అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాకు మంజూరైన రూ.1,032.42 కోట్ల పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ) పరిహారం విడుదలైనట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. గతంలో మాదిరిగా కాకుండా పంపిణీ ప్రక్రియను మార్పు చేసినందున ఒకేసారి మొత్తం పరిహారం జిల్లా ట్రెజరీకి విడుదలైందన్నారు. ట్రెజరీ నుంచి ప్రిన్సిపల్ బ్యాంకులకు జమ చేయడానికి జాబితాలు సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు. మండలాల వారీగా ఒకటికి రెండు సార్లు జాబితాలు పరిశీలించిన తర్వాత ఇన్‌పుట్ సెల్ అధికారులు ట్రెజరీకి సమర్పించడానికి తుది జాబితాలు రూపొందిస్తున్నారని తెలిపారు. మిస్‌మ్యాచింగ్‌లు నివారించడానికి డివిజన్ స్థాయిలో ఏడీఏలకు బాధ్యతలు అప్పజెప్పామన్నారు. 24న పంపిణీ ప్రారంభించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు.