ఐదేళ్ల క్రితం పీడకల వంటి బలిమెల సంఘటనను ఎవరు మరిచిపోగలరు? నాటి సంఘటనతో ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ప్రస్ఫుటమైంది.
సీలేరు, న్యూస్‌లైన్: ఐదేళ్ల క్రితం పీడకల వంటి బలిమెల సంఘటనను ఎవరు మరిచిపోగలరు? నాటి సంఘటనతో ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ప్రస్ఫుటమైంది. ఆ పట్టు ఇప్పటికీ కొనసాగుతోందని నిరూపించే విధంగా, బలిమెల రిజర్వాయర్‌లో లాంచీల రాకపోకలను నిలిపేయాలని మావోయిస్టులు హెచ్చరించారు. దాంతో పది రోజులుగా ఆ రిజర్వాయర్‌లో లాంచీ ప్రయాణం ఆగిపోయింది. ఫలితంగా 120 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
నిత్యావసర సరకులు అందక అక్కడి గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. మావోయిస్టుల హెచ్చరికలతో ఒడిశా ప్రభుత్వం లాంచీల ప్రయాణాన్ని నిలిపివేసింది. ఇంతవరకు రోజుకు ఐదు లాంచీలు తిరిగేవీ. వీటి ద్వారా చిత్రకొండ నుంచి చుట్టుపక్కల గ్రామాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసేవారు. గిరిజనులకు వైద్యసేవలు కూడా కల్పించేవారు. అయితే మావోయిస్టులు మాత్రం అక్కడి గిరిజనులకు ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా బీఎస్‌ఎఫ్ బలగాలను మోహరించి వారిని భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపిస్తూ లాంచీలను నిలిపేయమని అల్టిమేటం ఇచ్చారు.
మావోయిస్టు కమాండర్ మాధవను బీఎస్‌ఎఫ్ బలగాలు హతమార్చడంతో వారు మరింత ఆగ్రహంతో వున్నారు. మారుమూల ప్రాంతాల్లో బీఎస్‌ఎఫ్ బలగాల బేస్‌క్యాంపులు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సాయుధ బలగాలకు సరకులు అందకుండా లాంచీలను నిలిపేశారు. పది రోజులుగా లాంచీలు తిరగకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని, వాటిని పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.