ఇన్‌‘ఫట్‌’ సబ్సిడీ | Input 'subsidy | Sakshi
Sakshi News home page

ఇన్‌‘ఫట్‌’ సబ్సిడీ

Published Mon, Sep 11 2017 11:00 PM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM

Input 'subsidy

  •  2014 ఇన్‌పుట్‌ పంపిణీ నిలుపుదల
  • రెండేళ్ల తర్వాత రూ.50 కోట్ల నిధులు వెనక్కి
  • మిస్‌మ్యాచింగ్‌ జాబితాలో రూ.10 కోట్లు పెండింగ్‌
  •  

    అనంతపురం అగ్రికల్చర్‌:
    వర్షాలు సక్రమంగా కురవక.. పంటలు పండక రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. ప్రభుత్వం నుంచి  ఏ కొద్దోగొప్పో సాయమందినా కొంత ఊరట కలుగుతుంది..ఇలాంటి సమయంలో రైతులకు మంజూరైన పరిహారం పంపిణీ చేయకుండా రెండేళ్ల తర్వాత ఖజానాకు వెనక్కి పంపారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ పరిహారం అందుతుందనుకున్న రైతన్నలకు మొండిచేయి చూపినట్లయ్యింది.

        2014 ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 5,81,471 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిని నష్టపోయిన 5,79,640 మంది రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.567,32,74,088 పరిహారం మంజూరు చేశారు. అందులో నకిలీ పాస్‌పుస్తకాలు, డబుల్‌ ఎంట్రీలు ఉన్నట్లు గుర్తించి వాటి కింద 7,529 మంది రైతులకు దక్కాల్సిన రూ.7.64 కోట్లు పరిహారం ఇవ్వకుండా మొదట్లోనే ప్రభుత్వానికి వెనక్కి పంపారు. అంతిమంగా 5,72,111 మంది రైతులకు రూ.559,68,40,424 నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.

    ఇష్టారాజ్యంగా రైతుల జాబితాలు
    తొలిసారిగా ఇన్‌పుట్‌ సబ్సిడీకి ఆధార్‌ లింక్‌ చేసి ‘ఆన్‌లైన్‌ లైసెన్సు మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఓఎల్‌ఎంఎస్‌) కింద ఈ–రైతు సేవలు’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఆన్‌లైన్‌ చేసే క్రమంలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తడం, ముఖ్యంగా ఆధార్‌ నంబర్‌ డిస్‌ప్లే కాకపోవడం, డిస్‌ప్లే అయినా పెద్ద ఎత్తున తప్పులు దొర్లడం, వాటిని సరిచేయడానికి నానాపాట్లు పడ్డారు. ఇందులో కొందరు రైతులకు ఆధార్‌ లేకపోవడం, జాబితాలు తప్పుల తడకలుగా మారిపోయాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకోవడంతో జాబితాలు ఇష్టారాజ్యంగా మార్చేశారు.

    2014 ఇన్‌పుట్‌ పంపిణీకి ఫుల్‌స్టాప్
    ఖరీఫ్‌–2014 ఇన్‌పుట్‌ పంపిణీకి ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు. అయినా పూర్తి స్థాయి పరిహారం రైతులకు పంపిణీ చేయకుండానే ముగింపు పలికారు. ఆర్థికంగా చితికిపోయి బక్కచిక్కిన రైతులకు అందాల్సిన రూ.50 కోట్ల వరకు పరిహారం అలా ప్రభుత్వ ఖజానాకు చేరిపోయింది. మరో రూ.10 కోట్లు మిస్‌ మ్యాచింగ్‌ జాబితాలో నిలిచిపోగా దాన్ని సరిచేసుకునేందుకు రైతులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. పేరున్నా రాలేదంటూ ఇంకా చాలా మంది రైతులు వ్యవసాయశాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా వేలాది మంది తిరిగి తిరిగి వేసారిపోయి ఆశలు వదిలేసుకున్నారు. ఇప్పటికీ రోజూ కనీసం 50 మంది రైతులు 2014 ఇన్‌పుట్‌ సమస్యపై జేడీఏ కార్యాలయానికి వస్తున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

    అర్హత ఉన్నా అందని పరిహారం
    అర్హత ఉన్నా చాలా మంది పేర్లు గల్లంతు కావడం, పేరున్నా పరిహారం తక్కువగా ఇవ్వడం, కొన్ని ప్రాంతాల్లో అయితే ఐదెకరాలున్న రైతులకు కూడా రూ.1,000 లేదా రూ.2 వేలు మాత్రమే దక్కింది. దీనికితోడు పరిహారం ఒకేసారి విడుదల చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తూ రావడం వల్ల పంపిణీ ప్రసహనంగా సాగింది. ఒకటి, రెండు సార్లు కాదు.. ఏకంగా పది విడతలుగా పరిహారం విడుదల చేశారంటే ఎంత దయనీయంగా ఉందో తెలుస్తుంది.

    2015 పరిహారం రెండేళ్ల తర్వాత పంపిణీ
    2015 ఆగస్టులో తొలివిడతగా పరిహారం విడుదల చేయగా పదో విడత 2017 ఫిబ్రవరిలో విడుదల చేశారు. ఈ కారణాల వల్ల పరిహారం కోసం రైతులు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు.  ఒకటి, రెండు సార్ల కంటే ఎక్కువ సార్లు తిరిగిన రైతులు ఎందరో అని చెప్పాలి. కొందరైతే 30 నుంచి 40 సార్లు మండలాలు, డివిజన్లు, జిల్లా కేంద్రం, బ్యాంకుల చుట్టూ తిరిగి అలసిపోయారు. తిరగడానికి, వచ్చిన ప్రతిసారీ ఆధార్, బ్యాంకు అకౌంట్, పట్టానెంబర్‌ జిరాక్స్‌ల కోసం, రానుపోనూ చార్జీల కోసం రూ.వేలు ఖర్చు చేసుకున్నవారు చాలా మందే ఉన్నారు. పరిహారం రాని వారు పెద్ద సంఖ్యలోనే మిగిలారు. మిస్‌మ్యాచింగ్‌ను సరిచేసుకునేందుకు ఇప్పటికీ అవస్థలు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు రూ.521 కోట్లు పంపిణీ పూర్తయినట్లు వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.  
     
    2014లో దెబ్బతిన్న పంటల విస్తీర్ణం    : 5.81 లక్షల హెక్టార్లు
    మంజూరైన ఇన్‌పుట్‌ పరిహారం    : రూ.567.32 కోట్లు
    బాధిత రైతుల సంఖ్య            : 5.79 లక్షల మంది
    రెండేళ్లుగా పంపిణీ చేసిన పరిహారం    : రూ.521 కోట్లు
    పరిహారం అందుకున్న రైతుల సంఖ్య    : 5.37 లక్షల మంది
    మిస్‌మ్యాచింగ్‌లో ఉన్న పరిహారం    : రూ.10 కోట్లు
    పరిహారం పంపిణీ కాకుండా మిగిలింది    : రూ. 51 కోట్లు
    పరిహారం దక్కని రైతులు సంఖ్య    : 42 వేల మంది


     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement