అప్‌లోడ్‌ చేసినా కాస్త అటు ఇటుగా రూ.850 కోట్లకు మించి ఉండకవపోవచ్చని తెలుస్తోంది. ఇంకా వివరాలు సేకరించి అప్‌లోడ్‌ చేసి ట్రెజరీకి సమర్పించినా... చివరకు కొంచెం అటుఇటుగా రూ.200 కోట్లు పరిహారం వెనక్కి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది.

మండలాల నుంచి డివిజన్లు, అక్కడి నుంచి జేడీఏ కార్యాలయానికి చేరిన జాబితాలను ఇన్‌పుట్‌సెల్‌ అధికారులు క్రోడీకరించి తుది జాబితాలు, వాటికి సంబంధించిన బిల్లులు ట్రెజరీకి సమర్పించే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. రూ.1,032 కోట్లకు సంబంధించి జాబితాలు వంద శాతం అప్‌లోడ్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చినా... క్షేత్రస్థాయిలో ఆ మేరకు చర్యలు కనిపించడం లేదు. ఈ సారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా ఉపయోగించుకుని కొత్త పద్ధతిలో ఇన్‌పుట్‌ పరిహారం పంపిణీ చేస్తుండటంతో అప్‌లోడ్‌ ప్రక్రియతో పాటు రైతుల ఖాతాల్లోకి పరిహారం జమ కూడా వేగవంతంగా చేస్తున్నారు.

గత నాలుగైదు రోజులుగా వ్యవసాయశాఖ అధికారులు అప్‌లోడ్‌ చేసి వాటికి సంబంధించి బిల్లులు ట్రెజరీకి సమర్పిస్తుండగా టోకెన్‌ తీసుకుని ట్రెజరీ అధికారులు నేరుగా రైతుల ఖాతాల్లోకి పరిహారం జమ చేస్తున్నారు.  ఇప్పటివరకు రూ.770 కోట్ల జాబితాలు అప్‌లోడ్‌ చేయగా, రైతుల ఖాతాల్లోకి రూ.500 కోట్ల వరకు పరిహారం జమ అయినట్లు చెబుతున్నారు. మిగతా మొత్తం నాలుగైదు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి వేస్తామంటున్నారు. అందులో ఈనెల 5న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మీట నొక్కించి కొంత మొత్తం జమ అయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇదంతా పూర్తి చేసినా రూ.850 కోట్లకు మించి ఉండకపోవచ్చని తెలుస్తోంది.

కారణాలు అనేకం: ఈ సారి ఆధార్‌ అనుసంధానాన్ని పకడ్బందీగా చేపట్టడంతో ఒక రైతుకు ఒక మండలంలోనే పరిహారం వర్తింపజేశారు. కొందరు రైతులకు ఒకటి కాకుండా రెండు మూడు మండలాల్లో కూడా పొలాలు ఉన్నాయి. పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటివరకు అంతో ఇంతో పరిహారం కూడా తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇపుడు ఆధార్‌ అనుసంధానం చేయడంతో ఒకటి ఉంచి మిగతా వాటిని తొలగించేశారు. ఇక కొన్ని మండలాల్లో ఐదు, పది ఎకరాలు ఉన్నా ప్రభుత్వం ప్రకటించినట్లుగా రూ.30 వేలు వర్తింపజేయకుండా బాగా తగ్గించేసినట్లు రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు రైతులకు ఐదు ఎకరాలున్నా రూ.10 వేలు, రూ.15 వేలు ఇలా... బాగా తగ్గించినట్లు వాపోతున్నారు. మరికొన్ని మండలాల్లో సమస్యలెందుకని భూవిస్తీర్ణం చూడకుండా రూ.20 నుంచి రూ.24 వేల ప్రకారం వేసినట్లు చెబుతున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు చోటా మోటా నేతలు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి రూ.30 వేలు రాయించుకున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ–క్రాప్‌ బుకింగ్‌ను ప్రాతిపదికగా తీసుకోవడంతో పంటలు మారిపోవడం, పరిహారం కూడా తారుమారైంది. మరికొందరు అర్జీలు సమర్పించినా వాటిలో రాజకీయ వివక్షతో చాలా వరకు పక్కకు పెట్టినట్లు కూడా రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి కారణాల వల్ల జిల్లాకు మంజూరైన ఇన్‌పుట్‌ పరిహారంలో పెద్ద మొత్తంలో మిగిలిపోవడం ఖాయమని చెబుతున్నారు. దీంతో పాటు పంపిణీ చేసిన జాబితాలో జరిగిన పొరపాట్ల కారణంగా ‘మిస్‌మ్యాచింగ్‌’ జాబితా కూడా రూ.50 కోట్లకు పైగా తేలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  ఇదే విషయాన్ని జేడీఏ పీవీ శ్రీరామమూర్తిని వివరణ కోరగా... అలాంటిదేమీ ఉండదని కొట్టిపారేశారు. అప్‌లోడ్‌ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున ఎంత మిగులుతుందనే విషయాన్ని ఇపుడే చెప్పలేమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement