ముంచావు ‘బాబు’! | chandra babbu naidu | Sakshi
Sakshi News home page

ముంచావు ‘బాబు’!

Published Wed, Mar 11 2015 2:50 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

పదేళ్లు పంటసాగు చేస్తే.. 8 ఏళ్లు నష్టాలే.. అయినా జిల్లా రైతులు బెదరరు. కొన్నేళ్లుగా ధైర్యంగా ఏటా సాగుకు సన్నద్ధమవుతారు.

 సాక్షిప్రతినిధి, అనంతపురం:  పదేళ్లు పంటసాగు చేస్తే.. 8 ఏళ్లు నష్టాలే.. అయినా జిల్లా రైతులు బెదరరు. కొన్నేళ్లుగా ధైర్యంగా ఏటా సాగుకు సన్నద్ధమవుతారు. దీనికి కారణం.. పంటనష్టపోయినా ప్రభుత్వాలు ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సురెన్స్‌తో ఎంతో కొంత ఆదుకుంటాయనే నమ్మకం ఇచ్చిన ధైర్యం. చంద్రబాబు సర్కారు వైఖరితో ఆభరోసాను కూడా రైతు కోల్పోయే పరిస్థితి. ‘అనంత’ రైతులకు హక్కుగా రావాల్సిన రూ.675 కోట్ల ఇన్‌ఫుట్‌సబ్సిడీ ఇవ్వకుండా మొండిచేయి చూపేందుకు రంగం సిద్ధం చేసింది. ఇదే జరిగితే ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ‘అనంత’ రైతును ప్రభుత్వం మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్లే.
 
  ఐదేళ్ల కిందట వరకూ జిల్లాలో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 8.50లక్షల హెక్టార్లు ఉండేది. వర్షాభావంతో ఏటా సాగు విస్తీర్ణం తగ్గుతోంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 552 మిల్లీమీటర్లు. ఏటా 30-50శాతం లోటు వర్షపాతం నమోదవుతోంది. ఈ ఏడాది 276 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. వర్షాధారంపై ఆధారపడి వేరుశనగను సాగు చేయడమే ఏకైక మార్గం. అయితే 2004 నుంచి పంటనష్టపోతే భారీగా ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్ రూపంలో ప్రభుత్వాలు ‘అనంత’ రైతులను ఆదుకుంటున్నాయి. 2008కి సంబంధించి రూ.640కోట్ల పంటలబీమాను అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు. అప్పటి నుండి ఏటా ప్రభుత్వాలు దన్నుగా నిలిచి ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ను మంజూరు చేస్తూ అండగా నిలుస్తున్నాయి.
 
 జిల్లాలో ఇన్‌పుట్‌సబ్సిడీ
 బకాయిలు రూ.675కోట్ల:
 కరువొచ్చినా, భారీ వరా్షాలు వచ్చినాప్రభుత్వం పెట్టుబడి రాయితీని అంచనా వేసి పంట నష్టపరిహారాన్ని చెల్లించాలి. 2013లో జిల్లాలో వర్షాభావంతో పూర్తిగా పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. జిల్లాలోని 63 మండలాలను కరువు మండలాలుగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. రూ.643.37కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ కోసం జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ఇందులో ఒక్క వేరుశనగ రైతుకే దాదాపు రూ.600కోట్ల పరిహారం రావాలి. దీంతో పాటు 2011, 2012కు సంబంధించి మరో రూ.32 కోట్ల బకాయిలు ఉన్నాయి. మొత్తం రూ.675.55కోట్ల జిల్లా రైతులకు అందాల్సి ఉంది.
 
 పాతబకాయిలు ఎగవేతకు రంగం సిద్ధం:
 2013లో లాగే గతేడాదీ వర్షాభావంతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. రూ.573.01కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీ కోసం కలెక్టర్ ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఈ క్రమంలో పాతబకాయిలు, గతేడాది పరిహారం కలిపి రూ.1248కోట్ల ఇన్‌ఫుట్‌సబ్సిడీ వస్తుందని జిల్లా రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
 
 జిల్లాలో రూ.6817.85కోట్ల  వ్యవసాయ రుణాల బకాయిలుంటే రుణమాఫీ చేస్తామని అధికారాన్ని దక్కించుకున్న టీడీపీ ప్రభుత్వం మాట మార్చింది. మాఫీలో కొర్రీలు పెట్టి రూ.2,234.57కోట్ల మాత్రమే మాఫీ చేస్తామని, ఇందులో తొలివిడతగా రూ.780కోట్ల మాత్రమే విడుదల చేసింది. రుణమాఫీ అవుతుందని ఆశపడిన రైతులు, ప్రభుత్వం చేతిలో మోసపోయామని భావించి ఇప్పటికే 49మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
 
 ఈక్రమంలో రైతులకు ఆసరాగా నిలవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది.  2014కు సంబంధించిన నివేదికలు మాత్రమే సమర్పించాలని, 2013తో పాటు పాత బకాయిలు ఇవ్వలేమని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రూ. 675.55కోట్ల పరిహారం జిల్లా రైతులకు దక్కకుండాపోయే ప్రమాదముంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి శరాఘాతంగా పరిణమించనుంది.  
 
 ఇన్‌పుట్ సబ్సిడీ రైతుల హక్కు
 జిల్లాలోని రైతాంగానికి రావాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తం వెంటనే చెల్లించాలి. టీడీపీ ప్రభుత్వం ఈ సంవత్సరానికి సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీ అందజేస్తామని చెప్పడం దారుణం. చంద్రబాబు ప్రతి విషయంలోను ఏదో ఒక షరతు పెట్టి కోతలు విధిస్తున్నాడు. ఇన్‌పుట్ సబ్సిడీ అనేది రైతుల హక్కు. వారి హక్కును ఎవరు అడ్డుకోకూడదు. వెంటనే రైతులకు రావాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తం అందజేయాల్సిందే..
 ఎం.శంకర్‌నారాయణ, వెఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement