సాక్షి, విశాఖపట్నం: పై-లీన్ తుపాను ప్రభావం కాస్త తగ్గడంతో కొన్ని రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే ఆదివారం ప్రకటించింది. పలు స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడిపినట్లు తెలిపింది. హౌరా- పూరి మధ్య రైలు సర్వీసులను పునరుద్ధరించినట్లు పేర్కొంది. భువనేశ్వర్-రూర్కెలా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, పూరి- సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-న్యూఢిల్లీల మధ్య సంపర్క్‌క్రాంతి, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ఆదివారం సాయంత్రం షెడ్యూల్ సమయం కన్నా ఆలస్యంగా భువనేశ్వర్ నుంచి బయల్దేరినట్లు తెలిపింది. పూరి నుంచి బయల్దేరనున్న కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను షెడ్యూల్ ప్రకారమే నడిపిస్తున్నామని, మరికొన్ని ఆలస్యంగా బయల్దేరుతాయని పేర్కొంది.
రద్దు లేదా పాక్షిక రద్దు: పై- లీన్ తుపాను ప్రభావం ఆదివారం రైల్వే వ్యవస్థపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఒడిశా వైపు వెళ్లే దాదాపు అన్ని రైళ్లను రద్దు చేయడమో, లేక కొద్దిదూరం వరకు తీసుకెళ్లి నిలిపేయడమో చేశారు. దాంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రైల్వే శాఖ కూడా భారీగా నష్టపోతోంది. వాల్తేరు డివిజన్‌కు ఇప్పటివరకు రూ. 32 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. తూర్పు కోస్తా రైల్వే, దక్షిణ మధ్య రైల్వే దాదాపు 70 రైలు సర్వీసులను రద్దు చేశాయి. విశాఖపట్నం హౌరాల మధ్య అన్ని రైళ్లను ఆదివారం కూడా రద్దుచేశారు. ముంబై, చెన్నైల నుంచి హౌరా వైపు వస్తున్న కొన్ని రైళ్లను దారి మళ్లించారు. తుపాను ప్రభావంతో ట్రాకులు దెబ్బతినడం, ట్రాకులపైకి నీళ్లు రావడంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. హైదరాబాద్-హౌరా ఈస్ట్‌కోస్ట్, సికింద్రాబాద్- గువాహటి ఎక్స్‌ప్రెస్ రైళ్లను కాజీపేట్, నాగపూర్ మీదుగా నడుపుతున్నారు.
జల్పాయ్‌గురి -చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను బిలాస్‌పూర్, నాగ్‌ఫూర్, వరంగల్, విజయవాడల మీదుగా; హల్దియా-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను ఖరగ్‌ఫూర్, బిలాస్‌పూర్, బల్లార్షా, విజయవాడల మీదుగా నడుపుతున్నారు. కొన్ని ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లను మాత్రం తూర్పుగోదావరి జిల్లా వరకే నడిపి తిరిగి అక్కడినుంచి వెనక్కు పంపుతున్నారు. రైళ్లు రద్దు కావడంతో రిజర్వేషన్లు చేయించుకున్న ప్రయాణికులకు డబ్బులు వెనక్కు ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసింది. విశాఖ నుంచి విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లలో గరీబ్థ్,్ర గోదావరి, ముంబై వైపు వెళ్లే ముఖ్యమైన వాటిని ఆలస్యమైనా పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
రద్దు చేసిన సర్వీసులు: భువనేశ్వర్- తిరుపతి, భువనేశ్వర్- సికింద్రాబాద్, పూరి- తిరుపతి, తిరుపతి-బిలాస్‌పూర్, భువనేశ్వర్- ముంబై, తిరుపతి-భువనేశ్వర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, విజయవాడ-రాయిగఢ్, మచిలీపట్నం-విశాఖ, విజయవాడ-విశాఖ, కాకినాడ-విశాఖ ప్యాసెంజర్ రైళ్లను కూడా రద్దు చేశారు. ముంబై-భువనేశ్వర్ (కోణార్క్ ఎక్స్‌ప్రెస్), బెంగళూరు- భువనేశ్వర్(ప్రశాంతి ఎక్స్‌ప్రెస్), యశ్వంత్‌ఫూర్- పూరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-భువనేశ్వర్(విశాఖ ఎక్స్‌ప్రెస్) రైళ్లను విశాఖపట్నం, భువనేశ్వర్‌ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు.
పలాస వరకే అనుమతి: ఒడిశా, శ్రీకాకుళం ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కొన్నిచోట్ల పట్టాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. దాంతో వాల్తేరు డివిజన్ పరిధిలో సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, చెన్నై, మహారాష్ట్రల నుంచి విశాఖ మీదుగా ఒడిశా, కోల్‌కతా వెళ్లే రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్లను శ్రీకాకుళం జిల్లా పలాస వరకు మాత్రమే నడుపుతున్నారు. పలాసలో ఆహార, వసతి తదితర ఇబ్బందులు కలిగే అవకాశముండటంతో కొన్ని రైళ్లను విశాఖ వద్ద రద్దుచేస్తున్నారు.