మార్కెట్‌కు కొత్త బెల్లం
క్రమంగా పెరుగుతున్న లావాదేవీలు
పుంజుకుంటున్న ధర... క్వింటా రూ. 3530లు
సానుకూలంగా ఉంటుందని మార్కెట్ వర్గాల్లో ఆశ
అనకాపల్లి: అనకాపల్లి మార్కెట్‌కు కొత్త బెల్లం వస్తోంది. వారం రోజులుగా పరిసర ప్రాంతా ల్లో తయారీతో మార్కెట్‌లో లావాదేవీలు పుంజుకుంటున్నాయి. ప్రధానంగా మునగపాక, కశింకోట, తిమ్మరాజుపేట ప్రాంతాల్లో బెల్లం వండుతున్నారు. దసరా నాటికి ఇది మరింత ఊపందుకుంటుంది. ధర సైతం ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్ వర్గాల్లో ఆశావహ దృక్పథం కనిపిస్తోంది. హుద్‌హుద్ నష్టాల నుంచి రైతులు ఇప్పుడిప్పుడే బయటపడుతూ కొత్త సీజన్‌పై కోటి ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ నెల ఒకటో తేదీన మార్కెట్‌కు 501 దిమ్మలు రాగా.. మొదటి రకం గరిష్టంగా క్వింటా రూ.2940లు ధర పలికింది. గురువారం మార్కెట్‌కు 1064 దిమ్మలు వచ్చాయి. మొదటి రకం రూ.3530లు పలకడంతో రైతుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. గతేడాది సెప్టెంబర్ లో మార్కెట్‌కు 5170 క్వింటాళ్ల బెల్లం రాగా, మొదటి రకం సరాసరి క్వింటా రూ. 3020లు పలికింది. అక్టోబర్‌లో హుద్‌హుద్ ధాటికి మార్కెట్‌ను కుదేలయింది. అప్పటి నష్టాల నుంచి రైతులు ఇప్పుడిప్పుడే తేరుకుంటూ బెల్లం తయారీ చేపడుతున్నారు.
ఆశ, నిరాశల మధ్య...
మార్కెట్‌లో ఈ ఏడాది బెల్లం లావాదేవీలపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. గతేడాది నాటి పరిస్థితులు ఉండవని వాతావారణ శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ, ఆర్థిక శాస్త్రవేత్తల ముందస్తు ధరల సూచికలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. అదే సమయంలో జిల్లాలో చెరకు విస్తీర్ణం సైతం సాధారణం కంటే 6వేల హెక్టార్లు తగ్గిపోయినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇవన్నీ మార్కెట్‌కు ప్రతికూల పరిస్థితులను ప్రస్పుటం చేస్తుండగా, బెల్లం వ్యాపారానికి మేలు కలుగుతుందనే వాదన కూడా లేకపోలేదు. తుమ్మపాల యాజమాన్యం ఇప్పటికీ గతేడాది బకాయిలు రైతులకు చెల్లించకపోవడం, రానున్న సీజన్‌కు సన్నాహాలు ప్రారంభం కాకపోవడంతో బెల్లం తయారీకే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో గోవాడ సైతం న ష్టాల్లోకి వెళ్లింది. పొరుగు జిల్లాకు చెందిన ప్రైవేట్ కర్మాగారం సైతం తక్కువ ధరకు అగ్రిమెంట్లు తీసుకోవడంతో బెల్లం తయారీయే మేలని రైతులు భావిస్తున్నారు. వినాయక చవితి, దసరా, దీపావళి పండగలు నాటికి లావాదేవీలు పెరుగుతాయని, ధర కూడా అనుకూలంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు ఆశపడుతున్నాయి. దీనికి సూచనగానే వారం రోజుల నుంచి మార్కెట్‌లో లావాదేవీలు ఊపందుకున్నాయి. ధర సైతం పుంజుకుంటోంది. ఈ సీజన్ బాగుంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.