బిడ్డను ఇలా చూస్తాననుకోలేదు
- సూర్యం మృతదేహాన్ని చూసి విలపించిన తండ్రి సుబ్బయ్య
- ఇంటర్ తప్పిన తరువాత 2014లో దళంలో చేరిక
- ఏడాదికే మృత్యువాత
పాడేరు: ఏఓబీలోని ముంచంగిపుట్టు మండలం రంగబయలు అటవీ ప్రాంతంలో పోలీసు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు దళ సభ్యుడు సూర్యం అలియాస్ సొన్ను మృతదేహాన్ని చూసి తండ్రి కొప్పర్తి సుబ్బయ్య(60) కన్నీరుమున్నీరయ్యారు. ఆయన ప్రకాశం జిల్లా కురసపాడు నుంచి శనివారం కొడుకు మృతదేహం కోసం ఇక్కడికి వచ్చారు. 3 రోజుల క్రితం పోలీసులు సమాధి చేసిన తనయుడి మృతదేహాన్ని వెలికి తీస్తున్నప్పుడు తల్లడిల్లిపోయారు.
సుబ్బయ్యతోపాటు సూర్యం మేనత్త ఆంజనేయమ్మ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమది పేద కుటుంబమని, ఇంటర్మీడియట్ పరీక్ష తప్పిన సూర్యం నేనిక చదివించ లేనని భావించి 2014 మే నెలలో ఇంటి నుంచి చెప్పకుండా వచ్చేశాడని, కడసారి చూపుకోసం సమాధి నుంచి బైటకు తీసి చూడవలసి వస్తుందని అనుకోలేదని రోదించాడు. కొడుకు సూర్యం ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఫొటోను తీసుకు వచ్చి విలేకరులకు చూపించారు.
తనకు ముగ్గురు సంతానమని, సూర్యం ఇలా కడతేరిపోతాడని తాను ఎన్నడూ ఊహించలేదన్నారు. మా కురసపాడు పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ సూర్యం మృతి చెందిన విషయాన్ని 26న తెలియజేయడంతో పౌరహక్కుల సంఘం నేతలను ఆశ్రయించి వారితో కలసి 13 గంటలు ప్రయాణించి ఇక్కడకు వచ్చామని చెప్పారు. పోలీసులు సమాధి నుంచి సూర్యం మృతదేహం వెలికితీసి తండ్రి సుబ్బయ్యకు అప్పగించారు. అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.